• Home »
  • Legal Issues »
  • బ్రాడ్ కాస్టింగ్ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రైబ్యునల్: ప్రభుత్వం సంసిద్ధత

బ్రాడ్ కాస్టింగ్ వివాదాల పరిష్కారానికి ప్రత్యేక ట్రైబ్యునల్: ప్రభుత్వం సంసిద్ధత

బ్రాడ్ కాస్టింగ్ రంగంలో వివాదాల పరిష్కారానికి రంగానికి ప్రత్యేకంగా ఒక ట్రైబ్యునల్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం అందరూ టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పెల్లేట్ ట్రైబ్యునల్ (టిడిశాట్) ను ఆశ్రయిస్తుండగా టెలికామ్ వివాదాలతో బిజీగా ఉండే ఆలస్యం కాకుండా ఉండేందుకు బ్రాడ్ కాస్టింగ్ రంగానికి ప్రత్యేకంగా ఒక ట్రైబ్యునల్ ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నట్టు కేంద్ర ఆర్థిక, సమాచార, ప్రసార శాఖామంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.

టిడిశాట్ ఒక వైపు టెలికామ్ వివాదాలు పరిష్కరిస్తూనే, మరో వైపు బ్రాడ్ కాస్ట్ రంగ వివాదాలు కూడా పరిష్కరించ వలసిటంలో చాలా బిజీగా ఉండటం వల్ల బ్రాడ్ కాస్టింగ్ రంగం పరిష్కారాలకోసం చాలాకాలం వేచి ఉండాల్సి వస్తున్నది. వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగంలో డిజిటైజేషన్ కారణంగా వివాదాలు పెరగటం వలన ప్రత్యేకంగా ఒక ట్రైబ్యునల్ ఉండటం మంచిదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి నియంత్రణాసంస్థగా ఉన్న ట్రాయ్ నుంచి కూడా బ్రాడ్ కాస్ట్ రంగాన్ని కూడా విభజించి బ్రాయ్ (బ్రాడ్ కాస్ట్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) ఏర్పాటు చేయాలన్న డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తున్నదే.

ఢిల్లీలో జరిగిన ఒక సదస్సు సందర్భంగా టిడిశాట్ చైర్మన్ అఫ్తాబ్ అలం మాట్లాడుతూ  టెలికామ్ రంగం మీద వివాదాల కంటే బ్రాడ్ కాస్ట్ రంగం మీద వివాదాలే ఎక్కువగా వస్తున్నాయన్నారు. 2015లో మొత్తం 707 కేసులు నమోదుకాగా అందులో 593 కేసులు బ్రాడ్ కాస్ట్ రంగానికి చెందినవేనంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో జైట్లీ ఈ మేరకు హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా బ్రాడ్ కాస్ట్ రంగం కోసం వివాదాల పరిష్కారానికి ఒక ట్రైబ్యునల్ ఏర్పాటు చేయటానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరమూ ఉండదన్నారు. ఈ విషయాన్ని టెలికామ్ శాఖామంత్రికి కూడా తెలియజేస్తానన్నారు.