• Home »
  • Cable »
  • భోపాల్ కేబుల్ ఆపరేటర్ల విజయం : టిడిశాట్ జోక్యంతో తలొగ్గిన సిటీకేబుల్

భోపాల్ కేబుల్ ఆపరేటర్ల విజయం : టిడిశాట్ జోక్యంతో తలొగ్గిన సిటీకేబుల్

భోపాల్ కేబుల్ ఆపరేటర్లకు పొరపాటున నిలిపేసిన సిగ్నల్స్ ను పునరుద్ధరించినట్టు సిటీకేబుల్ నెట్ వర్క్ టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పెల్లేట్ ట్రైబ్యునల్ (టిడిశాట్ ) కు తెలియజేసింది. సిటీకేబుల్ తరఫున న్యాయవాది తేజ్ వీర్ సింగ్ భాటియా ఈ మేరకు ట్రైబ్యునల్ కు వివరిస్తూ 119 మంది ఆపరేటర్లకు సిగ్నల్స్ ఇస్తున్నట్టు చెప్పారు. అంతకు రెండు రోజుల ముందే భోపాల్ కేబుల్ ఆపరేటర్ల సంఘం చేసిన ఫిర్యాదు కు సానుకూలంగా స్పందిస్తూ సిగ్నల్ పునరుద్ధరించాలని ట్రైబ్యునల్ ఆదేశించిన సంగతి తెలిసిందే.

బకాయిల చెల్లింపు మొత్తం జరిగినట్టు భోపాల్ కేబుల్ ఆపరేటర్ల సంఘం తరఫు న్యాయవాది నితిన్ భాటియా తెలియ జేసిన మీదట టిడిశాట్ చైర్మన్ అఫ్తాబ్ ఆలం, సభ్యులు కుల్దీప్ సింగ్, బిబి శ్రీవాస్తవ ఈ ఆదేశాలు జారీచేశారు. 67 మంది కేబుల్ ఆపరేటర్లు తమ తరఫు వాదించటానికి అధికారమిచ్చారని, మిగిలిన 52 మంది కూడా వారం లోగా ఇస్తారని ఆపరేటర్ల తరఫున వాదించిన భాటియా చెప్పారు.

ఆపరేటర్లకూ, ఎమ్మెస్వోకూ మధ్య ఏవైనా విభేదాలుంటే ఇరుపక్షాలూ ఈ నెల 7 న మీడియేషన్ సెంటర్ ఎదుట హాజరు కావాలని, ఇంకా ఏవైనా వివాదాలు ఉంటే పరిష్కరించుకోవాలని సూచించింది. అయితే, సిటీ కేబుల్ ఏకపక్షంగా నెలవారీ చందారేట్లు పెంచుతూ వస్తోందన్నది కేబుల్ ఆపరేటర్ల ప్రధాన ఆరోపణ. 2013 వరకు కనెక్షన్ కు 30 రూపాయలుండగా ఆ తరువాత ఆ మొత్తాన్ని సిటీ కేబుల్ రూ.60 కి పెంచిందని, తాజాగా దాన్ని పన్నులు కాకుండా రూ. 83.11 కి పెంచిందని కేబుల్ ఆపరేటర్లు ఆరోపిస్తున్నారు.