• Home »
  • Cable/DTH/HITS »
  • అనలాగ్ కొనసాగటమే హిట్స్ కు శాపం : టోనీ డి సిల్వా

అనలాగ్ కొనసాగటమే హిట్స్ కు శాపం : టోనీ డి సిల్వా

హిందుజా వారి హిట్స్ వేదిక ఆశించినంత వేగంగా ముందుకు సాగటంలో అనలాగ్ ప్రసారాలే ఇబ్బందికరంగా మారాయని ఆ సంస్థ సీఈవో టోనీ డి సిల్వా స్వయంగా ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఇంటింటికీ దాదాపు 800 చానల్స్ వరకూ ఇవ్వగలమనే ధీమాతో ప్రారంభించి మూడో దశలోనూ చెప్పుకోదగినన్ని కనెక్షన్లు రాబట్టుకున్న నెక్స్ట్ డిజిటల్ ఆ తరువాత నిదానించింది.

మూడో దశ ముగింపు తేదీ వ్యవహారం కోర్టుకేసుల్లో చిక్కుకుపోయి ఇప్పటికే ఎనిమిది నెలలు పూర్తి కాగా నాలుగో దశ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఇలాంటి పరిస్థితిలో  హిట్స్  నుంచి ప్రసారాలు అందుకోవటానికి చిన్న ఎమ్మెస్వోలు, ఆపరేటర్లు ముందుకు రావటం లేదు. ఇంకా చాలా సమయమున్నదనే ధీమా ఒకవైపు, అనలాగ్ ప్రసారాలు చౌకగా అందుతూ ఉండటం మరోవైపు ఈ సమస్యకు కారణమవుతున్నాయి.

నెక్స్ట్ డిజిటల్ బ్రాడ్ కాస్టర్లతో ఒప్పందాలు చేసుకోవాలంటే కచ్చితంగా డిజిటల్ ధరలకే చేసుకోవాలి. కానీ అదే సమయంలొ దాదాపు సగం ధరక్లే అనలాగ్ ప్రసారాలు అందుతున్నాయి. అవకాశం ఉన్నంత వరకూ అవే ప్రసారాలు అందుకోవచ్చుననే ఆలోచనతో ఉన్న ఎమ్మెస్వోలు ఇటువైపు మొగ్గు చూపటం లేదు. దీనివలన సమస్యలు ఎదురవుతున్నాయని, వ్యాపారం దాదాపుగా స్తంభించిందని అంటున్నారు. ఒప్పందాలు చేసుకున్న వారు సైతం సెట్ టాప్ బాక్సులు తీసుకోవటంలో జాప్యం చేయటం పట్ల టోనీ డిస్ ఇల్వా నిర్వేదంతో ఉన్నారు.

నాణ్యతపరంగా డిజిటల్ ప్రసారాలు చాలా బాగున్నప్పటికీ ఎమ్మెస్వోలు అనలాగ్ ఫీడ్ అవకాశాన్ని వదులుకోవటానికి సిద్ధంగా లేకపోవటంతో నెక్స్ట్ డిజిటల్ ముందడుగు వేయలేకపోతోంది.  ఈ సమస్యను బ్రాడ్ కాస్టర్లు అర్థం చేసుకుంటే తప్ప పరిస్థితిని చక్కదిద్దుకోవటం సాధ్యం కాదంటున్నారు డి సిల్వా. మొదటి రెండు దశల్లో ప్రత్యేకమైన డిజిటల్ ధరలు వసూలు చేయని బ్రాడ్ కాస్టర్లు పూర్తిగా డిజిటల్ రూపంలో వచ్చిన తమ మీద మాత్రం తొలిరోజునుంచీ డిజిటల్ రేట్లు మోపటం అన్యాయమంటున్నారు.

కొంతమందికి అనలాగ్ ధరలు ఇవ్వజూపుతున్నంతకాలం తనకూ అనలాగ్ రేట్లే ఇవ్వాలని బ్రాడ్ కాస్టర్లకు టోనీ విజ్ఞప్తిచేస్తున్నారు. తమది కొత్త తరహా వ్యాపారమని, ఆరంభం నుంచే డిజిటల్ తో వస్తున్నందున ప్రోత్సహించాలని కొరుతున్నారు. చాలా మారుమూల ప్రాంతాలకు సైతం వెళ్ళగలగటం తమ ప్రత్యేకతగా చెప్పుకుంటున్నారు. అనలాగ్ ఆగిపోయేదాకా అనలాగ్ ధరలు ఇస్తే ఆ వెంటనే పూర్తిస్థాయిలో డిజిటల్ ధరలు చెల్లించటానికి సిద్ధమని చెప్పారు. పే టీవీ యజమానులకు నమ్మకమైన నేస్తం హిట్స్ మాత్రమేనని, చెల్లింపులు సాఫీగా జరుగుతాయని హామీ ఇచ్చారు.

ఇలా ఉండగా హిందుజా వారి పంపిణీ సంస్థ ఐ ఎం సి ఎల్ కూడా నెక్స్ట్ డిజిటల్ లో విలీనం చెందుతోంది. ఈ విషయం మంత్రిత్వశాఖకు కూడా లంచనంగా తెలియజేసింది. హైకోర్టుకు కూడా తన ఆలోచనను తెలియజేసింది. ఇది ఏ విధంగా నెక్స్ట్ డిజిటల్ కు ఉపయోగపడబోతున్నదో ముందు ముందు తెలుస్తుంది.