• Home »
  • Cable »
  • భీమవరం కమ్యూనిటీ నెట్ వర్క్ పరిధి విస్తరణకు ఎంఐబి గ్రీన్ సిగ్నల్

భీమవరం కమ్యూనిటీ నెట్ వర్క్ పరిధి విస్తరణకు ఎంఐబి గ్రీన్ సిగ్నల్

ఇప్పటికే డిజిటల్ ఎమ్మెస్వోగా లైసెన్స్ పొందిన భీమవరం కమ్యూనిటీ నెట్ వర్క్ తన పరిధిని విస్తరించుకోవటానికి పెట్టుకున్న దరఖాస్తుకు కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ ఆమోదముద్ర వేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో మూడు, నాలుగు దశల డిజిటైజేషన్ జరిగే ప్రాంతాలన్నిటిలో కేబుల్ సర్వీసుల కార్యకలాపాలు నిర్వహించుకోవటానికి అనుమతి కోరగా ప్రభుత్వం ఆమోదించింది.

ఇలా ఉండగా, అక్టోబర్ 21 నాటికి దేశవ్యాప్తంగా డిజిటల్ ఎమ్మెస్వోలుగా లైసెన్స్ పొందినవారి సంఖ్య 436 కు చేరుకుంది. వీరిలో 226 మందికి శాశ్వత లైసెన్సులు లభించగా, మిగిలిన 210 మందికి తాత్కాలిక లైసెన్సులు మంజూరయ్యాయి. సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దు చేస్తునట్టు హోం శాఖ చెప్పినప్పటికీ ఇంకా నిర్దిష్టమైన ఉత్తర్వులు అందకపోవటంతో ప్రస్తుతం తాత్కాలైక లైసెన్సులు మాత్రమే మంజూరు చేస్తున్నారు. హోంశాఖ క్లియరెన్స్ పొందినవారికి మాత్రమే శాశ్వత లైసెన్స్ మంజూరవుతోంది.

సెప్టెంబర్ ఆఖరుకు మొత్తం 399 మందికి లైసెన్సులు మంజూరు కాగా అందులో 173 మందికి తాత్కాలిక లైసెన్సులు వచ్చాయి. ఇప్పుడు తాజాగా విడుదలైన జాబితాలో ఒకే ఒక ఎమ్మెస్వోకు శాశ్వత లైసెన్స్ వచ్చింది. తమిళనాడులోని మూడు, నాలుగు దశల డిజిటైజేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న నీలగిరి కేబుల్ టీవీ ప్రైవేట్ లిమిటెడ్ కు శాశ్వత లైసెన్స్ మంజూరైంది. తాత్కాలిక లైసెన్సులు మంజూరైన ఎమ్మెస్వోలలో అతుల్ సరాఫ్ ఆధ్వర్యంలోని ఎబిఎస్ డిజిటల్ కేబుల్ ఎక్విప్ మెంట్ తయారీ సంస్థ కాట్ విజన్, ఉత్తరాఖండ్ కు చెందిన పుందిర్ స్టార్ డిజిటల్, గోవాకు చెందిన గోవా డిజిటల్ కో ఆపరేటివ్ సొసైటీ తదితర సంస్థలున్నాయి.