• Home »
  • Broadband »
  • కేబుల్ వ్యాపారంలో కారేజ్ ఫీజుకు గండి: ఎమ్మెస్వోల పొట్టకొట్టే ఎపి ఫైబర్ నెట్

కేబుల్ వ్యాపారంలో కారేజ్ ఫీజుకు గండి: ఎమ్మెస్వోల పొట్టకొట్టే ఎపి ఫైబర్ నెట్

కేబుల్ వ్యాపారంలో మౌలిక సదుపాయాల కల్పనకోసం పెట్టే భారీ పెట్టుబడులమీద ఆదాయం సంపాదించుకోవాలంటే కేవలం చందాదారులు చెల్లించే  నెలవారీ చందాలు సరిపోవు. పే చానల్స్ కోసం వసూలు చేసిన సొమ్ములో అత్యధికభాగం బ్రాడ్ కాస్టర్లకే వెళ్ళిపోతుంది కాబట్టి అందులోనూ పెద్దగా మిగిలేదేమీ ఉండదు. అందువలన ఇతర మార్గాలలో ఆదాయం సమకూర్చుకున్నప్పుడే ఎమ్మెస్వోలు గాని కేబుల్ ఆపరేటర్లు గాని తమ నెట్ వర్క్ లు నడుపుకోగలరు.

స్థానిక కేబుల్ చానల్స్ ద్వారా వచ్చే ప్రకటనల ఆదాయం, బ్రాడ్ కాస్టర్లు చెల్లించే కారేజ్ ఫీజు మాత్రమే ఈ అదనపు ఆదాయాలు. వీటివల్లనే చందాదారులమీద భారం కొంత మేరకు తగ్గుతున్నది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కారేజ్ ఫీజు ఆదాయానికి గండి కొట్టటానికి పూనుకుంది. ఉచిత చానల్స్ పంపిణీ పేరుతో అ చానల్ యజమానులకు  మేలు చేసి ఎమ్మెస్వోల పొట్ట కొట్టటానికే  ఈ పద్ధతిని వాడుకుంటోంది. ఇప్పటికే డిజిటైజేషన్ నిబంధనలు బ్రాడ్ కాస్టర్లకు అనుకూలంగా ఉన్నాయనుకుంటుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్థ ఎపి ఫైబర్ నెట్ విధానాలు సైతం అదే దిశలో సాగుతున్నాయి.

డిజిటైజేషన్ లో కేబుల్ ద్వారా పంపిణీ చేసే చానల్స్ కనీసం 100 ఉండాలనేది ప్రభుత్వ విధానం. వాటిలో దూరదర్శన్ చానల్స్ 24 ఉండాలి. అయితే మిగిలిన చానల్స్ విషయంలో ఎలాంటి నిబంధనా లేదు. అదే సమయంలో డిజిటైజేషన్ నిబంధనలలో ఎక్కడా కారేజ్ ఫీజును వ్యతిరేకించలేదు. కారేజ్ ఫీజు వసూలు చేసుకోవటానికి వీలుండటమంటే ఉచిత చానల్ అయినా సరే ఇవ్వకుండా ఉండే హక్కు ఎమ్మెస్వో/ఆపరేటర్ కు ఉండటమే. స్థానిక చానల్స్ అన్నీ ఇచ్చేస్తే ఇక కారేజ్ ఫీజ్ కట్టేదెవరు ? ఈ విషయం ఆలోచించకుండా ఎపి ఫైబర్ నెట్ అధికారులు తీసుకున్న 100  ఉచిత చానల్స్  నిర్ణయాన్ని ఎమ్మెస్వోలు పూర్తిగా అడ్డుకుంటారు. ది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదయోగ్యం కాదు.

ఉచిత చానల్స్ ఇచ్చి కేబుల్ టీవీ ప్రసారాలు అందిస్తున్నామని చెప్పుకోవటమే ఒక దారుణమైన విషయం. ట్రాయ్ విధించిన నిబంధనను తనకు తానే వర్తింప జేసుకొని వంద  చానల్స్ ఒక పరిమితి అనుకొని భ్రమపడటం ఒక ఘోర తప్పిదం. దీనివలన  ఎమ్మెస్వో స్వేచ్ఛకు కళ్ళెం వేసినట్టే, ఆదాయానికి గండి కొట్టినట్టే. దీన్ని ఎమ్మెస్వోలు ఎట్టిపరిస్థితుల్లోనూ సహించరు. జనవరి 29 న ట్రాయ్ విడుదల చేసిన చర్చాపత్రంలోనూ కారేజ్ ఫీజును క్రమబద్ధం చేసే ప్రతిపాదన ఉంది. మార్చి 25 వరకూ అభిప్రాయాలు సేకరించి ఆ తరువాత ఎప్పుడైనా నిర్ణయం ప్రకటించవచ్చు. ఏమైనప్పటికీ కారేజ్ ఫీజును హక్కుగా భావించే ఎమ్మెస్వోలు దాన్ని వదులుకోవటానికి సిద్ధంగా ఉండరు.

ఎపి ఫైబర్ నెట్ అధికారులకు తెలియాల్సిన ఒక ప్రాథమిక సత్యం ఏంటంటే, ట్రాయ్ చెప్పింది కనీసం 100 ఉచిత చానల్స్ ఇవ్వాలని మాత్రమే. అంతే తప్ప అది గరిష్ఠ పరిమితి కాదు. అందుకే ఇంకో యాభై చానల్స్ కూడా కలిపి ఇస్తే వాటిలోనుంచి 100 చానల్స్ ఏరుకునే  స్వేచ్ఛ ఎమ్మెస్వోకి ఉంటుంది. దాని ఆధారంగా కారేజ్ ఫీజు ఇచ్చిన చానల్స్ ని మాత్రమే 100 లో చేర్చి పంపిణీ చేస్తాడు. తన ప్రాంతంలోని ప్రేక్షకుల డిమాండ్ ని బట్టి ఏయే ఉచిత చానల్స్ ఇవ్వాలో నిర్ణయించుకుంటాడు

చానల్స్ పెంచటం వలన ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఉత్తరాంధ్రలో ఇప్పుడు మొదటి దశ అమలు చేయబోతున్నారు. శ్రీకాకుళం సరిహద్దుల్లో ఒడియా తెలిసినవాళ్ళు అక్కడి చానల్స్ ఏవైనా చూడాలనుకోవచ్చు. ఈ జాబితాలో ఒడియా ఉచిత చానల్స్ చేర్చవచ్చు. అప్పుడు ఆ ప్రాంత ఎమ్మెస్వోలు ఆ చానల్స్ పంపిణీ చేస్తారు. అదే విధంగా విశాఖ నగరంలో హిందీ చానల్స్ చూసే వాళ్ళు ఎక్కువమంది ఉండవచ్చు. అలాంటి చోట వీలైనన్ని హిందీ చానల్స్ ఇవ్వటం ఆవసరం.  నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తమిళ చానల్స్ చూసేవాళ్ళుంటారు. అనంతపురం, చితూరు జిల్లాల్లో కన్నడ చానల్స్ చూసేవాళ్ళుంటారు. ఎక్కడికక్కడ ఎమ్మెస్వోలు వాటి నుంచి ఎంచుకునేలా  స్వేచ్ఛ ఉండేలా వీలైనన్ని ఎక్కువ ఉచిత చానల్స్ ఇవ్వాలే తప్ప ట్రాయ్ నిబంధనను అర్థం చేసుకోలేక 100 కు పరిమితం కావటంలో అర్థం లేదు. ఆ మాటకొస్తే ఇప్పుడు డిజిటైజేషన్ పూర్తయిన చోట 200 కు పైగా ఉచిత చానల్స్ ఇస్తున్న ఎమ్మెస్వోలున్నారు

ప్రభుత్వం ఇంత ప్రచార ఆర్భాటంతో చేపడుతున్న ఈ పథకంలో ఆ పాటి కనీస అవగాహన లేకుండా నిర్ణయాలు తీసుకోవటం దురదృష్టకరం. అక్కడ పనిచేసే ప్రభుత్వోద్యోగులకు ఈ విషయాలు కొత్త కావచ్చు. కానీ ఇది ప్రతిస్పందించటంలో చాలా సున్నితమైన వ్యవస్థ. ఏ మాత్రం అనాలోచితంగానో అవగాహ్నారాహిత్యంతోనో వ్యవహరిస్తే మొత్తం పథకమే నీరుగారిపోయే ప్రమాదముంది. కేబుల్ పంపిణీలోకి దిగాలా వద్దా అనుకునేది ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఎలాగూ దిగాలనుకున్నప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియక అభిప్రాయ సేకరణ పేరుతో చర్చా పత్రాల ద్వారా అవగాహన పెంచుకుందామనుకుంటే ఎమ్మెస్వోల దగ్గర పప్పులుడకవు, క్షేత్ర స్థాయి సమస్యలమీద పట్టులేకపోతే సలహాదారుల ద్వారా అయినా తెలుసుకోవాలి. ఎలాగూ అన్ని విభాగాలలో సలహాదారులను నియమించుకోవటం ప్రభుత్వానికి కొత్తకాదు గదా!