• Home »
  • Entertainment »
  • డబ్బింగ్ సీరియల్స్ ను అడ్డుకుంటున్న కర్నాటక టీవీ సంఘానికి సిసిఐ జరిమానా

డబ్బింగ్ సీరియల్స్ ను అడ్డుకుంటున్న కర్నాటక టీవీ సంఘానికి సిసిఐ జరిమానా

ఇతర భాషలనుంచి కన్నడలోకి డబ్ చేసిన అంశాలేవీ ప్రసారం కాకుండా అడ్డుకుంటున్నందుకు కర్నాటక టెలివిజన్ సంఘం జరిమానా చెల్లించాల్సి వస్తోంది. కర్నాటక టెలివిజన్ అసోసియేషన్, కర్నాటక ఫిల్మ్ చాంబర్ ఆప్ కామర్స్, కన్నడ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్  కాంపిటిషన్ చట్టం, 2002 లోని సెక్షన్ 3 ని ఉలంఘించాయంటూ ప్రేక్షకుల తరఫున ఒక సంఘం చేసిన ఫిర్యాదును విచారించిన కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా విచారణ జరిపి, ఇది పోటీ తత్వానికి విరుద్ధమంటూ  సుమారు రూ.20 లక్షలు జరిమానా విధించింది.

కన్నడ సినీ పరిశ్రమ ప్రయోజనాలు కాపాడుకోవటమే లక్ష్యంగా దశాబ్దాలక్రితం అక్కడ తీసుకున్న నిర్ణయం     ఫలితంగా కర్నాటకలో డబ్బింగ్ చిత్రాల ప్రదర్శన నిలిపేసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత వచ్చిన టీవీ రంగానికీ అదే నియమాన్ని వర్తింపజేసుకున్నారు. అయితే, తాజగా ప్రేక్షకుల సంఘం తరఫున దాఖలైన పిటిషన్ ను విచారించిన కాంపిటిషన్ కమిటీ డైరెక్టర్ జనరల్ ఈ విధానాన్ని తప్పుబట్టారు.  స్థానిక భాషను, సంస్కృతిని కాపాడుకోవటానికి ఇలాంటి చర్య తీసుకున్నామన్న వాదనను కమిషన్ తోసిపుచ్చింది. వాణిజ్యపరంగా కార్యకలాపాలు నిర్వహించుకునేవారిని అడ్డుకోవటమే అవుతుందని కమిషన్ అభిప్రాయపడింది.

గతంలో ఒకసారి కర్నాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్  కు ఆదేశాలిచ్చినా అమలు చేయకపోవటంతో ఇది తీవ్రమైన అంశంగా పరిగణిస్తున్నట్టు కమిషన్ పేర్కొంది.  సంస్థ సగటు ఆదాయంలో 10 శాతంగా లెక్కించి రూ. 16, 82, 204 జరిమానా విధించింది. కర్నాటక టెలివిజన్ అసోసియేషన్ కు రూ. 1,74,293, కర్నాటక ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్  కు రూ. 1,68,124 జరిమానా విధించింది. అయితే, ఈ సంస్థలు నిర్ణయం మార్చుకుంటాయా అనేది మాత్రం ప్రశ్నార్థకమేనని కన్నడ సినీ, టీవీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.