• Home »
  • Broadband »
  • ఆగస్టు 12 నుంచి హైదరాబాద్ హైటెక్స్ లో 3 రోజుల కేబుల్ నెట్ ఎక్స్ పో విజన్

ఆగస్టు 12 నుంచి హైదరాబాద్ హైటెక్స్ లో 3 రోజుల కేబుల్ నెట్ ఎక్స్ పో విజన్

డిజిటల్ ఇండియా నినాదం, దేశవ్యాప్తంగా జరుగుతున్న కేబుల్ డిజిటైజేషన్ నేపథ్యంలో 4వ కేబుల్ నెట్ ఎక్స్ పో విజన్ కు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. ఆగస్టు 12 నుంచి 14 వరకు జరిగే ఈ ప్రీమియం ఎగ్జిబిషన్ కు  ప్రతిష్ఠాత్మకమైన హైటెక్స్ వేదికగా నిలుస్తోంది. దేశవిదేశీ సంస్థలు పాల్గొనే ఈ ప్రదర్శనకు తెలుగు రాష్ట్రాలనుంచే కాకుండా దేశం నలుమూలనుంచి ప్రతినిధులు హాజరవుతారు.

డిజిటల్ ఇండియా రూపొందాలన్న విజన్ తో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ మౌలిక సదుపాయాలను ప్రతి పౌరునికీ దగ్గరగా చేసి వినియోగంలో భాగస్వాములను చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఆ విధంగా పౌరులందరికీ డిజిటల్ సాధికరత లభించాలన్నదే డిజిటల్ ఇండియా ధ్యేయం. అన్ని ప్రభుత్వ శాఖలనూ ప్రజలకు దగ్గరగా తీసుకొచ్చి అనుసంధానం చేయటం ద్వారా ప్రభుత్వ సేవలన్నీ ఎలక్ట్రానిక్ విధానంలో ప్రజల ముంగిటకే వస్తాయి.  పైగా, దీనిద్వారా 5 కోట్ల ఉద్యోగాలు కల్పించవచ్చునని కేంద్ర ప్రభుత్వం అంచనావేసింది. డిజిటల్ ఇండియా కల సాకారం కావడానికి బ్రాడ్ బాండ్ వేదిక అవుతుంది.

మరో వైపు కేబుల్, శాటిలైట్ పరిశ్రమ కూడా డిజిటల్ ఇండియాలో కీలపాత్ర పోషించబోతున్నది. అందుకే కేబుల్ డిజిటైజేషన్ ప్రక్రియను ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నిర్దిష్ట గడువులోగా పూర్తిచేయాలని నిర్ణయించుకుంది. అదే సమయంలో భారతదేశంలో టీవీలు ఉండే ఇళ్ళ సంఖ్య గణనీయంగా పెరుగుతూ రావటం ఈ పరిశ్రమకు సానుకూలమైన ధోరణి. 2017 నాటికి భారతదేశంలో టీవీ ఉండే ఇళ్ళ సంఖ్య 17 కోట్ల 30 లక్షలకు పెరిగి 91శాతం అవుతుందని ఫిక్కీ- కెపిఎంజి నివేదిక అంచనావేసింది. 2012-17 మధ్యకాలంలో టెలివిజన్ పరిశ్రమ ఏడాదికి సగటున 18 శాతం చొప్పున పెరుగుతూ  2102 లో  ఉన్న రూ. 37,000  విలువ 2017 నాటికి రూ.84,800 కోట్లకు చేరుకుంటుందని కూడా చేరుకుంటుందని అంచనావేశారు. ఈ ఎదుగుదలకు దోహదం చేసే ప్రధానమైన అంశం డిజిటైజేషన్ కావటం ఎంతో కీలకం.

టీవీ చానల్స్ ప్రేక్షకాదరణను కొలిచే టామ్ సంస్థ వెల్లడించిన వార్షిక నివేదిక ప్రకారం భారతదేశంలో టీవీ ఉన్న ఇళ్ల సంఖ్య ఏటా 8 నుంచి 10 శాతం మేర పెరుగుతూ వస్తోంది. 2014 సెప్టెంబర్ నాటికి డిటిహెచ్ సహా డిజిటల్ టీవీ దాదాపు 64 శాతం ఇళ్లకు చేరుకుంది.ప్రభుత్వం తలపెట్టిన డిజిటైజేషన్ ప్రక్రియ వేగంపుంజుకున్న ఫలితంగా ఎక్కువ చానల్స్ చూసే అవకాశాన్ని ప్రేక్షకులు వినియోగించుకుంటున్నారు. దేశంలో 31 కోట్ల 20 లక్షల ఇళ్లకు గాను 27 కోట్ల 70 లక్షల ఇళ్ళలో టీవీ సెట్లు ఉండగా రెండేసి టీవీలు ఉండే ఇళ్ల సంఖ్య కూడా బాగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో జరుగుతున్న కేబుల్ నెట్ ఎక్స్ పో విజన్ – 2015 ఎగ్జిబిషన్ , సదస్సు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రదర్శనలో పాల్గొనే వారిలో బ్రాడ్ బాండ్, కమ్యూనికేషన్స్, టెలివిజన్, ప్రొడక్షన్ విభాగాలకు చెందిన ఎగ్జిబిటర్లు ఈ ప్రదర్శనలో పాల్గొంటున్నారు. క్లౌడ్, డిజిటల్ టెరెస్ట్రియల్ టీవీ, కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ ( కాస్ ), సబ్ స్క్రైబర్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ( ఎస్ ఎమ్ ఎస్ ), డి టిహెచ్, ఈ –కామర్స్, గేమింగ్, వైర్ లెస్ టెక్నాలజీ, హెడ్ ఎండ్ ఇన్ ద స్కై ( హిట్స్ )  తదితర విభాగాలకు చెందిన టెక్నాలజీలని అనేక సంస్థలు  ఈ ప్రదర్శనలో ప్రదర్శిస్తాయి. బ్రాడ్ కాస్ట్ ఎక్విప్ మెంట్ తయారీదారులు, కొనుగోలు దారులు, కేబుల్ ఆపరేటర్లు, ఎమ్మెస్వోలు. డీలర్లు, రిటైలర్లు, ఐటి హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ విద్య, పరిశోధక సంస్థల ప్రతినిధులు , ఇంజనీరింగ్ కళాశాలల ప్రతినిధులు ఈ ప్రదర్శనకు హాజరవుతారు.

సదస్సు లో చర్చించే కీలక అంశాలు  

  • వచ్చే ఐదేళ్ళలో డిజిటైజేషన్ లో భాగంగా వచ్చే మార్పులలో ఎమ్మెస్వోలు, ఆపరేటర్లపాత్రను దృష్టిలో ఉంచుకుంటూ కేబుల్ పరిశ్రమ పునర్నిర్మాణం
  • ప్రభుత్వం ప్రకటించిన హెడ్ ఎండ్ ఇన్ ద స్కై ( హిట్స్ ) విధానం
  • కేబుల్ పరిశ్రమలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానం
  • ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఇంటర్నెట్ టెలీఫొనీ కల్పించే అవకాశం
  • టీవీ ప్రేక్షకుల లెక్కింపు విధానంలో వచ్చిన మార్పు
  • కాస్ అమలుకాని చోట్ల టారిఫ్ విధానం
  • స్థానిక కేబుల్ ఆపరేటర్లకు, ఎమ్మెస్వోలకు ప్రత్యేక లైసెన్సింగ్ విధానం

దేశవ్యాప్తంగా డిజిటైజేషన్ మూడు, నాలుగు దశలు అమలు జరుగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో జరుగుతున్న ఈ ప్రదర్శన ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. అందుకే ప్రధానంగా ఎమ్మెస్వోలు, కేబుల్ ఆపరేటర్లు పెద్ద ఎత్తున హాజరై అనుమానాలు తీర్చుకొని తగిన నిర్ణయాలు తీసుకోవటానికి ఈ అవకాశాన్ని వాడుకుంటారని భావిస్తున్నారు. అందుకు తగినట్టే డిజిటైజేషన్ కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానానికి ప్రాధాన్యం కూడా ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు.