• Home »
  • Entertainment »
  • డిడి స్లాట్స్ వేలానికి చుక్కెదురు: బాలాజీ సహా టెండర్ వేసిన 3 సంస్థలూ అనర్హమే

డిడి స్లాట్స్ వేలానికి చుక్కెదురు: బాలాజీ సహా టెండర్ వేసిన 3 సంస్థలూ అనర్హమే

 

దూరదర్శన్ లో ప్రైమ్ టైమ్ స్లాట్స్ ప్రైవేటు నిర్మాణ సంస్థలకు వేలం పద్ధతిలో పారదర్శకంగా అమ్మాలనుకున్న ప్రసారభారతికి చుక్కెదురైంది. టెండర్ దాఖలు చేసిన మూడు సంస్థలకూ అర్హత చాలకపోవటంతో ఈ పరిస్థితి తప్పలేదు. నిజానికి ఇలా ప్రయత్నించటం ఇది రెండో సారి.  ప్రసారభారతి కోరిన విధంగా అన్ని పత్రాలు లేకపోయినా సరే వేలం దరఖాస్తు పంపిన బాలాజీ టెలీఫిల్మ్స్, కీ లైట్ ప్రొడక్షన్స్, బాగ్ ఫిల్మ్స్ అండ్ మీడియా అనర్హమైనవిగా తేలాయని డిడి డైరెక్టర్ జనరల్ సుప్రియాసాహు వెల్లడించారు.

మరి ఈ పరిస్థితుల్లో డిడి ఏం చేస్తుంది? స్లాట్స్ అమ్మకం ఆలోచననే విరమించుకుంటుందా? నిబంధనలు సడలిస్తుందా? అదే విషయం అంతర్గతంగా చర్చిస్తున్నామని సుప్రియా సాహూ చెప్పారు. ఇప్పటివరకూ అమలవుతున్న సెల్ఫ్ ఫైనాన్సింగ్ విధానం తగిన ఫలితాలివ్వటం లేదని గ్రహించిన డిడి ప్రైమ్ టైమ్ స్లాట్స్ ను ప్రైవేట్ నిర్మాణ సంస్థలకు అప్పగిస్తే ప్రేక్షకాదరణ పొందటంతోబాటు ప్రకటనల ఆదాయం కూదా పెరుగుతుందని అంచనావేసింది. అందుకు అనుగుణంగా టెండర్లు పిలిచింది.

మొదట ఏడు నిర్మాణ సంస్థలు ఈ స్లాట్స్ కోసం ఆసక్తి చూపాయి. అయితే, వాటిలో కొన్ని రూ.5 వేల ఫీజు చెల్లించనందుకు, మరికొన్ని గతంలో తాము  డిడి కి బకాయి పడలేదని డిక్లరేషన్ ఇవ్వకపోవటం వల్ల అనర్హమైనవిగా తిరస్కారానికి గురయ్యాయి. ఆ తరువాత డిడి అధికారులు కొన్ని సవరణలలో ఆర్ ఎఫ్ పి రూపొందించారు. అంతకుముందు టీవీ నిర్మాణ సంస్థలకే అర్హత ఉండగా  ఈ సారి సినిమా నిర్మాణ సంస్థలు సైతం పాల్గొనటానికి అవకాశం కల్పించారు.  హిందీ నిర్మాతలే అనే షరతు తొలగిపోయి ప్రాంతీయ భాషా నిర్మాణ సంస్థలకూ అర్హత కల్పించారు.

ఇన్ని రకాలుగా సడలింపులు ఇచ్చినప్పటికీ మూడు సంస్థలు మాత్రమే దరఖాస్తు చేసుకోగా అవి కూడా ఇప్పుడు అనర్హమయ్యాయి. ఈ నేపథ్యంలో అసలు స్లాట్స్ అమ్మే ఆలోచననే విరమించుకోవటమా, నిబంధనలు మరింతగా సడలించటమా అనే విషయంలో డిడి అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇప్పుడు అనర్హమని తేలిన ఈ మూడు సంస్థలూ ఏ విషయంలో అనర్హమయ్యాయనేది మాత్రం ఇంకా వెల్లడి కాలేదు.