త్వరలో టీవీ తెరమీద ’బాహుబలి’

బాహుబలి త్వరలో మలయాళీ టీవీ చానల్ ’మళవిల్ మనోరమ’ లో ప్రసారం కాబోతోంది. ఈ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని త్వరలో ప్రసారం చేయబోతున్నట్టు చానల్ లో ఇప్పటికే ప్రచారప్రకటనలు మొదలయ్యాయి. తెలుగుతో బాటు హిందీ, తమిళం , మలయాళంలో విడుదలైన ఈ చిత్రం శాటిలైట్ ప్రసారహక్కులు కొనుగోలు చేసిన మళవిల్ మనోరమ ప్రసారతేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు. గతంలో రాజమౌళి చిత్రాలు మగధీర, ఈగ కూడా ఇదే చానల్ కొనుగోలు చేసింది.

క్రిస్మస్ కోసం మధుర నరనాగ చిత్రాన్ని సిద్ధం చేసినట్టు ముందే ప్రకటించినప్పటికీ దీపావళి, క్రిస్మస్ లలో ఏ పండుగ నాడు ఏ సినిమా అనేది ఇంకా నిర్థారించుకోలేదని చానల్ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది జులై 10 న విడుదలైన బాహుబలి లాంటి భారీ చిత్రాన్ని ఆరు నెలలలోపే ప్రసారం చేయటం ద్వారా తగిన ఫలితాలుంటాయని చానల్ భావిస్తోంది. భాషతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమా చూస్తారని కూడా ఆశిస్తోంది.