• Home »
  • Broadband »
  • మాతో ఒప్పందానికి రండి: ఎపి ఫైబర్ అధికారులకు సీమాంధ్ర ఆపరేటర్ల పిలుపు

మాతో ఒప్పందానికి రండి: ఎపి ఫైబర్ అధికారులకు సీమాంధ్ర ఆపరేటర్ల పిలుపు

చౌక ధరకే ఇంటింటికీ కేబుల్ టీవీ, ఇంటర్నెట్, ఫోన్ సౌకర్యం కల్పించేలా  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు కింద కేబుల్ ఆపరేటర్లను గుర్తించాలని సీమాంధ్ర కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. ఎమ్మెస్వోల తరహాలో కేబుల్ ఆపరేటర్లతో కూడా ఎం ఒ యు చేసుకోవాలని కూడా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైబర్  నెట్ లిమిటెడ్ (ఎపి ఎస్ ఎఫ్ ఎల్)  ను కోరింది. ఇటీవల ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన 200 మందికి పైగా కేబుల్ ఆపరేటర్లతో ఎపి ఎస్ ఎఫ్ ఎల్ సమావేశం జరిపినప్పుడు ఈ పథకం అమలు విషయంలో అధికారులు అనేక అంశాలు చర్చించారు.

ఎపి ఎస్ ఎఫ్ ఎల్ ఇప్పటికే ఎమ్మెస్వోలతో ఒప్పందం చేసుకున్నప్పటికీ ఇంకా ఆపరేటర్లతో ఎలాంటి ఒప్పందమూ చేసుకోలేదని, నిజానికి ఇంటింటికీ కనెక్టివిటీ ఆపరేటర్ల చేతిలోనే ఉంటుందన్న విషయం మరువకూడదని ఆపరేటర్లు గుర్తు చేశారు. ఫైబర్ టు ద హోమ్ తో బాటు సంబంధిత స్విచ్ లు కూడా ఎపి ఎస్ ఎఫ్ ఎల్ అందజేయాలని కోరారు. ప్రభుత్వం రూ.149 కి ఇవ్వజూపుతున్న పాకేజ్ ఇంటర్నెట్ కి సంబంధించినదే తప్ప ఉచిత చానల్స్ కి సంబంధించినది కాదనే విషయం ప్రజలకు ప్రభుత్వమే చెప్పాల్సి ఉందని కూడా స్పష్టం చేశారు.

ఎమ్మెస్వోల పాత్ర లేని చోట ఆదాయంలో ఆపరేటర్ల వాటా స్పష్టంగా చెప్పాలని సంఘం అధ్యక్షుడు దివాకర్ డిమాండ్ చేశారు. ఇది వాణిజ్యపరమైన కార్యకలాపమే తప్ప ఇదొక సంక్షేమ కార్యక్రమం కాదన్న విషయం కూడా ప్రభుత్వమే ప్రజలకు వివరించాలని కోరారు. ఈ అంశాలన్నిటిమీద స్పష్టత వచ్చేలా ముఖ్యమంత్రితో ఆపరేటర్ల సంఘం ప్రతినిధుల సమావేశానికి ఏర్పాటు చేయాలని కోరారు.