• Home »
  • Content Code »
  • టీవీ చానల్స్ లో అసభ్యత మీద తగ్గి, హానికర దృశ్యాలమీద పెరిగిన అభ్యంతరాలు

టీవీ చానల్స్ లో అసభ్యత మీద తగ్గి, హానికర దృశ్యాలమీద పెరిగిన అభ్యంతరాలు

దేశవ్యాప్తంగా జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో అసభ్యకరమైన దృశ్యాల ప్రసారం బాగా తగ్గిపోయిందని బ్రాడ్ కాస్ట్ కంటెంట్ కంప్లెయింట్ కౌన్సిల్ ( బిసిసిసి) ప్రకటించుకుంది. చానల్ యాజమాన్యాలు ఏర్పాటు చేసుకున్న ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్ ( ఐబిఎఫ్ ) ఆధ్వర్యంలో స్వీయ నియంత్రణ కోసం ఏర్పాటు చేసుకున్న ఈ సంస్థ తాజా బులిటెన్ లో ఈ మేరకు వెల్లడించింది. ఐబిఎఫ్ సభ్యత్వం ఉన్న చానల్స్ అన్నీ ప్రేక్షకులు ఫిర్యాదుచేయాల్సిన బిసిసిసి వివరాలతో స్క్రోల్ నడపటం వలన ప్రేక్షకులలో చైతన్యం పెరిగిందని, అదే సమయంలో చానల్స్ స్వీయ నియంత్రణ పాటించటం వలన ఫిర్యాదులకు అవకాశం కూడా బాగా తగ్గిపోయినట్టు ప్రకటించుకుంది.

2012 జులై3 నుంచి 2015 ఆగస్టు 22 వరకు వచ్చిన ఫిర్యాదులు, వాటిమీద తీసుకున్న చర్యలతో బిసిసిసి ఇటీవల జరిగిన 50 వ సమావేశంలో ఒక నివేదిక అందించింది. కొన్ని సందర్భాలలో అందరికీ వర్తించేలా ఇచ్చిన సలహాపూర్వకమైన ఆదేశాలను కూడా సమావేశం సమీక్షించింది. 4,545 ఫిర్యాదులు రాగా, అందులో ప్రధానంగా హానికరమైన, చెడు ప్రభావం చూపే దృశ్యాలమీదనే 39% ఫిర్యాదులున్నాయి. అంటే, అంగవైకల్యాన్ని అపహాస్యం చేయటం, బాల్యవివాహాలను, మహిళలను తక్కువచేసి చూపటం, జంతువుల పట్ల క్రూరంగా వ్యవహరించటం, ప్రజలమనోభావాలను దెబ్బతీసే అంశాల ప్రసారం లాంటివి అందులో ఉన్నాయి.
బిసిసిసి ఫిర్యాదులు

ఆ తరువాత మతపరమైన అంశాలకు సంబంధించి సున్నితత్వం లోపించిందంటూ 28 శాతం ఫిర్యాదులు వచ్చాయి. ముఖ్యంగా పురాణ గాథలమీద తీసే సీరియల్స్ మీద ఎక్కువగా అభ్యంతరాలు వెల్లువెత్తాయి. అయితే, 2012 జనవరిలో అందజేసిన నివేదికకు, ఇప్పటికీ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉందని బిసిసిసి పేర్కొంది. అప్పట్లో 47% ఫిర్యాదులు అసభ్యకర దృశ్యాలు, నగ్నత్వం, సెక్స్ తదితర అంశాలకు సంబంధించినవే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన మార్పు వలన చానల్స్ జాగ్రత్త పడుతూ స్వీయనియంత్రణ పాటిస్తున్నాయనటానికి బిసిసిసి దీన్ని నిదర్శనంగా చూపుతోంది. ఇప్పుడు అసభ్యకర దృశ్యాల మీద ఫిర్యాదులు 8శాతానికి తగ్గిపోయాయి.

నేరాలు, ఘోరాలు, హింస, దురాచారాలు, మూఢనమ్మకాలకు సంబంధించిన అంశాలమీద 22 శాతం ఫిర్యాదులున్నాయి. అయితే, ఇవి కూడా కేవలం క్రైం షో లకే పరిమితం కాలేదు. సీరియల్స్ లో సైతం ఇలాంటి దృశ్యాలుండటం మీద ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఫిర్యాదులలో నేరుగా ప్రేక్షకులనుంచి వచ్చినవాటికంటే సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ నుంచి వచ్చినవే ఎక్కువగా ఉన్నట్టు బిసిసిసి ఒప్పుకుంది. అయితే, హింస, నేరప్రవృత్తిని పెంచటం లాంటి అంశాలమీద ఫిర్యాదులలో ఎక్కువగా ఇంగ్లీష్ చానల్స్ మీదనే ఉండటం విశేషం.