• Home »
  • Cable »
  • అదనపు చెల్లింపులు సర్దుబాటు చేయండి : కేబుల్ ఆపరేటర్ల డిమాండ్

అదనపు చెల్లింపులు సర్దుబాటు చేయండి : కేబుల్ ఆపరేటర్ల డిమాండ్

ట్రాయ్ ఇచ్చిన వెసులుబాటు ఉపయోగించుకొని హడావిడిగా చందా రేట్లు పెంచి వసూలు చేసిన పే చానల్ యాజమాన్యాలు ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ పెంపును రద్దు చేసినందువల్ల అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని కేబుల్ ఆపరేటర్లు కోరుతున్నారు. లేదా తాజా చెల్లింపులలో సర్దుబాటు కు ఒప్పుకుంటే ఎమ్మెస్వోల స్థాయిలోనే మినహాయించుకుంటామని చెబుతున్నారు.

2014 మార్చి 31 న టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా చందారేట్ల సవరణ ఆదేశాలు జారీచేసింది. పే చానల్ యజమానులు 27.5% మేరకు చందారేట్లు పెంచుకోవటానికి అందులో అవకాశం కల్పించింది. అంతే కాకుండా, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు చందా ధరలు పెంచుకోవటానికి కూడా వెసులుబాటు కల్పించింది. 27.5%  చందా పెంపును రెండు విడతలుగా అమలు చేసుకోవాల్సిందిగా బ్రాడ్ కాస్టర్లకు సూచించింది.

2014 ఏప్రిల్ 1 నుంచి 15% పెంచుకోవటానికి 2015 జనవరి 1 నుంచి 12.5% పెంచుకోవటానికి వీలు కల్పించింది. ఇది టోకు ధరల స్థాయిలోను, చిల్లర ధరల స్థాయిలోను అమలు చేయాలని నిర్ణయించింది.

అయితే, కొంతమంది ఎమ్మెస్వోలు ట్రాయ్ ఆదేశాలను సవాలు చేస్తూ టిడిశాట్ ను ఆశ్రయించారు. ద్రవోల్బణం అనేది నిత్యావసర సరకుల ధరల పెరుగుదలకు సంబంధించిన వ్యవహారమని, ఉద్యోగుల జీతభత్యాల పెంపుకు దాన్ని సూచికగా తీసుకుంటారని, ధరలకు ఏ మాత్రం సంబంధం లేకపోయినా పే చానల్స్ ధరలకూ ద్రవ్యోల్బణానికీ లంకెపెట్టటం ఏంటని టిడిశాట్ లో వాదించారు.

ఈ వాదనలో పస ఉన్నదని టిడిశాట్ అంగీకరించింది. ఫలితంగా 27.5% పెంపు ఆదేశాలను పక్కనబెట్టాల్సిందిగా ట్రాయ్ ని ఆదేశించింది. 2015 ఏప్రిల్ 28న టిడిశాట్ ఇచ్చిన ఈ తీర్పు సహజంగానే బ్రాడ్ కాస్టర్లను నిరాశపరచింది. అప్పటికే వసూళ్ళు మొదలుపెట్టిన బ్రాడ్ కాస్టర్లు టిడిశాట్ ఆదేశాలను పక్కనబెట్టి తమ వసూళ్ళను ఆమోదించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన సుప్రీంకోర్టు కూడా 2015 ఆగస్టు 4 న టిడిశాట్ ఆదేశాలను సమర్థించింది.

దీంతో అప్పటివరకూ చందాదారులు  చేసిన అదనపు చెల్లింపులను తిరిగి సర్దుబాటు చేయాల్సిన అవసరం ఏర్పడింది. అదే నిష్పత్తిలో ఆపరేటర్లు ఎమ్మెస్వోలకు చేసిన చెల్లింపులు, ఎమ్మెస్వోలు బ్రాడ్ కాస్టర్లకు చేసిన చెల్లింపులు వరుసగా వెనక్కి రావాల్సి ఉంది. 2014 మే 29 న టిడిశాట్ ఆదేశాలు స్పష్టంగా ఈ విషయం మీద వివరణ ఇచ్చాయి:

“ఈ దశలో మేం ఎలాంటి స్టే ఉత్తర్వులూ ఇవ్వదలచుకోవటం లేదు. అయితే, సంబంధితులందరూ విడిగా ఒక ఖాతా తెరచి అందులో ఈ లెక్కలు రాసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నాం. ఒకవేళ అప్పీలు విజయవంతమైతే అదనంగా చెల్లించిన చందాదారులు ఆ తరువాత నెలలలో ఆ అదనపు మొత్తాన్ని ఆ తరువాత నెలలలో సంబంధిత ఆపరేటర్ల నుంచి సర్దుబాటు ద్వారా మినహాయించుకునే అవకాశం ఉంది. అదే విధంగా ఆపరేటర్లు ఎమ్మెస్వోల నుంచి, ఎమ్మెస్వోలు బ్రాడ్ కాస్టర్లనుంచి మినహాయింపు పొందవచ్చు.”

అయితే ఎమ్మెస్వోలు ఇప్పటివరకూ తిరిగి ఇవ్వటంగాని, సర్దుబాటు గాని చేయలేదు. నాలుగు నెలలపాటు ఈ సర్దుబాటు అమలుచేయాలని భారత కేబుల్ ఆపరేటర్ల సమాఖ్య, నేషనల్ కేబుల్ అండ్ టెలికమ్యూనికేషన్స్ అసోసియేషన్ ట్రాయ్ కి విజ్ఞప్తి  చేశాయి. ఆపరేటర్లు ఆ చెల్లింపులకు సంబంధించిన ఇన్వాయిస్ లు, బాంక్ స్టేట్ మెంట్ కూడా జతచేయాలని సూచించాయి.  చందాదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సర్దుబాటు చేయాలని సంఘాలు ట్రాయ్ కి విజ్ఞప్తి చేశాయి.