• Home »
  • Cable/DTH/HITS »
  • ప్రాంతీయ చానల్స్ కు ఎర వేస్తున్న డిడి ఫ్రీడిష్: రిజర్వ్ ధర రూ. 2 కోట్లు

ప్రాంతీయ చానల్స్ కు ఎర వేస్తున్న డిడి ఫ్రీడిష్: రిజర్వ్ ధర రూ. 2 కోట్లు

దూరదర్శన్ వారి ఉచిత డిటిహెచ్ ప్లాట్ ఫామ్ డిడి ఫ్రీడిష్  ఇప్పుడు కారేజ్ ఫీజు విషయంలో ప్రాంతీయ చానల్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అదనపు చానల్స్ ప్రసారం చేసే సామర్థ్యం పెరుగుతూ ఉండటం వల్ల ప్రాంతీయ చానల్స్ కు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. అందుకే మొట్టమొదటిసారిగా వాటికోసం సగానికి సగం ధర తగ్గించింది.  ఈ నెల 15న ఈ-వేలం జరగాల్సి ఉండగా తాజా ధరలు ప్రకటించింది. జాతీయ స్థాయి చానల్స్ కు రిజర్వ్ ధర రూ. 4 కోట్ల 30 లక్షల రూపాయలుండగా ప్రాంతీయ చానల్స్ కు రూ. 2 కోట్లుగా నిర్ణయించింది.

నిజానికి డిటిహెచ్ లో  ఏ చానల్ కైనా ఒకే రకమైన స్లాట్ ఇవ్వటం సాధ్యమవుతుంది కాబట్టి దేశమంతటా వచ్చే చానల్ అయినా, ఒక ప్రాంతానికే పరిమితమయ్యే చానల్ అయినా ఒకే మొత్తం వసూలు చేయటం పరిపాటి. అయితే, ఎవరికి ఇవ్వాలో తెలియదు కాబట్టి వేలం పద్ధతిలో ఎక్కువ మొత్తం చెల్లించే చానల్ కు స్లాట్ ఇవ్వటం డిడి ఫీడిష్ అనుసరిస్తున్న విధానం.

అందువలన జాతీయ స్థాయి చానల్స్ మాత్రమే ఈ సౌకర్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోగలుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువమంది డిడి ఫ్రీడిష్ పట్ల మొగ్గు చూపుతూ ఉండటం, బార్క్ రేటింగ్స్ కూడా ఇటీవలి కాలంలో గ్రామీణ ప్రాంతాల మీద దృష్టి సారించటం వల్ల డిమాండ్ మరింత పెరిగింది. అయితే, ప్రసార భారతి ఆధ్వర్యంలోని ఈ డిటిహెచ్ వేదిక ప్రాంతీయ చానల్స్ ను కూడా దృష్టిలో పెట్టుకొని అవకాశం కల్పించాలని నిర్ణయించుకుంది.

ప్రస్తుతం డిడి ఫ్రీడిష్ లో 64  చానల్స్ ఉన్నాయి. వాటిలో డిడి చానల్స్ తో బాటు లోక్ సభ, రాజ్యసభ చానల్స్ కూడా ఉన్నాయి. ఈ సామర్థ్యాన్ని వచ్చే నెలాఖరుకల్లా 112 చానల్స్ కు పెంచబోతోంది. రూ. 10 వేలు చెల్లించి దరఖాస్తు చేసుకుని వేలంలో పాల్గొనటంతోబాటు విజయవంతంగా స్లాట్ పొందిన చానల్స్ రిజర్వ్ ధరలో రూ.50 లక్షలు నెలలోగా మొదటివాయిదాకింద చెలించాల్సి ఉంటుంది. రెండో నెలలో రెండో వాయిదా కట్టాలి. మిగిలిన మొత్తాన్ని ఆరు నెలల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రాంతీయ న్యూస్ చానల్స్ కేబుల్ ద్వారా పంపిణీకి సగటున ఐదారు కోట్ల రూపాయలు చెల్లిస్తుండగా డిడి ఫీడిష్ కి 2 కోట్లు చెల్లించటానికి ముందుకు రాకపోవచ్చు. ఉచిత ఎంటర్టైన్మెంట్ చానల్స్ మాత్రమే ఆసక్తి చూపే అవకాశమున్నా, వాటి ఆదాయ పరిమితి దృష్ట్యా స్పందించకపోవచ్చు.