• Home »
  • Cable TV »
  • కేబుల్ వ్యాపారం మీద స్పష్టత ఇవ్వని కేంద్రం: నేటి నుంచి కేబుల్ ఎక్స్ పో

కేబుల్ వ్యాపారం మీద స్పష్టత ఇవ్వని కేంద్రం: నేటి నుంచి కేబుల్ ఎక్స్ పో

శాటిలైట్ చానల్స్ పెట్టుకోవటానికి వీల్లేదని రాష్ట్రప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు తెగేసి చెప్పిన కేంద్రం కేబుల్ వ్యాపారం మీద కూడా గతంలో ఆదేశాలిచ్చినా ఇప్పుడు మెతకవైఖరి అవలంబించినట్టు కనబడటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలూ లేకుండానే స్వయం ఉపాధి పొందుతూ లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ కోట్లాది మందికి కారు చౌకగా వినోదాన్నందిస్తున్న  కేబుల్ వ్యవస్థలో చొరబడటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే నోరు మెదపకపోవటానికి కారణాలు తెలియటం లేదు.

చౌకగా బ్రాడ్ బాండ్ ఇస్తామన్న వాగ్దానం అమలు కావాలంటే కేబుల్ వ్యాపారులు ఇంటింటికీ వేసిన కేబుల్ ద్వారానే సాధ్యమవుతుంది. ఈ అవకాశాన్ని వాడుకుంటూ, కేబుల్ మౌలిక సదుపాయాల సాయంతో ఇంటర్నెట్ సేవలు  అందిస్తూ కమిషన్ రూపంలో ఆపరేటర్లకు లబ్ధి చేకూర్చాల్సిన ప్రభుత్వం స్వయంగా టీవీ చానల్స్ పంపిణీ చేస్తానంటోంది. రాష్ట్రప్రభుత్వాలు ప్రసారాల పంపిణీ రంగంలోకి  రావటం ట్రాయ్ నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ  ట్రిపుల్ ప్లే పేరుతో ఈ వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంది.

కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన భారత్ నెట్ పథకం ఇంటర్నెట్ అందించటానికి ఉద్దేశించినదే అయినా కేబుల్ టీవీ సేవలను జోడించాలనుకోవటం కేవలం ఈ రంగంలో ఉపాధిని దెబ్బతీసి, చానల్ ప్రసారాలను గుప్పిట్లో పెట్టుకోవటం కోసమేనని అర్థమవుతోంది. ఒకే సెట్ టాప్ బాక్స్ తో మూడు సౌకర్యాలూ ఇస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొదట్లో ఊదరగొట్టింది. అప్పటికే కోట్లలో పెట్టుబడి పెట్టి సెట్ టాప్ బాక్సులు తెచ్చుకున్న ఎమ్మెస్వోలు  అయోమయంలో పడ్దారు. ఆ తరువాత అలా మూడు సౌకర్యాలకూ పనికొచ్చే సెట్ టాప్ బాక్స్ ప్రపంచంలోనే లేదు కాబట్టి టీవీ ప్రసారాలకు ఒకటి, ఇంటర్నెట్ కు మరొకటి కొనుక్కోవాలని ప్రభుత్వం స్వయంగా సూచించింది.

అది ఎలాగూ ఇప్పుడు అమలులో ఉన్న ప్రక్రియే అయినప్పుడు ప్రభుత్వం కల్పిస్తున్న వెసులుబాటు ఏంటనేది అర్థం కాదు. ఇంటర్నెట్ పంపిణీ వ్యాపారానికి ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు ఎప్పుడూ సంసిద్ధమేనని ప్రకటించినా, ప్రభుత్వానికి మాత్రం చానల్స్ ప్రసారం మీద పట్టు కావాలనే ఆలోచన కొనసాగుతూ వస్తోంది. లైసెన్స్ లేకపోయినా ఐపిటీవీ లైసెన్సుకూ కేబుల్ పంపిణీకీ ముడిపెట్టి గందరగోళాన్ని కొనసాగిస్తోంది. పైగా, ఈ నమూనాను అనుకరించటానికి ఇతర రాష్ట్రాలు కూడా సన్నద్ధమవుతున్నాయని చెప్పుకుంటున్న సమయంలో కేంద్రం స్పష్టత ఇవ్వాల్సిన అవసరముంది.

ఇలాంటి వైఖరి మీద కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వకపోవటంతో కేబుల్ పరిశ్రమలోని వారు ఈ రంగంలో మనుగడ ఉంటుందో లేదోనన్న అయోమయంలో పడ్దారు.  ఇప్పటిదాకా ఉన్న నిబంధనలను పక్కనబెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబుల్ టీవీ రంగంలో ప్రవేశించటానికి ప్రత్యేకంగా నిబంధనలు సడలించి ఉంటే సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆ విషయం వెల్లడించాలి.

గతంలో అనేక సందర్భాలలో మంత్రిత్వశాఖ వివరణలు అడగటం, కుదరదని ట్రాయ్ సమాధానమివ్వటం జరిగిపోయాయి. తమిళనాడు ప్రభుత్వం పెట్టుకున్న డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ నాలుగు నెలలుగా పెండింగ్ లో ఉంది. ఆ వ్యవహారం కోర్టులో కూడా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ ప్రభుత్వం మాత్రం కేబుల్ ప్రసారాలు అందిస్తామంటోంది. లైసెన్స్ వ్యవహారంలో ఎపి ఫైబర్ కూడా స్పష్టత ఇవ్వలేదు. ఒకవైపు కేబుల్ పరిశ్రమలో గందరగోళం ఏర్పడుతుంటే మరో వైపు అనుమతి రాకపోతే ప్రభుత్వం ప్రజా ధనాన్ని వృధా చేసిందన్న అప్రతిష్ట మూటగట్టుకోక తప్పదు.

ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా భూగర్భంలో కేబుల్ వేయటానికి నిధులిస్తామని చెబుతుంటే ఈ లోపే రాష్ట్రమంతటా కరెంట్ స్తంభాలకు వేలాడదీసే కేబుల్ వేసి ఇలాంటి తాత్కాలిక వ్యవస్థకోసమే దాదాపు వెయ్యికోట్లు వృధా చేసిన రాష్ట్రప్రభుత్వం ఈ హడావిడితో ఏం సాధించాలనుకుంటున్నదో అర్థం కావటం లేదు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం కేంద్రం ఇచ్చే నిధులు సద్వినియోగం చేసుకోవటంతోబాటు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాల అమలులో భాగంగా జరిపే తవ్వకాలనే కేబుల్ డక్ట్ వేయటానికి కూడా వాడుకోవాలనుకుంటోంది.  చీటికి మాటికి ఇబ్బందులు రాని భూగర్భ కేబ్లింగ్ కే మొగ్గుచూపుతోంది. ఇప్పటికే తవ్వకం పూర్తయిన చోట మాత్రమే ఏరియల్ ఫైబర్ వేయాలనిభావిస్తోంది.

ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకే కేబుల్ ప్రసారాలకు అవకాశం కల్పిస్తే శాటిలైట్ చానల్ ప్రసారాలన్నీ రాష్ట్రాల చేతుల్లో పెట్టినట్టే అవుతుంది. అప్పుడు ఏ చానల్ ప్రసారాలు ఆపేయాలన్నా అధికారపక్షం చేతుల్లో ఉండిపోతుంది. మీడియా స్వేచ్ఛను అధికారపక్షానికి కట్టబెట్టినట్టవుతుంది. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకోవటం వల్లనే ఇన్నాళ్ళూ రాష్ట్రాలకు ప్రసారాల నియంత్రణమీద అధికారం లేకుండా చేయగలిగారు. అదే నిబంధనను కొనసాగిస్తూ ఆ మేరకు స్పష్టమైన ప్రకటన చేయటం ద్వారా మాత్రమే కేబుల్ పరిశ్రమను కేంద్రం కాపాడగలుగుతుంది.

అదే విధంగా కేంద్రం తలపెట్టిన డిజిటల్ ఇండియా విజయవంతం కావాలంటే ఇంటింటికీ బ్రాడ్ బాండ్ అందించగల మౌలిక సదుపాయాలు కేబుల్ ఆపరేటర్లకు మాత్రమే ఉన్నాయి. అందుకే ఈ పంపిణీ బాధ్యతను ఆపరేటర్లకు అప్పగిస్తే సులభంగా ఇంటింటికీ చేర్చటానికి, కొంత ఆదాయం సమకూర్చుకోవటానికి వీలుగా ఉంటుంది. కేబుల్ టీవీ డిజిటైజేషన్ నెట్ వర్క్ ను అప్ గ్రేడ్ చేసుకున్న ఆపరేటర్లు తమ పెట్టుబడికి తగిన ఆదాయం సంపాదించుకునే వెసులుబాటు కలుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఈవిషయంలో కేంద్ర ప్రభుత్వ నిబంధనలు దృష్టిలో పెట్టుకుంటూ, ఆంధ్రప్రదేశ్ నమూనాను అనుకరించకుండా ముందుకెళ్ళాల్సిన అవసరముంది. కేబుల్ వ్యాపారం జోలికి రాకుండా కేబుల్ నెట్ వర్క్ ను సమర్థంగా ఉపయోగించుకుంటూ ఇంటింటికీ ఇంటర్నెట్ సౌకర్యం అందించటానికి కృషిచేయాలి.

రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేబుల్ పరిశ్రమ ప్రధానంగా కోరుకుంటున్నది పోల్ టాక్స్ తొలగించాలని, రైట్ ఆఫ్ వే (దారి హక్కు) సక్రమంగా అమలు చేయాలని.  కేంద్ర ప్రభుత్వం దారి హక్కు కల్పించినా స్థానికంగా చాలాచోట్ల అధికారులు ఇబ్బందిపెట్టటం, రాజకీయ జోక్యం ఈ పరిశ్రమకు అవరోధాలుగా తయారయ్యాయి. అండర్ గ్రౌండ్ కేబుల్ వేయటానికి దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్న ఈ సమయంలో అదే డక్ట్ లో కేబుల్ ఆపరేటర్లకు కూడా అవకాశమిస్తే ఏరియల్ కేబుల్ సమస్యలు ఉండవు కాబట్టి నామమాత్రపు అద్దె పద్ధతిలో ఈ సౌకర్యం కల్పించే దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి.

అనేక దేశాలలో కేబుల్ టీవీ డిజిటైజేషన్ స్వచ్ఛందంగా అమలు జరగటానికి దశాబ్దకాలం అవకాశం కల్పించారు. పైగా, సబ్సిడీ ధరలకు సెట్ టాప్ బాక్స్ కొనుక్కునే వీలు కల్పించారు. కానీ భారతదేశంలో మాత్రం నిర్బంధ డిజిటైజేషన్ అమలు చేస్తున్నారు. ఎలాంటి రాయితీలూ ఇవ్వలేదు. ఇది ప్రభుత్వం నిర్బంధంగా అమలు చేస్తున్న విధానమనే విషయం ప్రచారం చేయటంలో ప్రభుత్వ విఫలమైంది. దీనివల్ల ప్రసారాలు అందాలంటే సెట్ టాప్ బాక్సులు తీసుకోవాల్సిందేనంటూ ఎమ్మెస్వోలూ, ఆపరేటర్లూ బలవంతంగా అంటగడుతున్నారనే అపవాదు తప్పటం లేదు. ఈ పరిస్థితుల్లొ కేంద్రం కేబుల్ వ్యాపారం పట్ల సానుకూలమైన నిర్ణయాలు తీసుకోవటం ఎంతో అవసరం.