• Home »
  • BARC »
  • రేటింగ్స్ సమాచారం కోసం ఎమ్మెస్వోల హెడ్ఎండ్స్ మీద ఆధారపడబోతున్న బార్క్

రేటింగ్స్ సమాచారం కోసం ఎమ్మెస్వోల హెడ్ఎండ్స్ మీద ఆధారపడబోతున్న బార్క్

రేటింగ్స్ తెచ్చుకోవటానికి నాణ్యమైన కార్యక్రమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవటం బాగా కష్టమైపోతున్నదంటూ అక్రమ మార్గాలు వెతుక్కుంటున్నవాళ్ళ సంఖ్య పెరిగిపోతున్న తరుణంలో ప్రత్యామ్నాయ మార్గాల మీద బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్  (బార్క్) దృష్టి పెట్టింది.  నిజానికి సెట్ టాప్ బాక్సులలోనే ఒక చిప్ అమర్చటం ద్వారా ప్రేక్షకాదరణ డేటా కచ్చితంగా సంపాదించవచ్చునని సాంకేతిక నిపుణులు చెప్పిన తరువాత ట్రాయ్ నాలుక కరుచుకుంది. ఇప్పుడు చేయగలిగేదేమీ లేదు కాబట్టి బార్క్ కూడా మరేదైనా మార్గం ఉన్నదా అనే ఆలోచనలో పడింది.

ఇటీవల బెంగళూరులో అరెస్టయిన రేటింగ్స్ దొంగలు అనుసరిస్తున్న విధానం ప్రకారం శాంపిల్ ఇళ్ళ వారికి నచ్చజెప్పి ఆయా చానల్స్ ఎక్కువ సేపు ఆన్ చేసి ఉండేట్టు చూస్తున్నారు. శాంపిల్ ఇళ్ళ యజమానులతో కుమ్మక్కైనప్పుడు చేయగలిగేదేమీ లేదు. అక్రమాలకు పాల్పడినవాళ్ళమీద చర్యలు తీసుకున్నా అక్రమాలు ఆగుతాయన్న నమ్మకం కూదా లేకపోవటంతో కచ్చితమైన డేటా సేకరించటానికి ఆచరణయోగ్యమైన విధానాలమీద బార్క్ దృష్టి పెట్టింది.

ఈ క్రమంలో పంపిణీ వేదికలనుంచి సమాచారం సేకరించాలన్న ఆలోచన వచ్చింది. అంటే డిజిటల్ హెడ్ ఎండ్స్ నుంచి చందాదారులు ఏ కార్యక్రమం ఎంతసేపు చూశారనే సమాచారాన్ని రిటర్న్ పాత్ ద్వారా ఎప్పటికప్పుడు అందుకోగలిగే ఏర్పాటు చేసే ఇళ్ల దగ్గర జరిగే మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చునని బార్క్ భావిస్తోంది.  ఈ పద్ధతి వలన చానల్స్ కూడా అభ్యంతరం చెప్పే అవకాశం ఉండదని, లెక్కలు కచ్చితంగా తేలతాయని అంచనాకు వచ్చింది. అప్పుడు కచ్చితమైన సమాచారం రావటమే కాకుండా శాంపిల్ సైజు కూడా గణనీయంగా పెరిగి. లోపాల శాతం బాగా తగ్గిపోతుంది.

శాంపిల్ ఇళ్ల సంఖ్య లక్షల్లో  ఉన్నప్పుడు ఆ ఇళ్ళ సమాచారం బైటికి పొక్కినా అన్ని ఇళ్ళ వాళ్లకి నచ్చజెప్పటం సాధ్యమయ్యేపనికాదు. ఆ విధంగా బ్రాడ్ కాస్టర్లకు, ప్రకటనదారులకు కూడా సరైన సమాచారం అందించటానికి ఇది ఉపయోగపడుతుంది. అదే సమయంలో బార్క్ వారు లోకల్ చానల్స్ కు సంబంధించిన ప్రేక్షకాదరణ లెక్కలు కూడా ఇచ్చే అవకాశం ఉండటం పంపిణీ సంస్థలకు ఉపయోగకరంగా ఉంటుంది.

ఇప్పటికే డెన్ నెట్ వర్క్స్ తో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని పరీక్షించి చూస్తోంది.ముందుగా ఎమ్మెస్వో పరిధిలోని కొన్ని సెట్ టాప్ బాక్సులలో ఒక చిప్ అమర్చటం ద్వారా ఆ సమాచారం హెడ్ ఎండ్ దగ్గర నిక్షిప్తమై ఉండేటట్టు చర్యలు తీసుకుంటోంది. ఇదంతా ఎలాంటి లోపాలూ లేకుండా ఉన్నట్టు ఋజువైతే దేశమంతటా విస్తరించాలన్న అభిప్రాయంలో ఉంది. ప్రస్తుతం బార్క్30 వేల శాంపిల్ ఇళ్ళనుంచి సమాచారం సేకరిస్తోంది. ఈ ఏడాది ఆ సంఖ్యను 40 వేలకు పెంచాలన్న ఆలోచనలో ఉంది.

ఇప్పుడు పంపిణీ సంస్థలైన ఎమ్మెస్వోలు, డిటిహెచ్, హిట్స్ ఆపరేటర్లు ఒప్పుకుంటే శాంపిల్ సైజును లక్షన్నర నుంచి రెండు లక్షల దాకా పెంచాలని కూడా బార్క్ భావిస్తోంది. ఎక్కువ ఖర్చు పెట్టకుండా శాంపిల్ సైజు పెంచుకోవటానికి ఇదొక చక్కటి మార్గమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం బార్క్ శాంపిల్ సైజు గరిష్ఠంగా50 వేలకు పెరగాల్సి ఉంది. ఈ చర్య వలన లక్ష్యానికి మూడు రెట్లు పెరిగే వెసులుబాటు కలుగుతుంది.

రిటర్న్ పాత్ వాడకం ద్వారా సేకరించే సమాచారం పట్ల జీ యూనిమీడియా సీవోవో అశిష్ సెహగల్ సంతోషం వ్యక్తం చేశారు. వరుసగా డిటిహెచ్ ఆపరేటర్లు, హిట్స్ ఆపరేటర్లు కూదా ముందుకు వస్తారని ఆశాభావంతో ఉన్నారు. మరింత కచ్చితమైన సమాచారమే అంతిమ లక్ష్యమన్నారాయన. ఇండియాకాస్ట్ మీడియా సీఈవో అనూజ్ గాంధీ కూడా ఆయన అభిప్రాయంతో ఏకీభవించారు. బ్రాడ్ కాస్టర్లకు కూడా ప్రేక్షకుల అభిరుచి మీద సరైన అవగాహన కలగటానికి ఈ విధానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

అయితే ఈటీవీ నెట్ వర్క్ సీఈవో బాపినీడు మాత్రం కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఎమ్మెస్వోలను, డిటిహెచ్ ఆపరేటర్లను ఒప్పించటం బార్క్ కు ఏమంత సులభం కాకపోవచ్చునన్నారు. నిజానికి కచ్చితమైన డేటా వస్తుందనటంలో మాత్రం ఎలాంటి సందేహమూ లేదన్నారు. అలాంటి సమాచారం సేకరణలో ప్రేక్షకుల పాత్ర బాగా తగ్గటం వలన డేటాను తారుమారు చేయటం కుదరదన్నారు. ఒక్కో శాంపిల్ కయ్యే సగటు ఖర్చు కూడా తగ్గటం బార్క్ కు లాభదాయకమన్నారు.

ఎబిపి న్యూస్ నెట్ వర్క్ సీవోవో అవినాశ్ పాండే కూడా ఈ విధానాన్ని సమర్థించారు.  ఇక మీదట రియల్ టైమ్ డేటా అందుకునే వీలు కూదా కుదురుతుందని, ఏరోజుకారోజే రేటింగ్స్ ఇవ్వటానికి కూదా వీలవుతుందని వ్యాఖ్యానించారు.  ఎంత ఎక్కువమంది ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు చేరితే అంత సమర్థంగా, కచ్చితంగా రేటింగ్స్ డేటా అందుతుందని అన్నారు. ఇది పరిశ్రమకు శుభసూచకమని అభిప్రాయపడ్దారు.