• Home »
  • Uncategorized »
  • అర్ణబ్ గోస్వామి కొత్త చానల్ ’రిపబ్లిక్’

అర్ణబ్ గోస్వామి కొత్త చానల్ ’రిపబ్లిక్’

పేరుమోసిన జర్నలిస్ట్, యాంకర్ ఆర్ణబ్ గోస్వామి ఎట్టకేలకు తన కొత్త చానల్ వివరాలు బైటపెట్టారు. టైమ్స్ నెట్ వర్క్ నుంచి బైటికి వచ్చినప్పటినుంచి ఆయన ఏం చేయబోతున్నారనే విషయంలో కొంత సందిగ్ధత కొనసాగుతూ వచ్చింది. ఏ చానల్ లో చేరే అవకాశముందో కొన్ని ఊహాగానాలు సాగుతూ ఉండగా, ఎవరితో చేతులు కలిపి చానల్ ప్రారంభిస్తారో అనే కోణంలొ మరికొన్ని అంచనాలు సాగాయి.

అయితే వీటన్నిటికీ తెరదించుతూ ఆయన తన ప్రయత్నం గురించి వెల్లడించారు. రిపబ్లిక్ పేరుతో ఒక కొత్త శాటిలైట్  న్యూస్ చానల్ తో బాటు వెబ్ కూడా ఉండేలా డిజిటల్ వెంచర్ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు. పైగా, తన చానల్ రిపబ్లిక్ ను జనవరి 26 న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రారంభిస్తున్నట్టు కూడా వెల్లడించారు. తన ప్రాజెక్టుకు అందరూ సహకరించాలంటూ ఒక ఇంటర్వ్యూలో విజ్ఞప్తి చేశారు.

బెంగళూరుకు చెందిన వ్యాపారి రాజీవ్ చంద్రశేఖర్ తో ఆర్ణబ్ గోస్వామి చేతులు కలుపుతున్నట్టు కొంత కాలంగా ఊఅహాగానాలు సాగుతూ వచ్చాయి. రూపర్ట్ మర్దోక్ కు చెందిన ట్వెంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్ కూడా ఇందులో భాగస్వామి అనే వార్తలూ వెలువడ్డాయి. అయితే, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వార్తా సంస్థల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు  49% మించకూడదు. అందువలన మిగిలిన 51% ఏకైక భారతీయుడిదై ఉండాలనే నిబంధన కూడా ఉంది.

టైమ్స్ నెట్ వర్క్ లో కీలకపాత్ర పోషించి ఆ చానల్ ఎదుగుదలకు ముఖ్య బాధ్యుడిగా కూడా వ్యక్తిగతంగా పేరు తెచ్చుకున్న ఆర్ణబ్ గోస్వామి వైదొలగటం వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. నవంబర్ 1 నుంచి బాధ్యతల నుంచి తప్పుకోగా ఆయన స్థానంలో న్యూస్ ఎక్స్ కు చెందిన శివశంకర్ చీఫ్ ఎడిటర్ అయ్యారు. ఇలా ఉండగా ఆర్ణబ్ తప్పుకున్నప్పటికీ టైమ్స్ చానల్ గత ఐదు వారాలుగా నెంబర్ వన్ స్థానంలోనే కొనసాగుతూ వస్తోంది.