• Home »
  • BARC »
  • టీవీ రేటింగ్స్ లో పెనుమార్పులు: వచ్చే నెల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ లెక్కింపు

టీవీ రేటింగ్స్ లో పెనుమార్పులు: వచ్చే నెల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోనూ లెక్కింపు

టెలివిజన్ కార్యక్రమాలకు, చానల్స్ కు ప్రేక్షకాదరణను కొలిచే రేటింగ్స్ లో పెనుమార్పులు రాబోతున్నాయి. ఇప్పటిదాకా వదిలేసిన గ్రామీణ ప్రేక్షకులను కూడా లెక్కలోకి తీసుకోవటమే అందుకు కారణం. దాదాపు సగం భారతదేశాన్ని వదిలేసి లెక్కిస్తూ వచ్చిన రేటింగ్స్ వాస్తవచిత్రాన్ని ప్రతిబింబించటం లేదనే విమర్శలుండగా ఇప్పుడు అందుకు సమాధానం రాబోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో శాంపిల్స్ తీయకపోవటం వల్లనే రేటింగ్స్ లో వెనుకబడ్డామని సమాధానం చెప్పుకుంటూ వచ్చిన దూరదర్శన్ ఇకమీదట బుకాయించటానికి అవకాశముండదు.

గతంలో టామ్ మాత్రమే రేటింగ్స్ లెక్కిస్తూ ఉండగా అది పెద్ద పెద్ద నగరాలలో 40 శాతం శాంపిల్స్ తీసేది. ద్వితీయశ్రేణి నగరాలలో 20 శాతం తీసి, మిగిలిన 40 శాతం కూడా లక్ష జనాభా దాటున పట్టణాలలోనే తీసేది. దీనివలన మండలకేంద్రం, అంతకంటే తక్కువ ఉన్న గ్రామాలేవీ లెక్కలోకి వచ్చేవి కావు. ఆవిధంగా దేశంలో దాదాపు సగం జనాభాను విస్మరించినట్టయ్యేది. రేటింగ్స్ లెక్కల్లోకి రాని జనాభా కోసం ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టనవసరం లేదనే ధోరణి చానల్స్ ప్రదర్శించేవి.

అయితే, టామ్ మీద అనేక విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం రేటింగ్స్ కమిషన్ వేసి విచారణ జరిపించింది. ఆ కమిటీ ఇచ్చిన సిఫార్సులప్రకారం శాంపిల్స్ సంఖ్య 10 వేలనుంచి 50 వేలకు పెంచటంతోబాటు లక్శ్జలోపు జనాభా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లోనూ 30 శాతం శాంపిల్స్ తీయాల్సి ఉంది. దీంతో ఈ నిబంధనలకు కట్టుబడుతూ స్వయంగా బ్రాడ్ కాస్టర్లు, యాడ్ ఏజెన్సీలు. అడ్వర్టయిజర్లు కలిసి బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ ( బార్క్) పేరుతో ఒక రేటింగ్ వ్య్వస్థ ఏర్పాటు చేసుకున్నాయి.

బార్క్ ఇప్పటికే 20 వేల శాంపిల్స్ సేకరిస్తుండగా ఏటా పదేసి వేల చొప్పున పెంచుతూ 50 వేల శాంపిల్స్ కు చేరుకోవటానికి సంసిద్ధత వెలిబుచ్చింది. అదే విధంగా గ్రామీణ ప్రాంతాలమీద కూడా దృష్టిపెట్టటానికి నిర్ణయించుకుంది. ఈ సెప్టెంబర్ నుంచి లక్షలోపు జనాభా ఉండే గ్రామీణ ప్రాంతాల్లోనూ శాంపిల్స్ తీయబోతున్నట్టు ముందే ప్రకటించింది. అందుకు అనుగుణంగానే వచ్చే నెలనుంచీ గ్రామీణ ప్రాంతాల రేటింగ్స్ సమాచారం కూడా ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది.

దీంతో రేటింగ్స్ లో పెనుమార్పులు వస్తాయని పరిశ్రమ నిపుణులు అంచనావేస్తున్నారు. చానల్స్ కార్యక్రమాల్లో ఎక్కువభాగం నగర, పట్టణ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకొని రూపొందిస్తూ ఉండటమే అందుకు కారణం. దీనివలన కొత్త రేటింగ్స్ లో మార్పులు కనబడే పక్షంలో చానల్స్ అన్నీ తమ కార్యక్రమాలలో చాలా మార్పులు చేయాల్సి రావచ్చునని భావిస్తున్నారు. అదే జరిగితే, గ్రామీణ ప్రేక్షకుల ఆదరణ కోసం చానల్స్ సరికొత్త కార్యక్రమాలు తయారుచేయటం మీద దృష్టిపెడతాయి.

ఇక దూరదర్శన్ విషయానికొస్తే, ఈ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. దూరదర్శన్ ప్రేక్షకుల్ ఎక్కువగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నట్టు డిడి చెప్పుకుంటూ వస్తోంది. నిజానికి డిడి చేపట్టే ప్రేక్షకాదరణ లెక్కింపు ( డార్ట్ ) లో డిడి కి గణనీయమైన ఆదరణ ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఇప్పుడు బార్క్ కూడా లెక్కింపు చేపట్టటం వలన నిజానిజాలు తెలుస్తాయని భావిస్తున్నారు.

న్యూస్ చానల్స్ కూడా అనేక విధాలుగా తగిన మార్పులు చేసుకోవాల్సి వస్తుంది. ఇన్నాళ్ళూ పట్టణ ప్రాంతపు యువతను టార్గెట్ గా చెప్పుకుంటూ వచ్చిన న్యూస్ చానల్స్ ఇకమీదట గ్రామప్రాంతాలను దృష్టిలో పెట్టుకోక తప్పదు. పైగా రేటింగ్ సెంటర్స్ లో ఎమ్మెస్వోలకు మాత్రమే కారేజ్ ఫీజు ఇచ్చి చానల్ వచ్చేలా చూసుకునే అవకాశం ఇకమీదట ఉండదు. శాంపిల్స్ తీసే గ్రామీణ ప్రాంతాలు పెద్ద స్దంఖ్యలో ఉండే వీలుండటమే అందుకు కారణం.

మొత్తంగా చూస్తే టీవీ చానల్స్ అన్నీ గ్రామీణ ప్రాంత ప్రజల అభీష్టానికి పెద్దపీట వేయటానికి ప్రయత్నించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే సమయంలో అడ్వర్టయిజర్లు ఎలా స్పందిస్తారనేది కూడా కీలకమవుతుంది. ఉత్పత్తుల వాడకాన్ని బట్టి ఏ ఉత్పత్తికి ఏ మార్కెట్లో ప్రచారం చేయాలో నిర్ణయించుకోవటానికి ఈ లెక్కలు బాగా ఉపయోగపడతాయి.

అయితే, ఎటొచ్చీ ఇది చాలామంది ఎమ్మెస్వోలకు ఇబ్బంది కలిగిస్తుంది.ఇప్పటివరకూ పరిమితంగా కొన్ని పట్టణాలకే పరిమితం కావటంతో ఆ పట్టణలకు చెందిన ఎమ్మెస్వోలు ఎక్కువ కారేజ్ ఫీజు డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ, ఇకమీదట విస్తృతి బాగా పెరగటం వలన డిమాండ్ చేసే అవకాశం తగ్గిపోతుంది. అయితే, చానల్స్ ఇప్పుడు కాస్త తగ్గించి అయినా, ఎక్కువమందికి ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి పెద్దగా లాభలడేదేమీ ఉండకపోవచ్చు. ఎమ్మెస్వోల విషయంలో మంది ఎక్కువవటం వలన మజ్జిగ పలచబడవచ్చుగాని చానల్స్ కు మాత్రం అంత మజ్జిగా తప్పకపోవచ్చు.