• Home »
  • Cable »
  • ఎమ్మెస్వోల హెడ్ ఎండ్స్ తనిఖీ కఠినంగా ఉండాల్సిందే: చానల్స్

ఎమ్మెస్వోల హెడ్ ఎండ్స్ తనిఖీ కఠినంగా ఉండాల్సిందే: చానల్స్

చానల్స్ పంపిణీ పారదర్శకంగా సాగాలంటే కచ్చితంగా పంపిణీ సంస్థలైన ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లు, హిట్స్ ఆపరేటర్ల  హెడ్ ఎండ్స్ ను తనిఖీ చేయటంలో కఠినంగా వ్యవహరించల్సిందేనని బ్రాడ్ కాస్టర్లు ముక్తకంఠంతో తేల్చి చెప్పారు. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్) ఈ విషయంలో అభిప్రాయసేకరణకోసం జారీచేసిన చర్చాపత్రం మీద బ్రాడ్ కాస్టర్లు స్పందించారు. డిజిటల్ అడ్రెసిబుల్ సిస్టమ్స్ తనిఖీకోసం నియమించే ఆడిటర్లను ఎంపానెల్ చేయటానికి మార్గదర్శకాలు రూపొందించే క్రమంలో ట్రాయ్ ఈ చర్చా పత్రం జారీచేసింది.

గతంలో అనలాగ్ హయాంలో కనెక్షన్ల సంఖ్య బాగా తగ్గించి చెప్పటం వలన బ్రాడ్ కాస్టర్లు విపరీతంగా నష్టపోయారని, ఇప్పుడు డిజిటైజేషన్ తరువాత కూడా అలాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండాలంటే కంట్రోల్ రూమ్ ( హెడ్ ఎండ్ ) స్థాయిలోనే పకడ్బందీగా ఉండాలనే అభిప్రాయం చానల్ యాజమాన్యాలలో కనబడుతోంది. ఈ పరిస్థితుల్లో కచ్చితంగా పారదర్శకతకు పెద్దపీట వేయాలని కోరుతున్నారు.

ఆడిటర్లకు ఫీజు చెల్లించే బాధ్యత కూడా ఎమ్మెస్వోలకే ఉండటం వలన ఆడిటర్ల నివేదికమీద వారి ప్రభావం ఉండవచ్చునని ఈ సందర్భంగా స్టార్ ఇండియా అనుమానం వ్యక్తం చేసింది. తనిఖీ నిష్పాక్షికంగా ఉండక పోవచ్చునని అభిప్రాయపడింది. అలాంటప్పుడు బ్రాడ్ కాస్టర్ల ప్రయోజనాలు దెబ్బతినే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. ఏడాదికొకసారి తనిఖీ చేయటం కూడా సమంజసం కాదని, ఈలోపు నష్టం జరిగితే భారీగా నష్టపోవాల్సి వస్తుందని పేర్కొంది.

కొన్ని సందర్భాలలో ఎమ్మెస్వోలు సహా కొన్ని పంపిణీ సంస్థలు కాస్ వివరాలు వెల్లడించకపోవటం, మరికొన్ని సందర్భాలలో ఒకరి పరిధిలోకి మరొకరు వెళ్ళటం లాంటి సందర్భాలు కూడా నమోదవటాన్ని స్టార్ ఇండియా గుర్తుచేసింది. అనధికారికంగా ఎన్ క్రిప్ట్ చేయని చానల్స్ ప్రసారం చేస్తున్న సందర్భాలు కూడా ఉండటం, తద్వారా చందాదారుల సంఖ్య దాచిపెట్టే అవకాశముండటం కూడా తమ దృష్టికి వచ్చిందన్నారు.

బ్రాడ్ కాస్టర్లకు ఉన్న సమాచారాన్ని ఆడిటర్లకు కూడా ఇవ్వటం వలన దాని ఆధారంగా పంపిణీ సంస్థలతో బేరీజు వేసుకోవటానికి వీలుకలుగుతుందని, అదే సమయంలో పంపిణీ సంస్థలు కూడా సహకరించినప్పుడే కచ్చితమైన ఫలితాలుంటాయని స్టార్ అభిప్రాయపడింది. కానీ తమ లాభాలకు గండికొట్టే వ్యవహారాలను పంపిణీ సంస్థలు వీలైనంత వరకు దాచి ఉంచటానికే ప్రయత్నిస్తాయి కాబట్టి కచ్చితమైన ఫలితం వచ్చే అవకాశంఉండకపోవచ్చునని స్టార్ ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ఎమ్మెస్వోలే ఫీజు చెల్లించే పరిస్థితిలో ఆడిటర్లు ఆవిషయాలను లోతుగా తవ్వితీసే పరిస్థితి ఉండబోదని గుర్తుచేసింది.

ట్రాయ్ జారీచేసిన ఈ చర్చాపత్రం ఇంటర్ కనెక్షన్ నిబంధనల అమలు మీద అనేక అనుమానాలకు తావిస్తున్నదని ఇండియాకాస్ట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ అభిప్రాయపడింది. నిజానికి బ్రాడ్ కాస్టర్ల ఆందోళనకు ఇప్పుడున్న నిబంధనలు తగిన విధంగా సమాధానం ఇవ్వలేకపోతున్నాయన్నారు. అడ్రెసిబుల్ సిస్టమ్ లో మార్పులు గమనించినప్పుడు బ్రాడ్ కాస్టర్ కేవలం ఆడిటర్ ను అడగగలడే తప్ప కచ్చితంగా నిఘాపెట్టి తనిఖీ చేయాలని అడిగే సాహసం చేయటం కుదరదని గుర్తు చేసింది.

ఈ తనిఖీ ఏడాదికొకసారి కాకుండా తరచూ జరుగుతూ ఉండాలని ఇండియాకాస్ట్ అభిప్రాయపడింది. అప్పుడే పంపిణీ వేదికలు కూదా అప్రమత్తంగా ఉండి పారదర్శకతకు పెద్దపీట వేస్తాయని పేర్కొంది. టెలికామ్ రంగంలో జరిగినట్టే ఇక్కడ కూడా ఆడిట్ జరిగితే బాగుంటుందని ఇండియా కాస్ట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ అభిప్రాయపడింది. అప్పుడే పంపిణీ వేదికలు ఎలాంటి అవకతవకలకూ పాల్పడే అవకాశం ఉండబోదని సూచించింది. తనిఖీ జరిగిన వెంటనే ఏదైనా మార్చేసి మళ్ళీ ఏడాది ముందు దాన్ని తిరిగి సరిచేసే ప్రమాదముందని హెచ్చరించింది.

2017 లో జారీ చేసిన ఇంటర్ కనెక్షన్ నిబంధనలలో లొసుగులు ఉన్నాయంటూ సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా అభ్యంతరం తెలియజేసింది. చాలామంది జాతీయ స్థాయి ఎమ్మెస్వోలు తమ  కాస్, ఎస్సెమ్మెస్ సర్వర్స్ ను తమ జాయింట్ వెంచర్ భాగస్వాములతో పంచుకుంటున్నాయి కాబట్టి చాలా సమస్యలు రావచ్చునని పేర్కొంది. ఈ భాగస్వాములు వాణిజ్య ప్రకటనలకోసం నేరుగా బ్రాడ్ కాస్టర్లతో సంప్రదింపులు జరుపుతూనే ఉంటాయి కాబట్టి అనుమానించక తప్పదు.

అలాంటప్పుడు సర్వర్ యజమాని అయిన జాతీయ స్థాయి ప్రధాన  ఎమ్మెస్వో  తన జాయింట్ వెంచర్ భాగస్వాములతో సమాచారం పంచుకోవటానికి ఇష్టపడకపోవటం సమస్యలు తెచ్చిపెడుతుంది. ఎందుకంటే కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ ప్రాంతాల వారీగా లేదా జాయింట్ వెంచర్ల వారీగా  తేడాను గమనించటం సాధ్యం కాదు గాబట్టి. అందులో కచ్చితత్వాన్ని తనిఖీ చేయటం ఆడిటర్ పరిధిలోకి రాకపోవటం ప్రధాన సమస్య అవుతుంది. సాంకేతిక అంశాల తనిఖీకి ఒక ఆడిటర్ల బృందం, చందాల ఆడిట్ కు మరో బృందం ఉండాలన్న సూచనను కూడా బ్రాడ్ కాస్టర్లు తిరస్కరించారు.

ఆడిటర్ల ఎంపానెల్ మెంట్ కు వాళ్ళు వాడుతున్న కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ ( కాస్), సబ్ స్క్రైబర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ( ఎస్ ఎమ్ ఎస్ ) ఏ నమూనావి అనేది ఆడిటర్ల ఎంపికకు ప్రాతిపదిక కావాలని బ్రాడ్ కాస్టర్ల సంఘమైన ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ అభిప్రాయపడింది. బ్రాడ్ కాస్టర్ ఒక ఆడిటర్ ను నిర్ణయించే ముందు ఆ ఆడిటర్ కాస్, ఎస్సెమ్మె స్ సరిగా అవగాహన చేసుకున్నాడని నిర్థారించుకోవటం మంచిదని కూడా సూచించింది. అందరు ఆడిటర్లకూ అన్నిరకాల కాస్, ఎస్సెమ్మెస్ తెలిసి ఉండనక్కర్లేదని, వారు తనిఖీ చేయబోయేచోట వాడకంలో ఉన్నవి తెలిస్తే చాలునని చెప్పింది.