• Home »
  • Cable »
  • రాష్ట్ర ప్రభుత్వాలకు ఎమ్మెస్వో లైసెన్స్ మీద కేంద్రం మల్లగుల్లాలు, అయోమయంలో ఎపి

రాష్ట్ర ప్రభుత్వాలకు ఎమ్మెస్వో లైసెన్స్ మీద కేంద్రం మల్లగుల్లాలు, అయోమయంలో ఎపి

రాష్ట్రప్రభుత్వాలకు టీవీ రంగంలో ఎలాంటి పాత్రా ఉండకూడదన్నది ఇప్పటివరకూ కేంద్రప్రభుత్వపు నిశ్చితాభిప్రాయం. పశ్చిమబెంగాల్, కర్నాటక, హర్యానా ఇప్పటికే తమ రాష్టప్రభుత్వాల తరఫున చానల్స్ నడుపుకోవాలని అడిగి భంగపడ్డాయి. అదే  నిబంధనను ప్రభుత్వం గుర్తు చేసింది. ట్రాయ్ సిఫార్సును ఆమోదించిన సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఆ నియమానికి అన్ని విధాలా కట్టుబడింది. ఇంకా విచిత్రమేంటంటే, కేవలం రాష్ట్రప్రభుత్వాల విషయంలోనే కేంద్రం అలా వ్యవహరిస్తున్నదనుకుంటే పొరపాటే. కేంద్రంలోని మంత్రిత్వశాఖలు అడిగినా సరే ఒప్పుకోలేదు. మానవ వనరుల శాఖ అలాంటి సమస్యనే ఎదుర్కుంది. వ్యవసాయ శాఖ కూడా సొంత చానల్ కోసం అనుమతి అడిగి చివరికి దూరదర్శన్ బాటలో ప్రసారభారతి రూపంలో నడిపేదాకా ఆగాల్సి వచ్చింది.

అయితే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద వత్తిడి వస్తోంది. రాష్ట్రప్రభుత్వాలు శాటిలైట్ చానల్స్ విషయంలో అడిగీ అడిగీ అలసిపోయాయిగాని తమిళనాడు ప్రభుత్వం మాత్రం అలుపెరుగని పోరాటం చేస్తూనే ఉంది. ఒకవైపు కోర్టుల్లో న్యాయపోరాటం సాగిస్తూనే మరోవైపు కేంద్రానికి లేఖాస్త్రాలు సంధిస్తూ ఉంది. తమిళనాడుది ఒక ప్రత్యేకమైన సమస్య. అక్కడ కేబుల్ టీవీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంది. తమిళనాడు అరసు కేబుల్ టీవీ పేరుతో ఎమ్మెస్వోలనుంచి వ్యాపారాన్ని సొంతం చేసుకొని ఆపరేటర్ల వ్యవస్థతో శాటిలైట్ చానల్స్ ను ఇంటింటికీ చౌక ధరకే అందిస్తోంది.

మొదట్లో  ఎలాంటి  సమస్యలూ ఎదురుకాలేదుగాని డిజిటైజేషన్ మొదలైనప్పుడు కష్టాలు మొదలయ్యాయి. డిజిటల్ ఎమ్మెస్వోగా లైసెన్స్ ఉండితీరాలన్న నిబంధన ఉండటంతో తమిళనాడు అరసు కేబుల్ టీవీ కూడా దరఖాస్తు చేసుకుంది. కేంద్రం ఆ దరఖాస్తును అలా పెండింగ్ లో పెట్టింది. ట్రాయ్ నిబంధనల ప్రకారం రాష్టప్రభుత్వాలకు టీవీ వ్యాపారంతో సంబంధాలు ఉండకూదదన్న విషయాన్ని చూపుతూ కేంద్రప్రభుత్వం ఆ దరఖాస్తును పక్కన బెట్టింది. తమిళనాడు ప్రభుత్వం కోర్టుకెళ్ళినా  ఈ వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు.

బిజెపి అధికారపగ్గాలు చేపట్టగానే జయలలిత  ఈ విషయాన్ని ప్రధాని మోడీ దృష్టికి తెచ్చారు. అంతకుముందు యుపిఏ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తనమీద కక్షసాధించేందుకే డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ ఇవ్వలేదని కూడా ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి  ఇటీవలి ఎన్నికల దాకా 16 విడతలు ప్రధానికి లేఖలు రాశారు. అయినా ఫలితం కనబడలేదు. కోర్టులో కూడా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నిర్దిష్టమైన సమాధానం ఇవ్వకుండా జాప్యం చేస్తూనే ఉంది. ఇటీవలి ఎన్నికలలో మళ్ళీ విజయం సాధించిన జయలలిత ప్రధానిని కలిసినప్పుడు ఈ సమస్యను ప్రస్తావించారు.

దేశమంతటా డిజిటైజేషన్ అమలు జరుగుతూ ఉంటే మొదటిదశలోని నాలుగు మెట్రో నగరాలలో ఒకటైన చెన్నై మాత్రం డిజిటైజేషన్ కు దూరంగా ఉండిపోయింది. రెండో దశలో ఉన్న మదురై, కోయంబత్తూరులాంటి నగరాలలోనూ అదే పరిస్థితి. మూడో దశ మరీ దారుణం, ఇంకోవైపు ప్రభుత్వం నాలుగోదశకూడా మొదలైందని చెప్పుకుంటూ వస్తోంది. బ్రాడ్ కాస్టర్లు ఎమ్మెస్వోతో ఒప్పందం చేసుకోవాలంటే ఎమ్మెస్వోకు లైసెన్స్ ఉండాలి. అరసు కేబుల్ కు లైసెన్స్ లేదు కాబట్టి ఒప్పందాలు జరగవు. అంటే డిజిటైజేషన్ ముందుకు సాగదు.

తమిళనాడు పరిస్థితి ఇలా ఉంటే ఆంధ్రప్రదేశ్ ది మరో విచిత్రమైన సమస్య.  ప్రభుత్వం చౌకధరకే ఇంటింటికీ ఇంటర్నెట్ ఇవ్వాలని నిర్ణయించింది. నిజానికి  కేంద్రప్రభుత్వం తలపెట్టిందీ ఇదే పథకం. కేంద్ర ప్రభుత్వ పథకం ప్రకారం భూగర్భంలో ఆప్టిక్ ఫైబర్ కేబుల్స్ వేయాలి. అది ఎక్కువకాలం మన్నుతుంది. కానీ ఖర్చు కూదా  ఎక్కువే. అయితే, ఆంధ్రప్రదేశ్ మాత్రం సొంత ఖర్చుతో ఓవర్ హెడ్ కేబుల్స్ తో అన్ని రాష్ట్రాలకంటే ముందుండాలని ప్రయత్నిస్తోంది. పైగా ఇంటింటికీ టీవీ , టెలిఫోన్ కూడా ఇస్తామంటూ ప్రచారం చేసుకుంది. ఇలా కేబుల్ టీవీ ప్రసారాలలోకి దిగాలంటే డిజిటల్ ఎమ్మెస్వోగా లైసెన్స్ కావాలి. ఐపిటివి లైసెన్స్ ఉందంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ ఆ తరువాత వచ్చిన నిబంధనలప్రకారం రాష్ట్రప్రభుత్వాలకు టీవీ రంగంలోకి వచ్చే అవకాశమే లేదు. దీంతో ఇప్పుడు తమిళనాడుకు లైసెన్స్ వస్తే ఆంధ్రప్రదేశ్ కు కూడా వస్తుంది.

అదే జరిగితే అనేక రాష్ట్రాలు కేబుల్ టీవీని తమ గుప్పిట్లో పెట్టుకోవటానికి ప్రయత్నిస్తాయి. అంటే, రాష్ట్ర ప్రభుత్వాలే ఎమ్మెస్వోగా మారటానికి అవకాశముంది. అప్పుడు చానల్స్ ను తమ గుప్పిట్లో పెట్టుకునే ప్రమాదముంది. ఇప్పటికే అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెస్వోలను భయపెడుతున్న సందర్భాలుండగా, తమ పరిధిలోకే ప్రసారాలు వస్తే ప్రభుత్వాలు ఎలా వ్యవహరిస్తాయో చెప్పాల్సిన పనిలేదు. లాభాపేక్ష లేకుండా పనిచేస్తే ఇప్పుడున్న ఎమ్మెస్వోల కంటే కాస్త తక్కువ ధరకు ప్రసారాలు అందించే అవకాశముందిగాని మీడియా స్వేచ్ఛకు మాత్రం పెనుముప్పు పొంచి ఉంటుంది. పైగా, రాష్ట్ర ప్రభుత్వాలు సొంతగా కేబుల్ చానల్స్ పెట్టుకొని తమ సొంత ప్రచారానికి కూడా చానల్స్ ను వాడుకునే అవకాశముంది. దీనికి కేంద్రం ఒప్పుకుంటుందా అన్నది ఇప్పుడు అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే కేబుల్ పరిశ్రమ మొత్తం అతలాకుతలమయ్యే అవకాశాలున్నాయి. ఇది ఎమ్మెస్వోల వ్యవస్థనే పూర్తిగా దెబ్బతీసే ప్రమాదముంది. ప్రతి రాష్టప్రభుత్వమూ తానే ఒక ఎమ్మెస్వోగా మారి ఆపరేటర్లకు ప్రసారాలు అందించటం మొదలుపెడితే ఇక ఎమ్మెస్వో కనుమరుగవుతాడు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి డిజిటల్ ఎమ్మెస్వో వ్యవస్థను నిర్మించుకున్న ఎమ్మెస్వో  రోడ్డున పడతాడు.  ఇక్కడ మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వాలు తమకు నచ్చిన ఎమ్మెస్వోలను కాపాడుకొని, అవసరమైన చోట పోటీ ఎమ్మెస్వోను  తయరుచేయవచ్చు. అంటే, అధికారపార్టీకి అనుకూలంగా ఉండేవాళ్ళే ఎమ్మెస్వోలుగా మిగులుతారు. అంతమాత్రాన కేబుల్ ఆపరేటర్ సురక్షితమనుకుంటే అదీ పొరపాటే. అక్కడ కూడా పోటీని రెచ్చగొట్టి అనుకూలమైనవాళ్ళకు కొమ్ముగాయవచ్చు.

ఈ సమస్యలన్నీ దృష్టిలో ఉంచుకోకుండా  కేంద్రప్రభుత్వం రాష్ట్రాలకు డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ ఇస్తే ముందు ముందు అనేక ఇబ్బందులు తప్పవు. ఒకవైపు మీడియా స్వేచ్ఛకు విఘాతం, మరో వైపు కేబుల్ పరిశ్రమ మొత్తం చిక్కుల్లో పడుతుంది. రాష్ట్రప్రభుత్వాలు సైతం కారేజ్ ఫీజు వసూలు చేయబోవన్న గ్యారెంటీ ఏమీ లేదు. అందువలన చానల్స్ తమకేదో మేలు జరుగుతుందని ఆశించటానికి అసలే వీల్లేదు. తమిళనాడు లోని అరసు కేబుల్ టీవీ అందుకు ఉదాహరణ. అక్కడ కూడా ముక్కుపిండి కారేజ్ ఫీజు వసూలు చేస్తున్నారు.

అందుకే శాటిలైట్ చానల్స్ కూడా ఈ విషయంలో భయపడుతున్నాయి. రాష్టప్రభుత్వమే శాటిలైట్ చానల్స్ నడిపే అవకాశమూ ఉంది. డిజిటల్ ఎమ్మెస్వో లైసెన్స్ ఇచ్చినట్టే శాటిలైట్ లైసెన్స్ కూడా ఇస్తే శాటిలైట్ చానల్స్ ప్రారంభిస్తాయి. అదే సమయంలో పే చానల్స్ ను ధరలు తగ్గించాల్సిందిగా వత్తిడి తెచ్చే అవకాశమూ ఉంది. కారేజ్ ఫీజు పెంచటానికి, ప్లేస్ మెంట్ ఫీజు వసూలు చేయటానికి అవకాశముంది.

తమిళనాడు లైసెన్స్ వ్యవహారం ఇంకో రెండు మూడు నెలల్లోనే తేలిపోతుందని చెబుతున్న ట్రాయ్ అధికారులు ఈ మధ్యనే సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అధికారులతో సమావేశమై ఈ విషయంలో ముందు ముందు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉందో వివరించారు. ఇప్పుడు కేంద్రం ఎలా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందో కేబుల్ పరిశ్రమ ఎదురుచూస్తోంది. తన అధికారాలు కొన్నింటిని రాష్ట్రాలకు వదిలేసి, కేబుల్ పరిశ్రమను ఇబ్బందుల్లో పడేస్తుందా, తన పట్టు కోల్పోకుండా చూసుకుంటుందా అనేది తేలాల్సి ఉంది.