• Home »
  • Uncategorized »
  • అనలాగ్ ఒప్పందాలు కొనసాగిస్తాం: టాస్క్ ఫోర్స్ కి చెప్పిన బ్రాడ్ కాస్టర్లు

అనలాగ్ ఒప్పందాలు కొనసాగిస్తాం: టాస్క్ ఫోర్స్ కి చెప్పిన బ్రాడ్ కాస్టర్లు

డిజిటైజేషన్ కింద ఒప్పందాలు చేసుకుంటే ఇప్పటి నుంచీ పూర్తి మొత్తాలు చెలించాల్సి వస్తుందని భయపడుతున్న ఎమ్మెస్వోలకు ఎట్టకేలకు ఊరట లభించింది. డిజిటైజషన్ ప్రక్రియ పూర్తయ్యేదాకా అనలాగ్ లో చేసుకున్న ఒప్పందాలనే కొనసాగించటానికి బ్రాడ్ కాస్టర్లు ఒప్పుకున్నారు. డిజిటల్ అడ్రెసిబుల్ సిస్టమ్ (DAS) హయాంలో రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ ఒప్పందాలకు ఎమ్మెస్వోలు ముందుకు రాకపోవటానికి కారణాలు విశ్లేషించిన టాస్క్ ఫోర్స్ ఈ అంశాన్ని పరిశీలిస్తున్నప్పుడు బ్రాడ్ కాస్టర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ (IBF) ఈ మేరకు హామీ ఇచ్చింది.

మూడో దశ డిజిటైజేషన్ పూర్తి కావటానికి ఇంకా సమయం ఉండటం, రెండో దశ సైతం ఇంకా బిల్లింగ్ మొదలు కాకపోవటం ఎమ్మెస్వోలను కలవరపరుస్తోంది. ఈ లోపు అనలాగ్ ఒప్పందాల ప్రకారం మాత్రమే చెల్లించగలమన్న అభిప్రాయంతో ఎవరూ ముందుకు రావటం లేదు. డిజిటల్ ఒప్పందాలు చేసుకుంటే మొత్తం కనెక్షన్లు లెక్కలోకి వస్తాయి. కానీ వసూళ్ళు మాత్రం ఇంకా అనలాగ్ విధానంలోనే సాగుతున్నాయి. ఈ సంధి దశలో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఎమ్మెస్వోలు ఎవరూ ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలకు మొగ్గు చూపటం లేదు.

ఇటీవల జరిగిన డిజిటైజేషన్ టాస్క్ ఫోర్స్ సమావేశం తీర్మానాలను సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ వెబ్ సైట్ లో ఉంచింది. మంత్రిత్వశాఖ ప్రత్యేక కార్యదర్శి జె ఎస్ మాథుర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ఎమ్మెస్వోలతో, బ్రాడ్ కాస్టర్లతో సమావేశం జరిపి సమస్యను పరిష్కరించాలని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( TRAI) కి ఆయన సూచించారు. అదే సమయంలో బ్రాడ్ కాస్టర్ల తరఫున ఐబిఎఫ్ ప్రతినిధి మాట్లాడుతూ అనలాగ్ ఒప్పందాలు కొనసాగించటానికి సిద్ధంగా ఉన్నట్టు తెలియజేశారు.

మూడో దశ డిజిటైజేషన్ పూర్తి కావటానికి ఇంకా రెండు నెలలే మిగిలి ఉన్న సమయలో ఎదురవుతున్న చిక్కులను పరిష్కరించటానికి టాస్క్ ఫోర్స్ ఎప్పటికప్పుడు జరుపుతున్న సమావేశాల ఫలితంగా ఇలాంటి నిర్ణయం సాధ్యమైంది. ఇంతకుముందే ఎమ్మెస్వోలకు, బ్రాడ్ కాస్టర్లకూ మధ్య ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలమీద సంతకాల విషయంలో సమస్యలుంటే తనను సంప్రదించాలని ట్రాయ్ కోరిన సంగతి తెలిసిందే. ఒప్పందాల మీద సంతకాలు కాకపోతే, డిజిటైజేషన్ పురోగతి మందగించినట్టే భావించాల్సి వస్తుందని జె ఎస్ మాథుర్ స్పష్టం చేశారు.

ప్రధాన ఎమ్మెస్వోలతో ఒప్పందాలు నిదానంగా సాగుతున్నాయన్న విషయంతో ఏకీభవిస్తూ, ఈ విషయంలో టిడిశాట్ తీర్పు కోసం ఎమ్మెస్వోలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. చాలా మంది ఎమ్మెస్వోలు దరఖాస్తు చేసుకొని, త్వరలో తమకు డిజిటల్ ఎమ్మెస్వోగా లైసెన్సులు వస్తాయని చెబుతూ ఉండటంతో చాలామంది బ్రాడ్ కాస్టర్లు వాళ్ళతో ఒప్పందాలమీద సంతకాలు చేశారని ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ ( ఐబిఎఫ్) ప్రతినిధులు టాస్క్ ఫోర్స్ దృష్టికి తెచ్చారు. మూడో దశ డిజిటైజేషన్ గడువు ముగిసేలోగా పూర్తి కావాలన్న అభిప్రాయంతోనే బ్రాడ్ కాస్టర్లు ఇలా ఒప్పందాలు చెసుకోవాలై వచ్చిందని తెలియజేశారు.

ఇలా ఉండగా ఐబిఎఫ్ ప్రాంతాల వారీగా ఎమ్మెస్వోలతో బ్రాడ్ కాస్టర్లు కుదుర్చుకున్న ఒప్పందాల వివరాలు సమర్పించాలని టాస్క్ ఫోర్స్ ఆదేశించింది. మొత్తం లైసెన్స్ పొందిన సుమారు 300 ఎమ్మెస్వోలలో 62 మంది మాత్రమే బ్రాడ్ కాస్టర్లతో ఒప్పందాలు చేసుకున్నట్టు సమావేశానికి ఐబిఎఫ్ వివరించింది. మూడో దశ డిజిటైజేషన్ జరుగుతున్న ప్రాంతాలలో ప్రజాచైతన్యం కోసం ప్రకటనలు రూపొందించి ప్రచారం చేస్తున్నందుకు ఐబిఎఫ్ కు మాథుర్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి, దూరదర్శన్ ఇప్పటికే ప్రకటనలు ప్రసారం చేస్తున్నాయన్నారు. ఇప్పటివరకు రెండు భాషల్లోనే ప్రకటనలు రూపొందించగా, ఇకమీదట అన్ని భారతీయ భాషల్లో రూపొందించటానికి ప్రయత్నిస్తామని ఐబిఎఫ్ ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ కు తెలియజేసింది.
ఇప్పుడిక ఎమ్మెస్వోలు తమ కేబుల్ చానల్స్ లో స్క్రోల్ నడపటం ద్వారా ప్రజలకు డిజిటైజేషన్ గురించి, గడువులోగా సెట్ టాప్ బాక్స్ పెట్టుకోవాల్సిన అవసరాన్ని చందాదారులకు తెలియజెప్పాలని మంత్రిత్వశాఖ జాయింట్ సెక్రెటరీ అర్ . జయ కోరారు. ఎమ్మెస్వోలు లైసెన్స్ కోసం ఇప్పటికీ దరఖాస్తు చేసుకోవచ్చునని గుర్తుచేశారు. లైసెన్స్ లేకుండానే బ్రాడ్ కాస్టర్లతో ఒప్పందాలు చేసుకోదలచిన ఎమ్మెస్వోలు కనీసం దరఖాస్తు చేసుకొని ఉన్నట్టు రుజువులు చూపించాలని కోరారు. బ్రాడ్ కాస్టర్లు కూడా ఎమ్మెస్వోలను ఈ దిశలో ప్రోత్సహించాలని సూచించారు. లైసెన్స్ లేని పక్షంలో డిజిటల్ సర్వీసులు అందించటం అసాధ్యమని గుర్తించాలని కోరారు.
త్వరలో టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ ప్రారంభమవుతుందని ఆమె వెల్లడించారు. ఇప్పటివరకు హైదరాబాద్ సహా ఏడు నగరాలలో ప్రాంతీయ వర్క్ షాప్స్ నిర్వహించి ఆయా ప్రాంతాల నోడల్ అధికారులతో డిజిటైజేషన్ పురోగతిని చర్చించామన్నారు. కేబుల్ టీవీ చట్టం లోని నిబంధనల ప్రకారం ఎమ్మెస్వోలకు, కేబుల్ ఆపరేటర్లకు కేబుల్ వేసుకోవటానికి దారి కల్పించాలని ( రైట్ ఆఫ్ వే ) తెలియజెప్పామన్నారు. మూడో దశలో ఉండి కూడా రిజిస్టర్ చేసుకున్న ఎమ్మెస్వో ఒక్కరూ లేని జిల్లాల వివరాలు ఇవ్వాలని నోడల్ అధికారులను కోరామన్నారు. అనలాగ్ నుంచి డిజిటల్ కు మారటానికి గడువు తేదీ ఎట్టిపరిస్థితుల్లోనూ మారదని, మూడోదశ ఈ డిసెంబర్ 31 లోగా పూర్తి కావాల్సిందేనని చెప్పారు.

ఢిల్లీ లోని సెంట్రల్ యూనిట్ తో సహా 12 ప్రాంతీయ యూనిట్లు ఏర్పాటు చేయటం ద్వారా మూడో దశ డిజిటైజేషన్ అమలును పర్యవేక్షిస్తున్నట్టు చెప్పారు. ఇప్పటివరకు చండీగఢ్, లక్నో, అహమ్మదాబాద్, జైపూర్, భోపాల్, షిల్లాంగ్, హైదరాబాద్ నగరాలలో వర్క్ షాప్స్ జరిగాయన్నారు. బీహార్ లో ఎన్నికలు జరుగుతున్న కారణంగా పాట్నాలో జరగాల్సిన వర్క్ షాప్ వాయిదా పడిందని చెప్పారు. నోడల్ అధికారుల బాధ్యతలమీద, డిజితైజేషన్ లో వారు నిర్వహించాల్సిన పాత్రమీద పూర్తి స్థాయిలో అవగాహన కల్పించటానికి వర్క్ షాప్స్ బాగా ఉపయోగపడ్డాయన్నారు.

ఇంటర్ కనెక్ట్ ఒప్పందాల కోసం బ్రాడ్ కాస్టర్లకు పదే పదే విన్నవించినా ఆశించిన ఫలితాలు కనబడటం లేదని సిటీ కేబుల్ ప్రతినిధి ఫిర్యాదు చేశారు. దీనివలన చానల్ రేట్లు, పాకేజీలు నిర్ణయించుకోలేకపోతున్నామని, చందాదారుల దరఖాస్తులు సైతం స్వీకరించలేకపోతున్నామని చెప్పారు. కొంతమంది కేబుల్ ఆపరేటర్లు డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ లేకుండానే డిజిటల్ కేబుల్ సర్వీస్ నడపటానికి ఎలాంటి హక్కులున్నాయో చెప్పాలని కోరారు.

ట్రాయ్ ప్రతినిధి మాట్లాడుతూ ఇప్పుడున్న అనలాగ్ ఒప్పందాలను డిజిటైజేషన్ తరువాత కూడా కొనసాగించుకోవటమా లేదా అనేది ఎమ్మెస్వోలు, బ్రాడ్ కాస్టర్లు మాత్రమే నిర్ణయించుకోవాలని సూచించారు. డిజిటైజేషన్ అమలు కావటానికి గడువు తేదీ ముగిసేవరకూ కేబుల్ ఆపరేటర్లు డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ లేకపోయినా డిజిటల్ సర్వీసులు అందించటానికి ఎలాంటి అభ్యంతరాలూ లేవని వివరణ ఇచ్చారు.
కేబుల్ ఆపరేటర్ల సమాఖ్య ఇప్పటికే చేతనాయాత్ర ప్రారంభించిందని, అది 450 నగరాలగుండా ప్రయాణిస్తూ చందాదారులను, ఆపరేటర్లను మూడో దశ డిజిటైజేషన్ మీద చైతన్యవంతులను చేస్తున్నదని అసోచామ్ ప్రతినిధి వివరించారు. ఈ విషయమై సమగ్ర నివేదికను మంత్రిత్వశాఖకు అందజేస్తామన్నారు. అవగాహన కార్యక్రమాల మీద సభ్యులు అనేక సూచనలిచ్చారు. టీవీ ప్రకటనలు ప్రాంతీయ భాషల్లో ఉండాలని అసోమ్ ప్రతినిధి ఒకరు టాస్క్ ఫోర్స్ దృష్టికి తెచ్చారు.
.