• Home »
  • Cable »
  • డిజిటైజేషన్ లో రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉండాలి: రూప్ శర్మ

డిజిటైజేషన్ లో రాష్ట్ర ప్రభుత్వాల ప్రమేయం ఉండాలి: రూప్ శర్మ

దేశమంతటా సమర్థమైన బ్రాడ్ బాండ్ నెట్ వర్క్ ఉండాలన్నది భారత ప్రభుత్వ ఉద్దేశ్యం. అయితే ఇప్పటికే ఇంటింటినీ కలిపే కేబుల్ నెట్ వర్క్ ద్వారా మాత్రమే అది సాధ్యమన్న విషయం ప్రభుత్వం ముందుగా గుర్తించాలి. ఊరూరూ తీసుకెళ్ళటం వరకు ప్రభుత్వానికి సాధ్యమేమోగాని ఇంటింటికీ కేబుల్ వేయటం ఆషామాషీ వ్యవహారం కాదు. పైగా, ఇప్పటికే అందుబాటులో ఉన్న నెట్ వర్క్ ఉండగా మళ్ళీ నెట్ వర్క్ వేసుకోవటం కూడా అనవసరం. అందుకే కేబుల్ ఆపరేటర్ల సాయంతో బ్రాడ్ బాండ్ నెట్ వర్క్ ను బలోపేతం చేసుకోవటం చాలా సులభం. ఆ విధంగా డిజితల్ ఇండియా కలలు సాకారమవుతాయి.

అయితే, వాస్తవంలో మాత్రం ఇందుకు భిన్నంగా సాగుతోంది. ఇంటింటికీ ఇంటర్నెట్ ఇవ్వాలన్న ఆలోచనకు బదులు ప్రభుత్వం బ్రాడ్ కాస్టర్లకు సాయపడుతూ వారి చానల్స్ ను ఇంటింటికీ చేర్చటం మీద దృష్టిపెడుతంది. దీనివలన పెద్ద పెద్ద మీడియా సంస్థలు లాభపడతాయే తప్ప అసలు ప్రయోజనం నెరవేరదు. పైగా, ఆ కంపెనీలు మరింత గుత్తాధిపత్య ధోరణులు ప్రదర్శించటానికి అవకాశం కల్పించినట్టవుతుంది.

డైరెక్ట్ టు హోమ్ (డిటిహెచ్) అనేది కేవలం వన్ వే వైర్లెస్ సర్వీస్ మాత్రమే కాబట్టి బ్రాడ్ బాండ్ ఇవ్వటానికి ఎలాగూ పనికిరాదు. పైగా, ట్రాన్స్ పాండర్ల కొరత, అధిక ధర కారణంగా కేబుల్ టీవీ కంటే అది ఎప్పటికీ ఖరీదైన వ్యవస్థగానే ఉండిపోతుంది. సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నివేదికల ప్రకారం మూడో దశ డిజిటైజేషన్ జరగాల్సిన 3 కోట్ల 35 లక్షల ఇళ్లలో 76% సెట్ టాప్ బాక్సుల అమరిక పూర్తయింది. ఇదంతా కేవలం 242 మంది ఎమ్మెస్వోలకు శాశ్వత లైసెన్సులు ఉండగానే జరిగింది. కేవలం ఆఖరి ఐదు నెలలకాలంలోనే మంత్రిత్వశాఖ 400 కు పైగా తాత్కాలైక లైసెన్సులు మంజూరు చేసింది. జనవరిలో మరో 66 తాత్కాలిక లైసెన్సులివ్వటంతో జనవరి ఆఖరికల్లా ఇది 468 కి చేరింది. అయితే, ఇది ఆ తాత్కాలిక లైసెన్స్ పొందినవాళ్ళందరికీ చాలా రిస్క్ తో కూడిన వ్యాపారం. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టిన తరువాత హోం శాఖ నుంచి సెక్యూరిటీ క్లియరెన్స్ రాలేదంటూ వాళ్ళ రిజిస్ట్రేషన్ రద్దయితే పరిస్థితి ఏంటన్నది అయోమయమే.

ఈ ఎమ్మెస్వోల అతిపెద్ద సమస్య సెట్ టాప్ బాక్సులు సమకూర్చుకోవటం. ఇవి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి చాలా సమయం పడుతుంది.  తాత్కాలిక లైసెన్సులున్న ఎమ్మెస్వోలకు విదేశీ కంపెనీలు అప్పివ్వవు.  పైగా డిటిహెచ్ కంపెనీలకు నిధుల కొరతంటూ ఉండదు కాబట్టి అవి పెద్ద ఎత్తున  లక్షలాది సెట్ టాప్ బాక్సులకు ఆర్డర్లివ్వగలిగాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా రిజిస్టర్ చేసుకున్న ఎమ్మెస్వోలు క్యూలో బాగా వెనుకబడ్డారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెస్వోలు అనేక రాష్టాలలో హైకోర్టులనాశ్రయించి డిజిటైజేషన్ గడువు పెంచుకునేందుకు ప్రయత్నించటం, కోర్టులు సానుకూలంగా స్పందించటం చూశాం. మొత్తం 14 రాష్ట్రాలలో అనలాగ్ ప్రసారాలు కొనసాగటానికి కోర్టులు అనుమతించాయి. మరికొందరు ముఖ్యమంత్రులు ఆరు నెలలపాటు మూడోదశ గడువు పొడిగించాలని కోరుతూ  సమాచార, ప్రసార శాఖామంత్రికి లేఖలు రాయటం కూడా చూశాం.  ఈ కేసులన్నిటినీ ఒకేచోట చేర్చి విచారించాల్సిందిగా మంత్రిత్వశాఖ ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించటం సంగతి తెలిసిందే. పరిస్థితి ఇలాగే కొనసాగే పక్షంలో డిజిటైజేషన్ మొత్తం కోర్టుకేసులతోనే సరిపోయేలా కనిపిస్తోంది.

రాష్ట్రాల ప్రమేయం

చిట్టచివరిగా కేబుల్ టెలివిజన్ లైన్ 12 కోట్ల ఇళ్లను అనుసంధానం చేస్తుంది. అంటే 70 కోట్లమందిని చేరుతుంది. ఈ లైన్లన్నీ బ్రాడ్ బాండ్ ను మోసుకెళ్లగలుగుతాయి. వేలాది మంది ఆపరేటర్ల చేతిలో ఈ కేబుల్ లైన్లున్నాయి. అందుకే ప్రభుత్వం ఈ సౌకర్యాలను ఉపయోగించుకొని వీలైనంత ఎక్కువ ప్రయోజనం పొందగలిగేట్టు చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో డిటిహెచ్ కారణంగా కేబుల్ ఆపరేటర్లు తమ చందాదారులను కోల్పోతున్నారు.  ఆ విధంగా ఆదాయం కోల్పోవలసిన పరిస్థితులు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బ్రాడ్ బాండ్ వ్యాపారానికి ఆపరేటర్లను వాడుకోవటం ద్వారా వాళ్ళను ఆదుకోవచ్చు. అలాంటి హామీ దొరికితే నెట్ వర్క్ లను అప్ గ్రేడ్ చేసుకుంటారు. కేంద్రప్రభుత్వం తలపెట్టిన భారత్ నెట్ పథకంలో కేబుల్ ఆపరేటర్లను భాగస్వాములు చేస్తే, ఆదాయం వస్తుంది.

ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం ప్రకారం ఆపరేటర్లు లాభపడబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆప్టిక్ ఫైబర్ లైన్లు వేస్తూ  ఎమ్మెస్వో దగ్గరికి ఇంటర్నెట్ పంపిణీ అందించే వ్యవస్థ ద్వారా అపరేటర్ కూడా లబ్ధి పొందుతున్నాడు. మరో వైపు రాష్ట్రప్రభుత్వాలు ఈ గవర్నెన్స్ అమలుచేయటానికి కూడా ఇది ఉపయోగ పడుతుంది. ఇంటర్నెట్ తోబాటు చౌకధరలకే వినోదం, టెలిఫోన్ అందుబాటులోకి వస్తాయి. అందరికీ ఆదాయమార్గంగా ఇది ఉపయోగపడుతుంది. ప్రభుత్వం మూడో దశ డిజిటైజేషన్ ముగిసిందంటూ అనలాగ్ సిగ్నల్స్ నిలిపివేయటంతో ఆపరేటర్లు నానా ఇబ్బందులు పడుతునారు.

ప్రభుత్వం తన విధానం అమలు కావాలని కాగితాల మీద రాసుకుంటూ ఉన్నదే తప్ప దానిమీద విమర్శలను మాత్రం స్వీకరించటానికి మాత్రం సిద్ధంగా లేకపోవటం దురదృష్టకరం. అందుకు సిసలైన ఉదాహరణ రెండో టాస్క్ ఫోర్స్ నుంచి కేబుల్ ఆపరేటర్లను తరిమేయటమే. వాళ్ళ స్థానంలో ప్రభుత్వానికి గంగిరెద్దుల్లా తలూపే వాళ్ళే కావాల్సి వచ్చారు. 130 కోట్లమందిని ప్రభావితం చేసే ఈ అంశం మీద ఏ న్యూస్ చానల్ అయినా ప్రచార కార్యక్రమం లాంటిది ప్రసారం చేసిందా అంటే వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు. ఎక్కడ డిజిటైజేషన్ లెక్కలు తక్కువగా ఉంటే అక్కడ డిటిహెచ్ లెక్కలు జోడించి ప్రభుత్వం భుజాలు చరుచుకోవటం మొదలుపెట్టింది. ఎక్కడ డిజిటైజేషన్ తక్కువగా ఉంటే అక్కడి పట్టణాలను తరువాత దశకు మార్చేసి ప్రస్తుత దశ బాగా జరుగుతున్నట్టు చెప్పుకోవటానికి ప్రయత్నించింది. మూడో దశ పట్టణాల జాబితాను ఇప్పటివరకూ ఐదు సార్లు సవరించింది. విచిత్రమేంటంటే మూడో దశ గడువు ముగిసిన తరువాత కూడా ఈ సవరణ సాగింది.

కర్నాటకలో ఇళ్ళ సంఖ్య ఐదో దశ సవరణలో మారిపోయింది. సవరించిన జాబితా ప్రకారం చూస్తే మొత్తం కర్నాటకలో టీవీ ఉన్న ఇళ్ల సంఖ్య దాదాపు లక్షా డెబ్బై వేలు తగ్గిపోయి ఇరవై లక్షల ముప్పై వేలకు చేరాయి.  అసలు జాబితా ప్రకారమైతే మూడో దశలో డిజిటైజేషన్ జరగాల్సిన టీవీ ఇళ్ల సంఖ్య దాదాపు 22 లక్షలు. దాదాపు మొత్తం 30 జిల్లాలోని పట్టణ ప్రాంతాలనూ తొలగిస్తూ వచ్చారు. కర్నాటక రాష్ట ప్రభుత్వం నుంచి అభిప్రాయాలు వచ్చిన తరువాత ఈ సవరించిన జాబితా ప్రచురించామని మంత్రిత్వశాఖ చెప్పుకుంది. మొత్తంగా చూస్తే మూడోదశలోని 3 కోట్ల 80 లక్షల టీవీ ఇళ్ళు కాస్తా మూడు కోట్ల 20 లక్షలకు తగ్గిపోయాయి.

కేంద్రప్రభుత్వం రాష్ట్రాలను భాగస్వాములను చేసి, దశలవారీ అమలు చేసే బాధ్యతను రాష్ట్రప్రభుత్వాలకే అప్పగించి ఉంటే మరింత వాస్తవిక ధోరణిలో ఈ ప్రక్రియ పూర్తయి ఉండేది.  ఎందుకంటే జనాభా విస్తరణ గురించి, ప్రజల ఆర్థిక స్థితిగతులగురించి, ప్రస్తుతం అందుబాటులో ఉన్న మౌలిక వసతులగురించి ఆయా రాష్ట్రప్రభుత్వాలకే ఎక్కువగా తెలిసే అవకాశముంటుంది. నిజానికి రాష్ట్రాలలోని నోడల్ అధికారులు కేంద్రానికి నివేదించటం కంటే జిల్లా కలెక్టర్లే ఈ ప్రక్రియను సమర్థంగా నియంత్రించగలిగి ఉండేవారు.  గడిచిన నాలుగేళ్లలో డిజిటైజేషన్ పురోగతిని గమనిస్తే నోడల్ అధికారులు పెద్దగా చేసిందేమీ లేదని సులభంగానే అర్థమవుతుంది.

మరో ప్రధానమైన లోపం  ప్రజల భాగస్వామ్యం లేకపోవటం. టీవీ ద్వారా, రేడియో ద్వారా ప్రచారం చేస్తున్నామని సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ చెప్పుకుంటున్నప్పటికీ 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఆ ప్రచారం ఏమంత ప్రభావాన్ని చూపలేకపోయిందన్నది నిజం.  పైగా, ఈ ప్రచారమన్నది ప్రభుత్వ యంత్రాంగం ద్వారా జరిగి ఉండాల్సింది. రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ఉండి ఉంటే ఈ మొత్తం ప్రక్రియమీద ఎప్పటికప్పుడు ఫీడ్ బాక్ తీసుకోవటం సులభమయ్యేది. మిగిలిన ప్రభుత్వ పథకాల తరహాలోనే దీన్నీ అమలుచేయగలిగి ఉండేవారు.  కేంద్రం నుంచి ఎలాంటి నిధులూ రానప్పుడు సమాచారశాఖ మాత్రం ప్రచారం గురించి ఎలా ఆలోచించగలదనే ప్రశ్న తలెత్తటమూ సహజమే.

( మూలం: కేబుల్ క్వెస్ట్ మాస పత్రికలో భారత కేబుల్ ఆపరేటర్ల సమాఖ్య అధ్యక్షురాలు రూప్ శర్మ రాసిన వ్యాసం)