• Home »
  • Cable »
  • వాణిజ్య సంస్థల టారిఫ్ ఉత్తర్వుల మీద సవాలు చేయనున్న బ్రాడ్ కాస్టర్లు

వాణిజ్య సంస్థల టారిఫ్ ఉత్తర్వుల మీద సవాలు చేయనున్న బ్రాడ్ కాస్టర్లు

స్టార్ హోటల్స్ లాంటి వాణిజ్యపరమైన చందాదారులకు నెలసరి చందా రేట్ల నిర్ణయం మీద ట్రాయ్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేయాలని బ్రాడ్ కాస్టర్లు నిర్ణయించుకున్నారు. వాణిజ్యపరమైన చందాదారుడు అనే పదానికి ట్రాయ్ ఇచ్చిన నిర్వచనం చాలా సంకుచితంగా ఉందనేది పే చానల్ యజమానుల ప్రధానమైన అభ్యంతరం.
ట్రాయ్ ఇచ్చిన నిర్వచనం ప్రకారం ఏదైనా సంస్థ తన కస్టమర్ల బిల్లులో ప్రత్యేకంగా టీవీ సేవలకోసం కొంత మొత్తాన్ని వసూలు చేస్తున్నట్టు ఉంటే ఆ సంస్థను వాణిజ్యపరమైన చందాదారుగా పరిగణించాలి. మిగిలిన చందాదారులందరినీ మామూలు చందాదారులుగానే పరిగణించాలి. అందువలన వాణిజ్యపరమైన చందాదారుడు అనేది కేవలం వాడకపు రకాన్ని బట్టి నిర్ణయమవుతాడే తప్ప టీవీ సిగ్నల్స్ వాడుకునే ప్రదేశాన్నిబట్టి కాదని తేలిపోయింది. అందుకే ఈ విషయంలో కోర్టుకు వెళ్ళి న్యాయంకోసం పోరాడాలని బ్రాడ్ కాస్టర్లు భావిస్తున్నారు.

ట్రాయ్ ఇచ్చిన టారిఫ్ ఉత్తర్వులను సమీక్షించిన ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ ఇప్పటికే న్యాయపోరాటానికి నిర్ణయించుకున్నట్టు, టిడిశాట్ లో అప్పీల్ చేయబోతున్నట్టు ప్రకటించింది. బ్రాడ్ కాస్టర్లు అటు వాణిజ్యపరమైన చందాదారులతోనూ. ఇటు పంపిణీ సంస్థలైన డిటిహెచ్ ఆపరేటర్లు, కేబుల్ నెట్ వర్క్ లతోను త్రైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకోవటానికి అవకాశమివ్వాలని వాదిస్తున్నారు. కానీ వాణిజ్యపరమైన చందాదారుల నిర్వచనం చాలా పరిమితంగా ఉండటం మీద ఆందోళన వ్యక్తమవుతోంది.

అయితే, ట్రాయ్ అధికారులు మాత్రం ఈ అంశాన్ని బ్రాడ్ కాస్టర్ దృక్పథం నుంచి చూడాలని అంటున్నారు. ఒకప్పుడు హోటళ్ళు టీవీ సేవలను అదనపు సేవగా పరిగణించినా ఇప్పుడు ప్రాథమిక సౌకర్యాలలో ఒకటిగా మాత్రమే చూస్తున్నాయన్నారు. అలాంటప్పుడు ఆ హోటల్ ను మామూలు కస్టమర్ గానే చూడటం సమంజసమని ట్రాయ్ భావిస్తోంది. హోటళ్ళు మాత్రమే వాణిజ్యపరమైన్ చందాదారులు కాదని కూడా ట్రాయ్ చెబుతోంది. త్రైపాక్షిక ఒప్పందాలకు ట్రాయ్ వ్యతిరేకం కాదని, అయితే ఆ ఒప్పందాలను 30 రోజుల్లోగా ట్రాయ్ కి అందజేయాలని మాత్రమే ఆదేశించామంటోంది.