కలర్స్ ఇన్ఫినిటీ 31న ప్రారంభం

ఇంగ్లీష్ ఎంటర్టైన్మెంట్ రంగానికి సరికొత్త నిర్వచనమిస్తుందని చెబుతున్న వయాకామ్ 18 వారి కలర్స్ ఇన్ఫినిటీ ఈ నెల 31 న లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. ప్రసారాల శాంపిల్ ని పరిచయం చేసే ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా టాటా స్కై లో మాత్రమే 27 నుంచి ప్రసారం చేసి చూస్తున్నారు. ఇందులో ఎస్ డి, హెచ్ డి వెర్షన్లు రెండూ ఉన్నాయి. చానల్ ప్రచార కర్తలుగా కరణ్ జోహార్, అలియాభట్ ఇప్పటికే రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.

గతంలో ప్రీమియర్ చానల్ అనగానే కేవలం మెట్రో నగరాలకు పరిమితమనే అభిప్రాయం ఉండగా ఇప్పుడు ఆ అభిప్రాయాన్ని తిరగరాస్తూ మొత్తం 25 నగరాలకు విస్తరించాలని వయాకామ్ 18 నిర్ణయించింది. టీవీ రేటింగ్స్ సంస్థ బార్క్ ప్రేక్షకాదరణను లెక్కబెట్టటం మొదలయ్యాక సహజంగానే విస్తరణకు అవకాశం ఏర్పడిందని సంస్థ అభిప్రాయపడింది.