• Home »
  • Entertainment »
  • ఉమ్మడి నియంత్రణకు బ్రాడ్ కాస్టర్ల ’ నో ’ టెలికామ్ విధానం మీద ట్రాయ్ తో విభేదం

ఉమ్మడి నియంత్రణకు బ్రాడ్ కాస్టర్ల ’ నో ’ టెలికామ్ విధానం మీద ట్రాయ్ తో విభేదం

ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్స్ టెక్నాలజీ (ఐసిటి), బ్రాడ్ కాస్టింగ్ రంగాలకు ఉమ్మడిగా ఒకే నియంత్రణా సంస్థ ఉండాలని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) చేసిన ప్రతిపాదనను బ్రాడ్ కాస్టర్లు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. జాతీయ టెలికామ్ విధానం మీద ట్రాయ్ విడుదల చేసిన చర్చాపత్రం సూచనల పట్ల దేశవ్యాప్తంగా బ్రాడ్ కాస్టింగ్ రంగం నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

నెట్ వర్క్ సంసిద్ధత, కమ్యూనికేషన్ల వ్యవస్థ, సేవల విషయంలో టెలికమ్యూనికేషన్ల రంగానికి10 వేల కోట్ల డాలర్ల పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో ట్రాయ్ ని పునర్వ్యవస్థీకరించాల్సి ఉందని, అప్పుడు ఉమ్మడి నియంత్రణాసంస్థగా ఉమ్మడి వ్యూహకర్తగా ట్రాయ్ ఉండటమే సమంజసమని ఆ చర్చాపత్రంలో పేర్కొంది. అంతర్జాతీయంగా మంచి రాంకింగ్ తో టాప్ 50 దేశాల జాబుతాలో స్థానం ఉండాలంటే ఇలాంటి పురోగామి చర్యలు అవసరమని ట్రాయ్ తన వాదనను సమర్థించుకునే ప్రయత్నం చేసింది.

ఐసిటి, బ్రాడ్ కాస్టింగ్ అనేవి రెండూ వేరు వేరు రంగాలు కాబట్టి, అవి ఎదుర్కునే సమస్యలు భిన్నమైనవి కాబట్టి ఉమ్మడి నియంత్రణాసంస్థ ఉండాల్సిన అవసరం లేదని న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్, స్టార్ ఇండియా, జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్  సమర్పించిన అభిప్రాయాల్లో ఉంది. ట్రాయ్ చర్చాపత్రం మీద అవి తమ ఆలోచనలను విస్పష్టంగా తెలియజేశాయి. పైగా, పార్లమెంటరీ స్థాయీ సంఘం కూడా బ్రాడ్ కాస్టింగ్ రంగానికి ప్రత్యేకంగా  ఒక నియంత్రణాసంస్థ అవసరమని అభిప్రాయపడటాన్ని గుర్తు చేశారు.

అదే సమయంలో బ్రాడ్ కాస్టింగ్ రంగం కోసం ఒక ప్రత్యేక నియంత్రణా సంస్థ ఏర్పాటయ్యేదాకా ట్రాయ్ చట్టాన్ని సవరించటం ద్వారా ట్రాయ్ ని బలోపేతం చేయాలని కూడా సిఫార్సు చేసింది. ట్రాయ్ పునర్వ్యవస్థీకరణ తరువాత కూడా టారిఫ్, ఇంటర్ కనెక్షన్, సేవల నాణ్యత లాంటి విషయాలు ట్రాయ్ పరిధిలోనే ఉంచాలని, లైసెన్సుల మంజూరు, విధానపరమైన నిర్ణయాలు, ప్రసారాల నియంత్రణ వంటి అంశాలను సమాచార ప్రసార  మంత్రిత్వశాఖ చూసుకోవాలని న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్ తన లేఖలో సూచించింది. స్థూలంగా చెప్పాలంటే ట్రాయ్, ఎన్ బి ఏ ల పరిధిలో ఎలాంటి మార్పూ ఉండకూడదని, వాటి ప్రభావం భావ ప్రకటనాస్వేచ్ఛ మీద తీవ్రంగా ఉంటుందని పేర్కొంది.

ఐసిటి, బ్రాడ్ కాస్ట్ రంగాల నియంత్రణను విలీనం చేయటమంటే అది సవాళ్లతో కూడిన విన్యాసమే అవుతుందని స్టార్ ఇండియా అభిప్రాయపడింది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ, టెలికామ్ విభాగం, కమ్యూనికేషన్ల మంత్రిత్వశాఖ, పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం సహకారం అందించటం ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని పేర్కొంది. కార్యక్రమాల తయారీదారుల, హక్కుదారుల హక్కులను కాపాడే చట్టాల అమలుకు నోడల్ అధికారిగా మంత్రిత్వశాఖే బాధ్యతలు నిర్వర్తించాల్సిన విషయాన్ని గుర్తు చేసింది.  బ్రాడ్ కాస్టింగ్ అనేది ప్రధానంగా  కార్యక్రమాల రూపకల్పనకు సంబంధించినది కాబట్టి  దానికీ ఐసిటీ కి మధ్య చాలా అంతరం ఉన్న విషయాన్ని కూడా స్టార్ ప్రస్తావించింది.

కన్వర్జెన్స్ కు ట్రాయ్ ప్రయత్నించటమంటే పార్లమెంటుకు వ్యతిరేకంగా వ్యవహరించినట్టే అవుతుందని జీ గ్రూప్ అభిప్రాయపడింది. ట్రాయ్ తనంతట తానే ఒక ఒక ఉమ్మడి వేదికగా ప్రకటించుకోవాలని ప్రయత్నించటం పట్ల అభ్యంతరం తెలియజేసింది. పైగా ట్రాయ్ పరిధి మీదనే కేసు ఉన్నప్పుడు ఇలాంటి చర్యకు పూనుకోవటం అనైతికమని కూడా జీ గ్రూప్ వ్యాఖ్యానించింది. కన్వర్జెన్స్ కు సంబంధించిన బిల్లు పరిధిని సైతం ముందుగా వెల్లడించాలని డిమాండ్ చేసింది.