• Home »
  • Top Stories »
  • అమెజాన్ తో చేతులు కలిపిన బెస్ట్ డీల్ టీవీ

అమెజాన్ తో చేతులు కలిపిన బెస్ట్ డీల్ టీవీ

బాలీవుడ్ తార శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా ఇటీవలే ప్రారంభించిన హోమ్ షాపింగ్ చానల్ బెస్ట్ డీల్ టీవీ అంతర్జాతీయ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ తో వ్యాపార ఒప్పందం కుదుర్చుకుంది. దీనివలన సెలెబ్రిటీలు ప్రచారం చేసే అనేక ఫ్యాషన్, లైఫ్ స్టైల్ ఉత్పత్తులను ఇకమీదట అమెజాన్ ద్వారా కూడా కొనుగోలు చేసేందుకు వీలవుతుంది.

భారత వినియోగదారులకు తాము కొనదలచుకున్న ఉత్పత్తులను ఎంచుకునేందుకు అత్యధిక స్వేచ్ఛ కల్పిస్తూ ముందుకు సాగాలన్న తమ లక్ష్యానికి బెస్ట్ డీల్ టీవీ మరింత ఊతమిస్తుందని అమెజాన్ అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా ఇకమీదట టెలీషాపింగ్, ఆన్ లైన్ షాపింగ్ చెట్టాపట్టాలేసుకొని నడుస్తాయనటానికి తామే ఆదర్శమని, కొనుగోలుదారులు చౌక ధరలకు వేగంగా అందుకునే అనుభూతిని సొంతం చేసుకోగలుగుతారని ధీమా వ్యక్తం చేసింది.
భారతదేశంలోని అతిపెద్ద ఆన్ లైన్ స్టోర్ ద్వారా తమ ఉత్పత్తుల పంపిణీ ప్రారంభించటం సంతోషంగా ఉందని బెస్ట్ డీల్ టీవీ సీఈవో రాజ్ కుంద్రా వ్యాఖ్యానించారు. సెలెబ్రిటీలు ఎండార్స్ చేసిన ప్రత్యేక బ్రాండ్లు మారుమూలకు సైతం చేరగలగటం ఇందులో ప్రత్యేకతగా అభివర్ణించారు. శిల్పాశెట్టి డిజైన్ చేసిన స్లిమ్ షేప్ జీన్స్, నీతూ లుల్లా చీరెలు, అనుష్కా దండేకర్ జెగ్గింగ్స్, అక్షయ్ కుమార్ ఎకె క్లాతింగ్, ట్విస్ట్ హెడ్ ఫోన్స్, నేహా ధూపియా హెయిర్ ఎక్స్ టెన్షన్స్, బిపాసా బసు ఎయిర్ ఫ్రయర్స్ ఇంకా పలువురు సెలెబ్రిటీలు ఎండార్స్ చేసిన మొబైల్ ఫోన్స్ కూడా ఇందులో ఉన్నాయి.