• Home »
  • Entertainment »
  • టీవీ నిర్మాతలతో అమీతుమీకి సిద్ధమైన సినీ ఉద్యోగులు: 3 నుంచి నిరవధిక సమ్మె

టీవీ నిర్మాతలతో అమీతుమీకి సిద్ధమైన సినీ ఉద్యోగులు: 3 నుంచి నిరవధిక సమ్మె

పశ్చిమ భారత సినీ ఉద్యోగుల సమాఖ్య మళ్ళీ టీవీ నిర్మాతలతో యుద్ధానికి సిద్ధమైంది. ఏకాభిప్రాయం కుదిరి ఐదు నెలలు గడవకముందే మళ్ళీ సమ్మె సైరన్ మోగించింది. దినసరి వేతనం పెంచాలని,ఉద్యోగ పరిస్థితులు మెరుగుపడాలని సమాఖ్య సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. టీవీ నిర్మాతలతో ఒప్పందానికి రాలేకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరితో సమాఖ్యకు, టీవీ నిర్మాతలకూ మధ్య అవగాహనాఒప్పందం గడువు పూర్తయింది. దాన్ని పునరుద్ధరించకపోవటంతో మే నెలలో సమ్మె చేయాలని సమాఖ్య సభ్యులు నిర్ణయించుకున్నారు. అయితే, నిర్మాతలు దిగి వచ్చి, వేతనాల పెంపుకు, ఒప్పందం పునరుద్ధరణకు ఒప్పుకున్నారు. దీంతో అప్పట్లో సమ్మె నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నారు.

కానీ ఇప్పటికీ ఒప్పందం మీద సంతకాలు కాకపోవటంతో సమ్మె అనివార్యమని సమాఖ్య నిర్ణయించుకుంది. అక్టోబర్ 2 లోగా సంతకాలు చేయకపోతే 3 నుంచి నిరవధిక సమ్మె తప్పదంటూ అల్టిమేటమ్ ఇచ్చింది. జూన్ 20 లోగా అవగాహనా ఒప్పందం మీద సంతకం చేస్తామన్న నిర్మాతలు మాట తప్పారని సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఆరోపించారు.

అయితే, టీవీ నిర్మాతల వివరణ మరోలా ఉంది. వేతనాల పెంపు జరిగిందని, ఒప్పందంలోని కొన్ని అంశాలు కాంపిటిషన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో సంతకాలు చేయటంలో ఆలస్యం జరిగిందని అంటున్నారు. దీని పరిష్కారానికి తాము సుముఖంగానే ఉన్నప్పటికీ సమాఖ్య సభ్యులు ఆసక్తి చూపటం లేదని ఆరోపించారు.

మధ్యవర్తిత్వం నెరపటానికి చేసిన ప్రయత్నాలు సైతం ఫలించకపోవటంతో ఇరుపక్షాలూ కోర్టుమెట్లెక్కాయి. సమాఖ్య సభ్యులు సమ్మె చేసుకునే హక్కు ఉన్నదంటూనే షూటింగ్ జరిగే ప్రదేశానికి 150 మీటర్ల దూరంలోనే ఉండాలని, షూటింగ్ కి ఎలాంటి అంతరాయమూ కలిగించరాదని బొంబాయి హైకోర్ట్ ఆదేశించింది. ఎలాంటి గొడవలూ సృష్టించకూదదని కూడా కోర్టు ఆదేశాలు స్పష్టం చేశాయి. సహాయ నిరాకరణ చేపట్టవచ్చునని, పనిచేయదలచుకున్నవాళ్ళను మాత్రం ఆపకూడదని పేర్కొంది.