• Home »
  • Cable »
  • పాకేజీలమీద చందాదారులకు తగినంత సమాచారం లేదు: క్రోమ్ అధ్యయనం

పాకేజీలమీద చందాదారులకు తగినంత సమాచారం లేదు: క్రోమ్ అధ్యయనం

మూడోదశ డిజిటైజేషన్ ఒక కొలిక్కి వస్తూ అఖరిదైన నాలుగో దశ వైపు అడుగులేస్తుండగా  సగటు చందాదారుడు మాత్రం మామూలు ప్రశ్నలకు కూదా జవాబు చెప్పలేని స్థితిలో ఉన్నాడు. స్థానిక కేబుల్ ఆపరేటర్ లేదా డిటిహెవ్ పంపిణీదారుడు చెప్పాల్సిన విషయాలమీద ఏ మాత్రమూ అవగాహన లేదు. అందువలన ఇరుపక్షాలమధ్య లావాదేవీలకు ఎలాంటి ప్రాతిపదికాలేదు. ఎమ్మెస్వో లేదా ఆపరేటర్ చెప్పిన ప్రకారం, ఇచ్చిన పాకేజ్ కి డబ్బు కట్టటం తప్ప చేస్తున్న దేమీ లేదు. పాకేజ్ మారినప్పుడు వాళ్ళకు చెప్పటం లేదు. ఇంకా తక్కువ ధరకు అందుబాటులో న్న పాకేజీల గురించి కూడా చెప్పటం లేదు. ఇది స్వయంగా క్రోమ్ డిఎం వెల్లడించిన నివేదిక.

అటు చానల్ యజమానికి గాని, ఇటు వినియోగదారుడికి గాని సరైన సమాచారం అందటం లేదు. చందాదారుడికి నిజంగా తనకు అవసరమైన చానల్స్ కే చెల్లిస్తున్నాడన్న గ్యారెంటీ ఏమీ లేదు.. కారణమేంటంటే పాకేజీలే తప్ప ఎక్కడా అ లా కార్టే చానల్స్ ఊసే ఉండటం లేదు. నిజానికి  ఒక చందాదారు రూ. 400 చెల్లిస్తూ ఉండవచ్చు. కానీ అతడు చూసే చానల్స్ అన్నీ కలిపినా వాటి ధర రూ.250 కి మించకపోవచ్చు. సమాధానాలు లేని అనేక ప్రాథమిక ప్రశ్నలతో ఈ నివేదిక సాగింది. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( ట్రాయ్ )  చందాదారు దరఖాస్తు ఫామ్ ప్రవేశపెట్టి విపరీతంగా ప్రచారం చేసినప్పటికీ ఆచరణలో మాత్రం అది ఉపయోగపడటం లేదు. అదే డిటిహెచ్ విషయంలో మాత్రం  చందాదారులకు వాళ్ళ పాకేజీల గురించి బాగానే తెలుస్తున్నట్టు క్రోమ్ నివేదిక వెల్లడించింది.

క్షేత్ర స్థాయిలో చాలా అయోమయం ఉండటం వలన ఈ రంగంలోని వారందరూ ప్రభావితులవుతున్నారని కూడా పేర్కొంది, ప్రభుత్వం, బ్రాడ్ కాస్టర్, ఎమ్మెస్వో, ఆపరేటర్, చందాదారులు అందరూ ఏదో విధంగా ప్రభావితులవుతున్నట్టు గుర్తించింది. ఆసక్తికరమైన విషయమేంటంటే చందాదారులు అసలు అ లా కార్టే పద్ధతిలో స్పోర్ట్స్ చానల్స్ మాత్రమే ఇస్తున్నారని అనుకుంటున్నట్టు క్రోమ్ సర్వే గుర్తించింది. ఉత్సాహం కొద్దీ ఆ యా చానల్స్ వెబ్ సైట్స్ చూసినవాళ్ళు కూడా అవి కొత్త రేట్లో పాత రేట్లో అర్థం కాని అయోమయంలో ఉన్నట్టు క్రోమ్ ప్రకటించింది. అందుకే సమాచారం ఇరువైపులా ప్రవహించాలని సూచిస్తూ చందాదారును చీకట్లో ఉంచటం మంచిది కాదని అభిప్రాయపడింది.

మొదటి రెండు దశల్లోనూ కలిపినా 16 శాతానికి మించి పాకేజీలు అమలు కాలేదని లెక్కలు తేల్చాయి. మొదటి దశలో 24 శాతం, రెండో దశలో 13 శాతం అమలు జరగగా మొత్తం మీద 16 శాతమే అమలైనట్టు క్రోమ్ సర్వే గుర్తించింది. కొన్ని చోట్ల విపరీతమైన తేడాలు గమనించినట్టు క్రోమ్ వెల్లడించింది. కోల్ కతాలోని ( రాజాబజార్, రాధామాధవ్ దత్తా, గార్డెన్ లేన్ ) ఇద్దరు వ్యక్తులు ఒకే ప్రాంతానికి చెందినవారు తమ రెండు వేరు వేరు ధరలు చెల్లిస్తున్నారు. ఒకరు రూ.330 చెల్లిస్తుంటే మరొకరు రూ.350 చెల్లిస్తున్నారు. మొదటి వ్యక్తికి 228 చానల్స్ అందుతుండగా రెండో వ్యక్తికి 342 చానల్స్ వస్తున్నాయి. వాళ్ళకి కనీసం రసీదులు కూడా అందటం లేదు.

దశ అమలు చేసిన పాకీజీలు ఆమలు చేయని పాకేజీలు మొత్తం అమలు శాతం
1వ దశ 20 63 83 24%
 2వ దశ 32 213 245 13%
మొత్తం 52 276 328 16%

కీలకమైన ప్రాథమిక అంశాలపట్ల శ్రద్ధ లేకపోతే ఫలితాలు దారుణంగా ఉంటాయని క్రోమ్ డేటా అనలిటిక్స్ అండ్ మీడియా వ్యవస్థాపక సీఈవో పంకజ్ కృష్ణ అభిప్రాయపడుతున్నారు. అంతిమంగా వినియోగదారునికి అవగాహన కరవైతే సమస్య మరింత తీవ్రరూపం ధరిస్తుందని, మొత్తం డిజిటైజేషన్ ప్రక్రియనే అపహాస్యం చేస్తుందని వ్యాఖ్యానించారు.