Channel Setup & Licencing Rules

channelset1

ఛానల్ ఏర్పాటు – లైసెన్సింగ్ నియమాలు

1991లో మొదలైన ఆర్థిక సంస్కరణల ఫలితంగా దేశంలో ప్రయివేట్ శాటిలైట్ ఛానల్స్ ప్రభంజనం మొదలయింది. ప్రజల వినోద, సమాచారం అవసరాలను తీర్చటంలో దూరదర్శన్ సఫలం కాలేకపోవటం వలన శాటిలైట్ ఛానల్స్ నాణ్యమైన ప్రసారాలతో పోటీపడటం ప్రారంభించాయి. మొదట్లో జాతీయ చానల్స్, ఆ తరువాత ప్రాంతీయ చానల్స్ రాకలో భాగంగా దక్షిణాదిన మలయాళ, కన్నడ చానల్స్ తరువాతనే తెలుగు ఛానల్స్ కూడా పుంజుకున్నాయి. ఛానల్స్ కు అనుమతి ఇవ్వటానికి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలు రూపొందించి వాటికి అనుగుణంగా అనుమతులివ్వటం మొదలుపెట్టింది. మొదట్లో, అంటే 2005 కు ముందు వరకు కేవలం అప్ లింకింగ్ లైసెన్స్ తీసుకుంటే సరిపోయేది. ఆ తరువాత కాలంలో వచ్చిన మార్పులు, చట్టపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకొని వేరు వేరుగా అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ అనుమతులివ్వటం మొదలైంది. ఈ అనుమతులు భారతదేశంలో ప్రసారమయ్యే విదేశీ ఛానల్స్ కి కూడా వర్తింపచేయటం ద్వారా విదేశీవార్తలు దేశ సమగ్రతను దెబ్బతీసేలా లేకుండా జాగ్రత్త తీసుకుంటోంది. వార్తలు ప్రసారం చేసే ఛానల్స్ ను, ఇతర వినోద కార్యక్రమాలు ప్రసారం చేసే ఛానల్స్ ను వాటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని న్యూస్ ఛానల్స్, నాన్ న్యూస్ ఛానల్స్ అనే రెండు విభాగాలుగా గుర్తించి అనుమతులు మంజూరుచేస్తోంది.

ఛానల్ ఎంపిక

ఒక ఛానల్ పెడితే ఎలా ఉంటుంది? చాలా మందికి చాలా సందర్భాలలో ఇలాంటి ఆలోచన వచ్చే ఉంటుంది. ఛానల్ పెట్టాలంటే ఎంతవుతుందేంటి? అని అడిగే వాళ్లకు కొదవే లేదు. ఛానల్ ఆలోచన మంచిదే కావచ్చు గాని ఏదో ఒక ఛానల్ అనుకోవటం మాత్రం పొరపాటు. ముందుగా ఎలాంటి ఛానల్ అనే విషయంలో స్పష్టత అవసరం. ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారా, 24 గంటల న్యూస్ ఛానల్ గురించి ఆలోచిస్తున్నారా, ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ లోనే న్యూస్ బులిటెన్స్ ఉండాలనుకుంటున్నారా, ఇవేవీ కాకుండా బిజినెస్,  మ్యూజిక్, ఆధ్యాత్మికం, కామెడీ, పిల్లలు, విద్య, ఆరోగ్యం, పర్యాటకం లాంటి ఏ ఒక్క అంశం గాని కొన్నిటిని కలిపి గాని ఛానల్ తీసుకురావాలనుకుంటున్నారా? ఒక స్పష్టమైన అవగాహన లేకుండా ఛానల్ కోసమే ఛానల్ అనే ఆలోచన మాత్రం మంచిది కాదు.

మార్కెట్ విశ్లేషణ

ముందుగా టీవీ పరిశ్రమ గురించి స్థూలంగానైనా తెలుసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఆలోచిస్తున్న తరహా ఛానల్ కి అవకాశం ఉందా? దీన్నేNeed Gap Analysis అంటారు. ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ పెట్టాలనుకుంటే ఇప్పుడున్న ఛానల్స్ ఆర్థిక పరిస్థితి ఏమిటి? అవి ఎందుకు విజయం సాధించాయి లేదా ఎందుకు విఫలమయ్యాయి? దేని మార్కెట్ వాటా ఎంత? వాటి ప్రత్యేకతలేమిటి? వాటికంటే భిన్నంగా ప్రేక్షకులకు ఎలాంటి న్యూస్ ఛానల్ ఇచ్చి ఆకట్టుకోగలం? ఎంత ఖర్చవుతుంది? పెట్టుబడి ఎంత? నెలవారీ ఖర్చెంత? ఆదాయ మార్గాలేమిటి? లాభనష్టాలు లేని స్థితి ఎన్నాళ్లకు వస్తుంది?ఇలాంటి విషయాలన్నీ పరిశీలించాలి. సినిమా హక్కులు కొనకుండా ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ కష్టం. ఎన్ని సినిమాలు మార్కెట్ లో ఉన్నాయి? వాటికోసం పోటీపడితే ఎంత ఖర్చవుతుంది? ఇలాంటివన్నీ ముందుగానే తెలుసుకోవాలి. న్యూస్ బులెటిన్స్ కూడా ఉండాలంటే ముందుగానే న్యూస్ ఛానల్ లైసెన్స్ తీసుకోవాలి. న్యూస్ ఛానల్ పెట్టాలనుకున్నా మార్కెట్ సర్వే తప్పనిసరి. ఇప్పుడున్న ఛానల్స్ ఎన్ని? వాటికంటే భిన్నంగా ఎలా తీసుకురాగలం? ప్రేక్షకుడు ఈ ఛానల్ నే చూడాలని ఎందుకు అనుకుంటాడో స్పష్టమైన అవగాహన ఉండాలి. కాస్త భిన్నంగా ఉంటేనే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చుననో, ఫలానా ఛానల్ అయితే ఎక్కువ ప్రకటనలు వస్తాయనో, పొరుగు రాష్ట్రంలో అది క్లిక్ అయిందనో ఆలోచించినా ఫరవాలేదు. లాభాల కంటే నష్టాల గురించి బాగా ఆలోచించి గట్టిగా నిలబడగలమనే నమ్మకం కుదిరితే ఛానల్ యజమాని కావటానికి సిద్ధమైపోవచ్చు.

కంపెనీ రిజిస్ట్రేషన్

ఛానల్ పెట్టాలని నిర్ణయించుకున్నతర్వాత కంపెనీ రిజిస్ట్రేషన్ చేయించాలి. పెట్టాలనుకునే ఛానల్ ను బట్టి ఆ కంపెనీ నికర ఆస్తుల విలువ ఉండాలి. ప్రస్తుతం ఉన్న నియమాల ప్రకారమైతే న్యూస్ ఛానల్ కు 20 కోట్లు, నాన్ న్యూస్ ఛానల్  అయితే 5 కోట్లు ఉండాలి. ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ అయితే విదేశీపెట్టుబడుల విషయంలో ప్రత్యేకమయిన నియమాలేవీ లేవుగానీ న్యూస్ ఛానల్ అయితే 49 శాతానికి మించి ఉండకూడదు. కంపెనీ రిజిస్ట్రేషన్ తో పాటుగా బ్రాండ్ పేరు… అంటే ఛానల్ పేరు కూడా ఖరారు చేసి రిజిస్టర్ చేయించాలి. న్యూస్ ఛానల్ అయితే విదేశీ డైరెక్టర్ల ఎంపికలోనూ, కీలకమైన ఉద్యోగుల విషయంలోనూ కొన్ని నిబంధనలు ఉన్నాయి. డైరెక్టర్లకు ఎలాంటి నేరచరిత్రా ఉండకూడదు. ఫెరా(విదేశీ మారకద్రవ్య నియంత్రణ చట్టం)నిబంధనల ఉల్లంఘన లాంటి ఆర్థిక సంబంధమైన అవకతవకలకు పాల్పడి ఉండకూడదు. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకుని నమోదు చేయించాలి.

బాండ్ విడ్త్ ( Band Width)

రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ఛానల్ ఏర్పాట్లు చురుగ్గా మొదలవుతాయి. శాటిలైట్ ట్రాన్స్ పాండర్ లో బాండ్ విడ్త్ బుకింగ్ ఇందులో మొదటి దశ. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) వారి మార్కెటింగ్ విభాగం Band Width లీజు ఒప్పందాలు చేసుకుంటుంది. మూడు నెలల అద్దె అడ్వాన్స్ గా తీసుకుని Band Width ఒప్పంద పత్రం మీద సంతకాలు చేస్తుంది. వాస్తవంగా బాండ్ విడ్త్ ఉపయోగించుకున్నప్పటినుండే లీజు మొత్తాన్ని వసూలు చేస్తారు. అందుకే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక ఎప్పుడు ఛానల్ మొదలు పెట్టబోతున్నారో కనీసం ఒక నెల ముందుగా ఇస్రో అధికారులకు తెలియజేస్తే తగిన ఏర్పాట్లు చేస్తారు. ఒప్పందం కుదుర్చుకున్నాం కదా అని అన్ని ఏర్పాట్లూ చేసుకుని ఛానల్ మొదలుపెడతామనుకుంటే ఇస్రో చేతులెత్తేయవచ్చు. బాండ్ విడ్త్ ఇప్పటికిప్పుడు లేదని చెప్పవచ్చు. ఒప్పందంలో అందుబాటులో ఉంటే (Subject to availability) అనే వాక్యం ఉండనే ఉంటుంది. 20-25 పేజీలుండే ఆ ఒప్పందంలో ఈ చిన్న పాయింట్ చూసీ చూడకుండా వదిలేస్తే ఆ తరువాత ఇబ్బందులు రావచ్చు. అందుకే ఛానల్ ప్రారంభించబోయే ముందే ఆ తేదీని ఇస్రోకు తెలియజేసి అప్పటికి బాండ్ విడ్త్ సిద్ధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే, ప్రభుత్వ సంస్థ ఇస్రో నుంచి మాత్రమే బాండ్ విడ్త్ తీసుకోవాలనే షరతును ఇటీవలికాలంలో సడలించారు. అందువలన విదేశీ ఉపగ్రహాలనుంచి కూడా బాండ్ విడ్త్ తీసుకునే సౌకర్యం ఉంది. ఇప్పుడు తెలుగులో దాదాపు సగం చానల్స్  ఇంటెల్ శాట్ లాంటి విదేశీ ఉపగ్రహాలమీదనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి.

లైసెన్స్ దరఖాస్తు ( License Application )

బాండ్ విడ్త్ ఒప్పందం తర్వాత ఛానల్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుతో పాటు ఈ ఒప్పందం ప్రతిని జత చేయాలి. అదే విధంగా కంపెనీ రిజిస్ట్రేషన్ పత్రాలు, డైరెక్టర్ల వివరాలు, వారి వాటాల వివరాలు పొందుపరచాలి. ఒరిజినల్ దరఖాస్తుతో పాటు మరో నాలుగు ప్రతులు సమర్పించాల్సి ఉంటుంది. వివిధ విభాగాల అనుమతులు అనంతరమే లైసెన్స్ ఇస్తారు గనక ఆయా విభాగాలకు పంపడం కోసమే ఇలా మొత్తం ఐదు ప్రతులు అందజేయాలి. అది న్యూస్ ఛానలా, నాన్ న్యూస్ ఛానలా అనేది దరఖాస్తులో స్పష్టంగా పేర్కొనాలి. దరఖాస్తుతో పాటు ప్రాజెక్ట్ రిపోర్ట్ జత చేయాలి. పెట్టబోయే ఛానల్ మీద ఏ మేరకు అధ్యయనం జరిగిందో, లాభాలు  సంపాదించేందుకు ఏ మేరకు అవకాశం ఉందో ప్రాజెక్ట్ రిపోర్టులో వివరించాలి. పెట్టుబడి వనరులు, ఆదాయ అవకాశాలు, లాభాల్లోకి వచ్చేవరకు తట్టుకోగలిగే శక్తి, బ్యాంకులు తదితర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందేందుకు కుదుర్చుకున్న ఒప్పందాల వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజుగా పదివేల రూపాయలు చెల్లించి సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ కార్యాలయంలో ఐదుప్రతుల దరఖాస్తులు అందజేయాలి. ఈ వ్యవహారాలన్నీ చూసుకోవటానికి కొంతమంది కన్సల్టెంట్లు కూడా ఉన్నారు. అయితే అలాంటి వాళ్లను తాము ప్రోత్సహించటం లేదని సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖ తేల్చిచెప్పింది. దరఖాస్తు నింపడం మొదలుకొని చాలా విషయాలు తెలియకపోవటం వల్లనే చాలామంది కన్సల్టెంట్లను  ఆశ్రయిస్తుంటారు. ప్రతి నెల మొదటి వారంలో దరఖాస్తుదారుల సమస్యలు పరిష్కరించటానికి ఈ మధ్యనే మంత్రిత్వశాఖ ఏర్పాట్లు చేసింది. దరఖాస్తు ఏ స్థాయిలో ఉంది, ఏవైనా లోపాలున్నాయా, ఎక్కడ ఆగింది అనే ప్రశ్నలన్నింటికీ ఆ సమావేశంలో సమాధానాలు దొరుకుతాయి.

ఒక దరఖాస్తు పూర్తిస్థాయిలో ఆమోదం పొంది లైసెన్స్ రావటానికి ఐదు నుంచి ఆరు నెలలు పడుతుంది.

ఇతర అంశాలు

ఒకవైపు దరఖాస్తు ప్రాసెసింగ్ జరుగుతుండగానే మరోవైపు ఛానల్ ఏర్పాటు, నిర్వహణకు సంబంధించిన పనులు చురుగ్గా సాగాలి. కీలక సిబ్బంది నియామకం జరగాలి. న్యూస్ ఛానల్ అయితే న్యూస్ లో కనీసం పదేళ్ల మీడియా అనుభవం ఉన్న వారు ఆ విభాగ నిర్వహణ బాధ్యతలు చూస్తారని దరఖాస్తులోనే చెప్పిఉండటం వలన అటువంటి వాళ్లను నియమించుకోవాలి. మిగిలిన వనరుల సమీకరణ కూడా చురుగ్గా సాగాల్సిన సమయమిది. వివిధ విభాగాల అధిపతులను నియమించటం పూర్తయ్యాక జూనియర్ (ట్రెయినీ) ఉద్యోగుల ఎంపిక, శిక్షణ మొదలవుతాయి. కార్యాలయానికి అన్ని హంగులు సమకూర్చుకోవటం కూడా ఈ దశలోనే సాగుతుంది. టెక్నికల్, మార్కెటింగ్, ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ తదితర విభాగ అధిపతులు సమన్వయంతో పురోగతిని సమీక్షించుకుంటూ ముందుకు సాగుతారు. ప్రొడక్షన్ సొంత వనరులతో చేపట్టాలా, ఔట్ సోర్సింగ్ చెయ్యాలా రెండు పద్ధతులూ తగిన నిష్పత్తిలో పాటించాలా అనేది నిర్ణయించి అమలు ప్రారంభించాలి. ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ అయితే సినిమాల ప్రసార హక్కుల కొనుగోలు వంటి అంశాల మీద దృష్టి సారించాలి.

ఆ తరువాత ప్రధానమైన అంశం బ్రాడ్ కాస్ట్ పరికరాల కొనుగోలు. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండటం వలన ఇందుకు తగినంత సమయం అవసరం. కన్సల్టెంట్లను నియమించుకునే పక్షంలో ఆయా పరికరాల అమ్మకందారులను వారే తీసుకువస్తారు. ముందుగా ఛానల్ కు తగిన పరికరాలు ఎంచుకోవాలి. అప్పటికే ఇతర ఛానల్స్ ఏయే బ్రాండ్లు వినియోగిస్తున్నాయి, ఆ బ్రాండ్లు ఎంత బాగా పనిచేస్తున్నాయి అనే అంశాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. అమ్మకాల తర్వాత ఆయా సంస్థలు అందించే సేవలు ఎలా ఉంటాయి, ధరలు వంటి విషయాలు ప్రధానంగా పరిశీలిస్తారు. పరికరాల ఎంపిక జరిగిన తర్వాత ఆర్డర్ చేయాలి. సాధారణంగా బ్యాంక్ గ్యారంటీ/ఎల్ సీ లాంటి తతంగాలు పూర్తయ్యాక ఆరు వారాల్లో సామాగ్రి చేరుతుంది. వాటిని తగిన విధంగా అమర్చుకోవటానికి కనీసం మూడువారాల సమయం పడుతుంది. ఈ లోపల స్టూడియో, దాని అనుబంధ విభాగాల నిర్మాణం, లైటింగ్,ఎయిర్ కండిషనింగ్, ఇంటీరియర్స్ లాంటి ఏర్పాట్లు పూర్తవుతాయి.

ఛానల్ ను గాలిలోకి పంపటం ఒక ఎత్తు, దాన్ని అందుకుని ప్రేక్షకులకు అందించటం ఒక ఎత్తు. అందుకే కేబుల్ ఆపరేటర్ చాలా కీలకమైన వ్యక్తి అయ్యాడు. ప్రతి ఆపరేటర్ ఈ ఛానల్ సిగ్నల్స్ అందుకుని ప్రేక్షకులకు చూపించ గలిగితే దాని సామర్థ్యాన్ని బట్టి అది నిలదొక్కుకోగలుగుతుంది. అందువలన ముందుగా చానల్ అందరికీ అందుబాటులోకి రావాలి. కనుక పంపిణీ అనేది ఛానల్ కు అత్యంత కీలకమైనది. చాలా సందర్భాల్లో ముఖ్యమైన ఆపరేటర్లకు కారేజ్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఛానల్ బడ్జెట్ లో కూడా ఇందుకోసం ప్రత్యేకమయిన ఏర్పాటు ఉండాలి. రెండో ప్రధానమైన అంశం మార్కెటింగ్. సొంత వ్యవస్థ ఏర్పాటు చేసుకోవటమా, ఔట్ సోర్సింగ్ మంచిదా అనేది నిర్ణయించుకోవాలి. స్లాట్స్ అమ్మకం, కార్యక్రమాల తయారీ మాత్రమే బయటివాళ్లకిచ్చి సొంతగా మార్కెట్ చేసుకోవటం, సొంతగా కార్యక్రమాలు రూపొందించి స్పాన్సర్లను రాబట్టటం లాంటి పద్ధతుల మీద చర్చించి, లాభదాయకమైన మార్గాన్ని నిర్ణయించుకుంటారు. ఈ సమయానికి ఛానల్ లైసెన్స్ వచ్చి, టెక్నికల్ గా కూడా సిద్ధంగా ఉంటుంది కనక అంతా సజావుగా ఉందో, లేదో సరిచూసుకునేందుకు ట్రయల్ రన్ మొదలవుతుంది. సాంకేతికమైన అంశాలతో బాటు కార్యక్రమాల సన్నద్ధత కూడా సరిచూసుకునేందుకు ఈ సమయం ఉపయోగపడుతుంది. సాధారణంగా ఈ సమయంలో ఆఖరినిమిషం మార్పులకు ఎక్కువ అవకాశం ఉంటుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవటం ద్వారా లాంచింగ్ మొదటినుంచే మంచిపేరు తెచ్చుకోగలిగే వీలుంటుంది. కనీసం 15 రోజులపాటు టెస్ట్ సిగ్నల్ పేరుతో ట్రయల్ రన్ నడిచిన తరువాతనే ఛానల్ లాంచ్ చేయటం సర్వసాధారణం.

 

లైసెన్సింగ్ ప్రక్రియ

న్యూస్ ఛానల్ అయినా, నాన్ న్యూస్ ఛానల్ అయినా, న్యూస్ ఏజెన్సీ అయినా దరఖాస్తు ఒకే రకంగా ఉంటుంది. కాకపోతే ఒక్కో ఛానల్ కి షరతులు ఒక్కో రకంగా ఉంటాయి. దరఖాస్తు ఒరిజినల్ తో పాటు మరో నాలుగు ప్రతులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రాసెసింగ్ ఫీజు పదివేల రూపాయలు కూడా దరఖాస్తుతో కలిపి సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ లో సమర్పించాలి. అంశాల వారీగా దరఖాస్తు ఎలా నింపాలో పరిశీలిద్దాం.

లైసెన్స్ దరఖాస్తు నింపే విధానం

  1. దరఖాస్తు చేస్తున్న కంపెనీ పేరు, డైరెక్టర్ల వివరాలు ఇవ్వాలి. సీఈవో/ఎమ్ డీతో మొదలుపెట్టి వరుసగా పేరు, తండ్రిపేరు, పుట్టిన తేదీ, జాతీయత, పాస్ పోర్ట్ వివరాలు, సంస్థలో హోదా, చిరునామాతో ఒక జాబితాతో రాయాలి. దరఖాస్తు చేసిన తరువాత కూడా డైరెక్టర్ల జాబితాలో ఏవైనా మార్పులుంటే వెంటనే మంత్రిత్వ శాఖకు తెలియజేయాలి. లైసెన్స్ వచ్చాక డైరెక్టర్లలో మార్పు అవసరమైతే ముందుగా తెలియజేసి అనుమతి తీసుకోవాలి.
  2. ప్రధాన కార్యాలయం చిరునామా, ప్రాంతీయ కార్యాలయం చిరునామా, టెలిఫోన్ నంబర్లు, ఫాక్స్ నంబర్, ఈ మెయిల్ అడ్రస్, కంపెనీ రిజిస్ట్రేషన్ వివరాలు తెలిపే మెమొరాండం ఆఫ్ అసోసియేషన్, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ పత్రాలు
  3. వాటా మూలధరం వివరాలు: అధీకృత మూలధనం, చెల్లింపు మూలధనం
  4. వాటాదారుల వాటా వివరాలు: ప్రత్యక్ష పెట్టుబడులు, పరోక్ష పెట్టుబడులు, వాటిలో భారతీయుల వాటా శాతం, విదేశీయుల వాటా శాతం విడివిడిగా వివరంగా చూపాలి. ప్రత్యక్ష, పరోక్ష కలిపి మొత్తం విదేశీ వాటా ఎంత ఉందో స్పష్టంగా పేర్కొనాలి.
  5. నికర ఆస్తుల విలువను పేర్కొంటూ, ఈ మేరకు నిర్ధారిస్తూ ఆడిటర్ ఇచ్చిన ధృవపత్రం జత చేయాలి. ఆదాయ వనరులు ఏమిటో వివరించాలి. వీటన్నింటినీ వివరించే ప్రాజెక్ట్ రిపోర్ట్ జత చేయాలి.
  6. ఏ రంగంలో ఎలాంటి పాత్ర నిర్వహించబోతున్నదీ పేర్కొనాలి.
  7. అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ ట్రాన్స్ పాండర్ల వివరాలు ఇవ్వాలి. లీజుకు తీసుకుంటున్న శాటిలైట్ పేరు, కక్ష్య (ఆర్బిటర్ లొకేషన్), ట్రాన్స్ పాండర్ వివరం,బాండ్ విడ్త్ సిగ్నల్ వివరాలు, ట్రాన్స్ పాండర్ అద్దెకిస్తున్న కంపెనీ పేరు, అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ ఫ్రీక్వెన్సీలు ఇవ్వాలి. లీజు ఒప్పందం ప్రతిని జత చేయాలి. ఒకవేళ విదేశీ ఉపగ్రహాన్ని వినియోగిస్తున్నట్టయితే, స్వదేశీ ఉపగ్రహాన్ని ఎందుకు వినియోగించటం లేదో వివరణ ఇవ్వాలి.
  8. టెలిపోర్ట్ దరఖాస్తు అయిన పక్షంలో దాని వివరాలివ్వాలి. టెలిపోర్ట్ సమకూర్చే సంస్థ పేరు, చిరునామా, స్థలం, యాంటెన్నా సైజు, టెలిపోర్ట్ లైసెన్స్ వివరాలు పేర్కొనాలి.
  9. ఛానల్స్ అయితే ఈ వివరాలివ్వాలి. టెలిపోర్ట్ ఏది, ఎక్కడిది? టెలిపోర్ట్ సమకూర్చే సంస్థ పేరు, చిరునామా, స్థలం, యాంటెన్నా సైజు, టెలిపోర్ట్ లైసెన్స్ వివరాలు పేర్కొనాలి.
  10. ఛానల్స్ సంఖ్య, పేర్లు, భాష, డిజిటల్ అన్ లాగ్, ఫ్రీ ఛానలా, ఎన్క్రిప్టెడ్ ఛానలా? ఎప్పుడు ఛానల్ మొదలుపెట్టాలని అనుకుంటున్నారో వివరణ ఇవ్వాలి.
  11. న్యూస్ అండ్ కరెంట్ ఎఫైర్స్ ఛానల్ అయితే ఫామ్ 1ఏ, 1బి (వాటాదారుల వాటా వివరాలు, విదేశీ పెట్టుబడులకు సంబంధించిన సమాచారం), నాన్ న్యూస్ ఛానల్ అయితే ఫామ్ 1ఏ, ఫామ్ 1సి జత చేసినట్లు ధృవీకరించాలి.

( న్యూస్ అండ్ కరెంట్ ఎఫైర్స్ ఛానల్ దరఖాస్తు అయితే ఈ దిగువ పేర్కొన్న అదనపు సమాచారం )

  1. సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించే వ్యక్తి వివరాలు: పేరు, తండ్రి పేరు, పుట్టినతేదీ, జాతీయత, పాస్ పోర్ట్ వివరాలు, హోదా, చిరునామా

లైసెన్స్ రాకముందే సంపాదకుడు మారిన పక్షంలో ఆ విషయాన్ని మంత్రిత్వ శాఖకు వెంటనే తెలియజేయాలి. లైసెన్స్ ఇచ్చిన తరువాత మార్చాలనుకుంటే ముందుగా ఆ కొత్త వ్యక్తి వివరాలు తెలియజేసి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

  1. కంపెనీలో వాటాల నిష్పత్తికి అనుగుణంగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నియామకం జరిగిందా లేదా వివరణ ఇవ్వాలి. ఒక వేళ ఆ నిష్పత్తి పాటించకపోతే అందుకు కారణాలు తెలియజేయాలి.
  2. పి ఐ బి (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) అక్రెడిటేషన్ వివరాల ధృవపత్రం జతచేయాలి.
  3. అర్హతలకు సంబంధించిన క్లాజ్ సికి అనుగుణంగా ఉన్నట్టు చార్టర్డ్ అకౌంటెంట్ ఇచ్చిన ధృవపత్రం జత చేయాలి.
  4. వాటాదారుల ఒప్పంద పత్రాలు, రుణ ఒప్పంద ప్రతాలు, కుదుర్చుకోబోయే ఒప్పందాల వివరాలు జతచేయాలి.

( న్యూస్ ఏజెన్సీ దరఖాస్తు అయితే ఈ దిగువ పేర్కొన్న అదనపు సమాచారం ఇవ్వాలి )

  1. పి ఐ బి(ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) అక్రెడిటేషన్ వివరాల ధృవపత్రం జతచేయాలి.
  2. ఏజెన్సీ నూటికి నూరు శాతం భారతీయ యజమానులదేనా? వాటాదారుల వివరాలతో ధృవపత్రం జతచేయాలి.
  3. వార్తల పంపిణీకి ఉపయోగించే పరికరాల వివరాలు : ఎస్ ఎన్ జీ, డిఎస్ఎన్ జీ లాంటివి
  4. వార్తల సేకరణ, పంపిణీ పరికరాలు నెలకొల్పే ప్రదేశాల వివరాలు

ఇచ్చిన సమాచారం అంతా సరైనదేనంటూ దరఖాస్తుదారుని సంతకం, పేరు, కార్యాలయ చిరునామా, సీలు, తేదీ ఉండాలి.

ఇతర లైసెన్సులు

ప్రాథమికంగా మనం చేసుకునేది అప్ లింకింగ్ దరఖాస్తు. అంటే ఈ అనుమతి మన ఛానల్ సిగ్నల్స్ ను శాటిలైట్ కు పంపడానికి మాత్రమే. తిరిగి భారతదేశంలో డౌన్ లింక్ చేసుకోవడానికి మరో అనుమతి అవసరమవుతుంది. దాన్నే డౌన్ లింకింగ్ పర్మిషన్ అంటారు. డౌన్ లింకింగ్ పర్మిషన్ లేని ఛానల్స్ ను కేబుల్ ఆపరేటర్ పంపిణీ చేయటానికి వీల్లేదు. అందువల్ల భారత్ లో ప్రసారమయ్యే అన్ని ఛానల్స్ కు డౌన్ లింకింగ్ అనుమతి తప్పనిసరి. అయితే భారత్ భూభాగం నుంచి అప్ లింక్ అవుతూ ఇక్కడ డౌన్ లింక్ కాని ఛానల్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకు దక్షిణాఫ్రికాలోని హిందీ మాట్లాడే భారతీయుల కోసం జీ టీవీ ఒక ఛానల్ ప్రత్యేకంగా ప్రారంభిస్తే దానికి భారతదేశంలో అప్ లింకింగ్ అనుమతి మాత్రమే తీసుకుంటుంది. దక్షిణాఫ్రికా చట్టాల ప్రకారం అక్కడ అవసరమైతే డౌన్ లింకింగ్ అనుమతి తీసుకుంటుంది. అదే విధంగా విదేశీ ఛానల్స్ భారత్ లో ప్రసారం కావాలంటే భారత ప్రభుత్వ,సమాచార ప్రసారాల మంత్రిత్వ శాఖ ఇచ్చే డౌన్ లింకింగ్ అనుమతి తీసుకుని తీరాలి.  సాధారణంగా అప్ లింకింగ్ అనుమతి లభించిన భారతీయ ఛానల్స్ కు డౌన్ లింకింగ్ కు సమయం చాలా తక్కువ పడుతుంది. ఈ రెండు అనుమతులు లభించిన తర్వాత పూర్తి స్థాయి లైసెన్స్ వస్తుంది. ఆ సమయంలో ప్రభుత్వ నియమాలకు కట్టుబడి ప్రసారాలు సాగిస్తామని ఒక ఒప్పందం మీద సంతకం చేసి ఏడాదికి రెండు లక్షల చొప్పున చెల్లించి లైసెన్స్ తీసుకుంటారు.

 బ్యాంకు గ్యారంటీ  ( Performance Bank Guarantee )

కొత్త నియమాల ప్రకారం చానల్ కు లైసెన్స్ వచ్చిన రోజు నుంచి ఏడాది లోపు ఆ ఛానల్ ప్రసారాలు ప్రారంభించాలి. లేని పక్షంలో లైసెన్స్ రద్దవుతుంది. అదే సమయంలో ఏడాది లోపు ప్రసారాలు ప్రారంభిస్తామంటూ హామీ పత్రంతో పాటు న్యూస్ ఛానల్ అయితే రెండు కోట్లకు, నాన్ న్యూస్ ఛానల్ అయితే ఒక కోటికి బ్యాంకు గ్యారంటీ సమర్పించాల్సి ఉంటుంది. 2011 డిసెంబర్ ఐదున ఈ కొత్త నిబంధన అమలు లోనికి వచ్చినప్పటికీ, అంతకుముందు లైసెన్స్ పొందినా ప్రసారాలు ప్రారంభించని ఛానల్స్ కు కూడా ఈ నియమం వర్తింపచేశారు.