• Home »
  • Broadcasting »
  • కేబుల్ సమాచార్, ఎస్ సి టి ఇ ఆధ్వర్యంలో 29న సాంకేతిక సదస్సు

కేబుల్ సమాచార్, ఎస్ సి టి ఇ ఆధ్వర్యంలో 29న సాంకేతిక సదస్సు

కేబుల్ టీవీ పరిశ్రమ మీద సమగ్ర సమాచారాన్నందించే మాస పత్రిక “ కేబుల్ సమాచార్ “ ఇపుడు పరిశ్రమలో నెలకొన్న సాంకేతిక నిపుణుల లోటు మీద దృష్టి సారించింది. అత్యంత అరుదైన శిక్షణను, అత్యాధునిక శిక్షణలు అందుబాటులోకి తెచ్చి నిపుణులను స్వయంగా తయారుచేయటానికి రంగంలోకి దిగింది. ఇందుకోసం ఎస్ సి టి ఇ ( సొసైటీ ఫర్ కేబుల్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ) సహకారం కూడా తీసుకుంటోంది.

డిజిటైజేషన్ పెద్ద ఎత్తున అమలు జరుగుతున్న సమయంలో తగినంత మంది సాంకేతిక నిపుణులు లేకపోవటం ముందు ముందు మరింత సమస్యగా మారుతుందని గ్రహించిన మీదట వెంటనే రంగంలోకి దిగినట్టు కేబుల్ సమాచార్ గౌరవ సంపాదకులు, తెలంగాణ ఎమ్మెస్వోల సమాఖ్య అధ్యక్షులు అయిన సుభాష్ రెడ్డి చెప్పారు. నెలరోజుల వ్యవధి ఉండే ఈ ప్రత్యేకమైన శిక్షణకు అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు.

ఈ శిక్షణ పట్ల అవగాహన కలిగించేందుకు ఈ నెల 29 న ఎస్ సి టి ఇ తో కలిసి ఒక సమావేశం నిర్వహిస్తోంది. సాంకేతికాంశాలు, శిక్షణ, డిజిటైజేషన్ అనే అంశాలమీద సికింద్రాబాద్ మనోహర్ థియేటర్ సమీపంలోని యూత్ హాస్టల్ లో ఈ సమావేశం జరుగుతుందని సుభాష్ రెడ్డి ఒక ప్రకటనలో తెలియజేశారు. ఉదయం 10 గంటలనుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకు సాగే సమావేశంలో ఎస్ సి టి ఇ నిపుణులు సహా పలువురు ప్రసంగిస్తారు.