• Home »
  • Cable/DTH/HITS »
  • సెప్టెంబర్ 15న డిడి ఫ్రీడిష్ స్లాట్స్ వేలం : కనీస ధర రూ. 4.3 కోట్లు

సెప్టెంబర్ 15న డిడి ఫ్రీడిష్ స్లాట్స్ వేలం : కనీస ధర రూ. 4.3 కోట్లు

భారతదేశపు ఏకైక ఉచిత డిటిహెచ్ వేదిక అయిన దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్  ఖాళీ స్లాట్స్ వేలం వేస్తోంది. డిడి ఫ్రీడిష్ ద్వారా ప్రేక్షకులను చేరాలనుకునే చానల్ యాజమాన్యాలు సెప్టెంబర్ 15న జరిగే వేలంలో పాల్గొనవచ్చు. నిజానికి యాదృచ్ఛికమే కావచ్చుగాని 1959 లో దూరదర్శన్ ప్రారంభమైన రోజు అది.

వేలంలో పాల్గొనబోయే వారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయమేంటంటే, దీని రిజర్వి ధర రూ. 4 కోట్ల 30 లక్షలు. అంటే, అక్కడి నుంచి వేలం మొదలై ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ప్రస్తుతం 80 స్లాట్స్ లో ఏదైనా ఖాళీ కాగానే ఇలా వేలం వేయటం డిడి ఫ్రీడిష్ కి అలవాటే. అయితే, డిమాండ్ బాగా పెరుగుతున్నందున ఈ సామర్థ్యాన్ని ఇప్పుడున్న 80 నుంచి త్వరలో 104 కి పెంచబోతున్నారు.

గతంలో ఒక చానల్ ఇందులో స్లాట్  కోసం రూ. 5 కోట్ల 30 లక్షలు చెల్లించిన అనుభవం ఉన్నప్పటికీ రిజర్వు ధరను పెంచలేదని డిడి ఫ్రీడిష్ చెప్పుకుంటోంది. నిరుడు చివరి దాకా రిజర్వ్ ధర రూ. 3 కోట్ల 70 లక్షలు మాత్రమే ఉండేది. కానీ ఈ ఏడాది జనవరిలో మరో 60 లక్షలు పెంచారు.

ప్రస్తుతం డిడి ఫ్రీడిష్ లో అన్ని దూరదర్శన్ చానల్స్ తో బాటు లోక్ సభ, రాజ్య సభ చానల్స్, మరో 24 ఆకాశవాణి చానల్స్ నడుస్తున్నాయి. మిగిలినవన్నీ ప్రైవేట్ శాటిలైట్ చానల్స్. ఇలా ఉండగా ఉచితంగా అందిస్తున్నప్పటికీ ఫ్రీడిష్ చందారుల సంఖ్య మీద ఒక కన్నేసి ఉంచటానికి వీలుగా ఇండియన్ కాస్ ( ఐకాస్ ) ద్వారా ఎన్ క్రిప్ట్ చేయాలని ప్రసార భారతి నిర్ణయించింది.