• Home »
  • BARC »
  • డిడి కిసాన్ పనితీరుమీద సర్వే: ’ బార్క్’ డేటా లోనూ సానుకూల ఫలితాలు

డిడి కిసాన్ పనితీరుమీద సర్వే: ’ బార్క్’ డేటా లోనూ సానుకూల ఫలితాలు

కిసాన్ టీవీ పనితీరును అంచనా వేయటానికి దూరదర్శన్ ఒక సర్వే చేస్తోంది. చానల్ ప్రసారం చేసిన కార్యక్రమాల మీద రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటోంది. ఇప్పటివరకు సేకరించిన సమాచారం ప్రకారం రైతులనుంచి సానుకూలమైన స్పందన వచ్చినట్టు సమాచార, ప్రసారశాఖ సహాయమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ లోక్ సభకు తెలియజేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రేక్షకాదరణను లెక్కిస్తున్న బ్రాడ్ కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్ (బార్క్) సేకరించిన దత్తాంశం సైతం వారంలో కోటీ 68 లక్షలమందిని చేరుతున్నట్టు చెప్పటాన్ని ఆయన ప్రస్తావించారు.

ఇటీవలి బడ్జెట్ లో కేంద్రం ఈ చానల్ కోసం ప్రణాళికా వ్యయం కింద రూ.52 కోట్లు కేటాయించటం తెలిసిందే. వ్యవసాయ పరిశోధనాసంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల సహకారంతో కొన్ని కార్యక్రమాలు రూపొందిస్తుండగా మరికొన్ని ఇంటరాక్టివ్ కార్యక్రమాలను చానల్ స్వయంగా నిర్మిస్తోంది. వ్యవసాయదారులకోసం నిర్దేశించిన వివిధ ప్రభుత్వ పథకాలు, వాటి పనితీరు మీద కొన్ని కార్యక్రమాలుండగా సమాచారానికి కొంత వినోదం జోడించి కూడా అనేక కార్యక్రమాలు రూపొందిస్తున్నారు.  వీటి ద్వారా చానల్ పట్ల ఆసక్తి పెరిగేలా చూస్తున్నారు.