• Home »
  • Cable »
  • ఎమ్మెస్వోలతో ఒప్పందాల సమాచారం రహస్యమంటున్న బ్రాడ్ కాస్టర్లు

ఎమ్మెస్వోలతో ఒప్పందాల సమాచారం రహస్యమంటున్న బ్రాడ్ కాస్టర్లు

పే చానల్స్ నిర్వాహకులు తమ చానల్స్ పంపిణీకోసం ఎమ్మెస్వోలు లేదా డిటిహెచ్, హిట్స్ ఆపరేటర్లతో చేసుకునే ఇంటర్ కనెక్షన్ ఒప్పంద వివరాలు అత్యంత రహస్యమైనవంటున్నారు. ఆ సమాచారాన్ని బైట పెట్టటం కుదరదని తెగేసి చెబుతున్నారు. అంటే, ఒక్కో పంపిణీ దారుతో ఒక్కో విధమైన ఒప్పందం ఉంటుందని, ఒకరికి చెప్పిన ధర మరొకరికి ఉండదు కాబట్టి అది బైట పడకూడదని అంటున్నట్టు తేలిపోయింది. పారదర్శకత ఉండాలని, పంపిణీదారులందరినీ ఒకే విధంగా చూడాలని చిన్న ఎమ్మెస్వోలు ఎంతోకాలంగా ట్రాయ్ ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

అయితే, ఒప్పందాల సమాచారం బ్రాడ్ కాస్టర్ల దగ్గరే కాకుండా ఎమ్మెస్వోల దగ్గర కూడా ఉంటుంది కదా? మరి ఆ సమాచారాన్ని వెల్లడించే విషయంలో వాళ్ళేమంటారు? మిగిలిన పంపిణీ దారులకు తెలియటంలో తప్పేమీలేదని కొంతమంది అంటుంటే, అసలు అలా తెలియాల్సిన అవసరమేంటని మరికొందరు వాదిస్తున్నారు. ఈ విధంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే అటు బ్రాడ్ కాస్టర్లు, ఇటు పంపిణీ సంస్థలు ఉమ్మడిగా వాదిస్తున్నదేంటంటే ఈ సమాచారం ప్రజలకు తెలియకూడదని. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నిర్వహించిన బహిరంగ చర్చావేదికలో  ఇలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

అందరూ తాత్కాలిక సమస్యల గురించి, తాత్కాలిక ప్రయోజనాల గురించి మాట్లాడుతూ దీర్ఘ కాల ప్రయోజనాలను గాని, భవిష్యత్తులో పరిశ్రమ పరిస్థితిని గాని ఊహించుకోకుండా వ్యవహరిస్తున్నట్టు ఈ సమావేశం తీరుతెన్నులు స్పష్టంగా తెలియజేశాయి. నిజానికి ట్రాయ్ జారీచేసిన చర్చా పత్రం మీద టీవీ పరిశ్రమకు చెందిన భిన్న వర్గాలు లిఖిత పూర్వకంగా స్పందించినపటికీ అందరినీ ఒక వేదిక మీదికి తీసుకువచ్చి అభిప్రాయాలమీద చర్చోప చర్చలకు తావు కల్పించాలని ట్రాయ్ భావించటం వల్లనే ఈ సమావేశం జరిగింది.

బ్రాడ్ కాస్టర్ల వైఖరి

ప్రధానంగా పెద్ద సంఖ్యలో పే చానల్స్ నడుపుతూ పెద్ద మొత్తాలు వసూలు చేసుకుంటున్న స్టార్ ఇండియా ఈ ఒప్పందాలు రహస్యంగానే ఉండాలని వాదిస్తోంది. వాణిజ్యపరమైన సమాచారాన్ని బైట పెట్టటం గందరగోళానికి దారితీస్తుందని అభిప్రాయపడింది. కేబుల్, శాటిలైట్ వ్యాపారంలో పోటీ చాలా తీవ్ర స్థాయిలో ఉండటం వలన పోటీదారుడి సమాచారం తెలుసుకోవటం ద్వారా భారీగ లాభపడే అవకాశాలున్నాయని, అందరూ అలాంటి సమాచారం ద్వారా లాభపడాలని చూస్తారు కాబట్టి రహస్యంగా ఉంచాల్సిన అవసరముందని వ్యాఖ్యానించింది.

మరో వైపు సోనీ పిక్చర్స్ నెట్ వర్క్స్ ఇండియా మాత్రం ఇలాంటి వాణిజ్యపరమైన సమాచారాన్ని ట్రాయ్ సేకరించుకొని తన దగ్గర ఉంచుకోవచ్చునే తప్ప బహిరంగ పరచటం సమంజసం కాదని అభిప్రాయపడింది. నిజానికి ట్రాయ్ స్వయంగా ఈ ఒప్పందాలను అధ్యయనం చేసి ఒక అభిప్రాయానికి రావాలే తప్ప అభిప్రాయ సేకరణలతో ఒరిగేదేమీ లేదని వ్యాఖ్యానించింది. ఒకవేళ ట్రాయ్ ఆ సమాచారాన్ని బహిర్గతం చేయాలనుకుంటే మాత్రం బ్రాడ్ కాస్టర్ల వాదన వినకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకూడదని సోనీ సూచించింది.

ఏమైనప్పటికీ, సమాచారాన్ని వెల్లడించాలా వద్దా అనే విషయంలో తుది నిర్ణయం ట్రాయ్ కే ఉండాలని అభిప్రాయపడింది. ఆ సమాచారం కోరే వ్యక్తి లేదా సంస్థ ఆ సమాచారం ఏ విధంగా తనకు సంబంధించినదో, లేదా అది వెల్లడించటం ద్వారా మాత్రమే తనకు న్యాయం జరుగుతుందనో ట్రాయ్ కి సంతృప్తికరమైన సమాచారం ఇచ్చిన మీదట మాత్రమే ట్రాయ్ ఇవ్వాలని సోనీ సూచించింది.

ఇండియాకాస్ట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ సంస్థ తన వాదనను సమర్థించుకోవటానికి ఎన్ ఎస్ టి పి ఎల్ వెర్సస్ స్టార్ ఇండియా / తాజ్ టెలివిజన్ కేసులో టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పెల్లేట్ ట్రైబ్యునల్ (టిడిశాట్) ఇచ్చిన ఆదేశాలను ప్రస్తావించింది. ఇరుపక్షాల మధ్య జరిగే ఒప్పందాలు

i. వివక్ష లేకుండా

ii. ఒకే రకమైన డిస్కౌంట్లు ఇస్తూ

iii. బేరసారాలతో కూడినదే అయినా రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ ఆధారంగానే జరగాలని

టిడిశాట్ సూచించటాన్ని గుర్తుచేసింది. అన్ని ఒప్పందాలూ రిఫరెన్స్ ఇంటర్ కనెక్ట్ ఆఫర్ ఆధారంగా  జరిగినవే అయితే ఇప్పుడు చర్చిస్తున్న అంశాలకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఏదీ ఉండదని కూడా ఇండియాకాస్ట్ అభిప్రాయపడింది. ఎందుకంటే ఈ ఒప్పందాలు ఎలాగూ ట్రాయ్ కి చేరతాయి కాబట్టి దాపరికాలు ఉండటానికి అవకాశమే లేదు.

ఇక ప్రధానమైన ఆరోపణ .. బ్రాడ్ కాస్టర్లు ఒక్కో ఎమ్మెస్వో తో ఒక్కో విధంగా వ్యవహరిస్తూ వివక్ష చూపుతున్నారనేది. అందుకే ఒప్పందాలను నిశితంగా పరిశీలించి నిర్థారించుకోవాల్సింది ట్రాయ్ మాత్రమేనని ఇండియాకాస్ట్ అంటోంది. పైగా, ఇరు పక్షాలు కుదుర్చుకున్న ఒప్పందంలోని వాణిజ్యపరమైన వివరాలను బహిర్గతం చేయటం ఆ పక్షాల ప్రైవసీకి భంగం కలిగించటమే అవుతుందని కూడా అభిప్రాయపడింది.

డిటిహెచ్ ఆపరేటర్ల అభిప్రాయం

ఒప్పందాలలోని వాణిజ్యపరమైన సమాచారాన్ని సంబంధిత వర్గాలకు బహిర్గతం చేయటం తప్పేమీకాదని డిష్ టీవీ విస్పష్టంగా ప్రకటించింది. రహస్య సమాచారం పేరుతో దాచిపెట్టకుండా అంతా పారదర్శకంగా ఉండటం వలన వ్యాపారంలో అందరికీ ఒకే విధమైన అవకాశాలుంటాయని గుర్తుచేసింది. బ్రాడ్ కాస్టర్లు ఎలాంటి షరతులమీద చానల్ ప్రసారాలు అందిస్తున్నారో తెలియటం వలన ఆపరేటర్లు కూడా అనుమానాలకు తావులేకుండా సంతృప్తి చెందే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. వివాదాలు తలెత్తకుండా ఉండాలన్నా పారదర్శకంగా ఉండటమే మేలని సూచించింది. ఎమ్మెస్వోలు, డిటిహెచ్ ఆపరేటర్లూ ప్రతి విషయాన్నీ బహిర్గతం చేయాలని చెబుతూ ఉన్నప్పుడు ఒక బ్రాడ్ కాస్టర్ కు సంబంధించిన వ్యవహారం ప్రైవేట్ అంశం ఎలా అవుతుందని డిష్ టీవీ ఎండీ జవహర్ గోయెల్ ప్రశ్నించారు.  అంతకుముందు స్టార్ ఇండియా ప్రతినిధి అనేక చట్టాలను, నిబంధనలను ఉటంకిస్తూ బ్రాడ్ కాస్టర్ల హక్కులను హరించటం సమంజసం కాదంటూ వాదించటాన్ని ప్రస్తావిస్తూ హక్కులు అందరికీ ఉండాలని గోయెల్ వాదించారు.

వీడియోకాన్ డి2హెచ్ మాత్రం వాణిజ్యపరమైన సమాచారాన్ని బహిర్గతం చేయకూడదని, వాణిజ్యేతర సమాచారాన్ని ప్రజలకు వెల్లడించినా పరవాలేదని అభిప్రాయపడింది. దీనివలన పరిశ్రమ ఎదుగుదల, వివాదాల నిరోధం సాధ్యమవుతుందని వాదిస్తోంది. ఎయిర్ టెల్ డిజిటల్ మరో కొత్త వాదన తెరమీదికి తెచ్చింది. లైసెన్స్ ఉన్న బ్రాడ్ కాస్టర్లకు, పంపిణీ సంస్థలకు మాత్రమే ఆ సమాచారం వెల్లడించటం సమంజసమని అంటోంది. ఎవరైనా సర్వీస్ ప్రొవైడర్ నిర్దిష్టంగా ఒక సమాచారం కోరినప్పుడు నామమాత్రపు రుసుము వసూలు చేసి అది అందించవచ్చునని సూచించింది. ఇలాంటి వైఖరి న్యాయబద్ధంగాను, పారదర్శకంగాను ఉంటుందని, టీవీ రంగంలోని భాగస్వాములందరికీ సమానావకాశాలతోబాటు సమాచారం అందుకోగలిగే అవకాశమూ ఉంటుందని అభిప్రాయపడింది.

టా టా స్కై కూడా వాణిజ్య సమాచారం మూడో కంటికి కనబడటం ప్రమాదకరమనే అంటోంది. వ్యాపారంలో పాత్రధారులందరికీ తెలియటం వలన బ్రాడ్ కాస్టర్, ఎమ్మెస్వో వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయని అభిప్రాయపడింది. అవకతవకలు లేకుండా ఎలా చూడాలో ట్రాయ్ కి బాగా తెలుసునని, అందువలన సమాచారం వెల్లడించటం ద్వారా సరిదిద్దాల్సిన అవసరం లేదని పేర్కొంది. టోకున పే చానల్స్ ఎమ్మెస్వోకు ఏ ధరకు అందుతున్నాయో ప్రేక్షకుడికి తెలియటం వలన ఎలాంటి ప్రయోజనమూ లేదని టాటా స్కై వాదించింది.

ఎమ్మెస్వోలనూ, డిటిహెచ్ ఆపరేటర్లనూ ఒకే గాటన కట్టేయటం సమంజసం కాదని డిటిహెచ్ ఆపరేటర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. అతుధికంగా 34.5% పన్ను కడుతున్నది డిటిహెచ్ ఆపరేటర్లేనని గుర్తుచేశారు. అదే సమయంలో భారీ మొత్తం లైసెన్స్ ఫీజు రూపంలో కూడా ప్రభుత్వానికి చెల్లిస్తున్నామన్నారు. అలాంటప్పుడు వ్యాపారంలో సమానావకాశాలు కల్పించాలని కోరాల్సింది డిటిహెచ్ ఆపరేటర్లే తప్ప ఎమ్మెస్వోలు కానే కాదన్నారు.

ఎమ్మెస్వోల అభిప్రాయం

టీవీ సేవలకు సంబంధించిన టారిఫ్ సమస్యలమీద ట్రాయ్ తన చర్చా పత్రంలో పేర్కొన్న నమూనాలు చూస్తుంటే ఇంటర్ కనెక్ట్ ఒప్పందాలు లు రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరమే లేకుండా చేస్తున్నాయని కేబుల్ టీవీ కంపెనీలు అభిప్రాయపడుతున్నాయి. ఒప్పందం చేసుకునే సంస్థలు రెండూ… అంటే బ్రాడ్ కాస్టర్, ఎమ్మెస్వో ఇద్దరూ అందులో రహస్యమేమీ లేదని భావించినప్పుడు మాత్రమే వెల్లడించటం సమంజసమని ట్రాయ్ కి సూచించింది. అదే సమయంలో టీవీ పరిశ్రమకు సంబంధించిన వారు అనే పదం పదే పదే వాడుతున్నప్పుడు దాన్ని స్పష్టంగా నిర్వచించాల్సి ఉందని కూడా చెప్పింది. బ్రాడ్ కాస్టర్లు, ఎమ్మెస్వోలు తదితర పంపిణీ సంస్థలు, కేబుల్ ఆపరేటర్లతో బాటు ప్రేక్షకులను సైతం చేర్చే పక్షంలో అది బహిరంగమే అనే విషయం గ్రహించాలని సూచించింది.

దేశవ్యాప్తంగా డిజిటైజేషన్ పూర్తయ్యేదాకా వేచి ఉండటమే సమంజసమని ట్రాయ్ కి డెన్ నెట్ వర్క్స్ సూచించింది.అప్పుడు మాత్రమే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా, చర్యలు తీసుకున్నా అర్థ వంతంగా ఉంటాయని పేర్కొంది.  ముందుగా టారిఫ్ విధానం రూపకల్పన జరిగితే మొత్తం చట్రం రూపుదిద్దుకుంటుందని అప్పుడు ట్రాయ్ ముందడుగు వేయటం సమంజసమని ఇండస్ ఇండ్ మీడియా అండ్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అభిప్రాయపడింది. స్థూలంగా చెప్పాలంటే కొన్ని అంశాలు రహస్యమైనవిగాను, కొన్నిటిని బహిర్గతం చేసేవిగాని వర్గీకరించాల్సిన అవసరమున్నదని ట్రాయ్ కి సూచించింది.