• Home »
  • Entertainment »
  • 1 నుంచి డిస్కవరీ తమిళ్ లో దగ్గుబాటి రానా

1 నుంచి డిస్కవరీ తమిళ్ లో దగ్గుబాటి రానా

మార్చి 1 నుంచి డిస్కవరీ తమిళ్ చానల్ లో రాత్రి 10 నుంచి 11 గంటలవరకు ప్రసారమయ్యే ప్రత్యేక కార్యక్రమం ’ డిస్కవరీ రియల్ హీరోస్ ’ ను టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా సమర్పించబోతున్నాడు. ప్రపంచంలో అత్యంత దారుణమైన, ప్రతికూలమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటూ బతికి బయటపడే ఘట్టాలకు అలవాటు పడిన బేర్ గ్రిల్స్, లెస్ స్ట్రౌడ్, ఎడ్ స్టాఫర్డ్, జోయెల్ లాంబర్ట్ లాంటి వారు తమ నైపుణ్యాలను, వాటి వెనుక చిట్కాలను పరిచయం చేసే కార్యక్రమంలో రానా ప్రత్యేక ఆకర్షణగా మారబోతున్నట్టు డిస్కవరీ నెట్ వర్క్ దక్షిణాసియా విభాగం అధిపతి రాహుల్ జోహ్రి చెప్పారు.

ప్రేక్షకులు ఊపిరిబిగబట్టి చూసేట్టు సాగే ఈ కార్యక్రమంలో డ్యుయల్ సర్వైవల్ లాంటి విభాగాలలో జో టేటి, మట్ గ్రాహమ్ లాంటి నిపుణులు అసాధారణమైన పద్ధతులలో ప్రాణాలు కాపాడుకోవటం చూడవచ్చు. తమకు తాముగా చిక్కుబడ్డ యాత్రికుల్లా ఎలా అక్కడి వాతావరణానికి తట్టుకుంటూ సాయం కోసం ప్రయత్నించాలో, ఎలా ప్రాణాలతో  బయటపడాలో ఈ నిపుణులు చూపిస్తారు. వీరందరినీ దగ్గుబాటి రానా పరిచయం చేస్తారు. బాహుబలి లాంటి బహుభాషా చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకులకు సైతం బాగా దగ్గరైన రానాను ఈ కార్యక్రమ సమర్పణ కోసం డిస్కవరీ తమిళ్ ఎంచుకుంది.