• Home »
  • Advertisement Code »
  • తప్పుదారి పట్టించే ప్రకటనలమీద వెయ్యికి పైగా ఫిర్యాదులు, తక్షణ చర్యలు

తప్పుదారి పట్టించే ప్రకటనలమీద వెయ్యికి పైగా ఫిర్యాదులు, తక్షణ చర్యలు

నిరుడు మార్చి 15 న వినియోగదారుల వ్యవహారాల విభాగం ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన వెబ్ పోర్టల్ www.gama.gov.in కు వెయ్యికి పైగా ఫిర్యాదులందాయి. వీటిని పరిశీలించాల్సిందిగా ప్రభుత్వం భారత ప్రకటనల ప్రమాణాల మండలి ( Advertising Standards Council of India ) ని కోరింది. దీనిమీద ప్రకటనల ప్రమాణాలమండలి ఒక ప్రకటన చేస్తూ తాము అందుకున్న వెయ్యికి పైగా ఫిర్యాదులలో అధికభాగం వ్యక్తులనుంచి వచ్చాయని, కొన్ని మాత్రం వినియీగదారుల సంఘాలనుంచి వచ్చాయని పేర్కొంది.

ఈ ఫిర్యాదులలో దాదాపు అన్ని రకాల ఉత్పత్తులు, సేవలకు సంబంధించినవి ఉన్నాయి. అందులో టెలికాం, బాంకింగ్, వినియోగవస్తువులతోబాటు  ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఈ కామర్స్ సేవలమీద కూడా ఉన్నాయి. ఈ ప్రకటనలలో టీవీ, రేడియో, పత్రికలు, వెబ్ సైట్స్ ఉన్నట్టు పేర్కొంది. ప్రకటనల ప్రమాణాల మండలి పరిశీలించిన మీదట వినియీగదారుల ఫిర్యాదులమండలి ఆ ఫిర్యాదులన్నీ సబబేనని ధ్రువీకరించింది.

అలా అభియోగాలు ఎదుర్కున్న ప్రకటనలన్నీ ఉపసంహరించుకోవటమో, సవరించుకోవటమో జరిగిందని వెల్లడించారు. దీన్ని బట్టి ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఫిర్యాదుల విభాగం గామా (Grievances Against Misleading Advertisements ) సమర్థంగా పనిచేస్తునట్టు రుజువైందని కూడా ఆ ప్రకటన పేర్కొంది.  ఒకవైపు ప్రభుత్వం, మరోవైపు స్వీయ నియంత్రణకోసం పనిచేసే ప్రకటనల ప్రమాణాలమండలి కలసి పనిచేయటం వలన అద్భుత ఫలితాలు సాధించవచ్చునని రుజువైనట్టు మండలి వ్యాఖ్యానించింది.