• Home »
  • Other Channels »
  • ప్రేక్షకాదరణ పెరిగి, లాభాల బాటలో డిడి కిసాన్

ప్రేక్షకాదరణ పెరిగి, లాభాల బాటలో డిడి కిసాన్

దూరదర్శన్ ఆధ్వర్యంలో రేయింబవళ్ళూ నడిచేలా ఏర్పాటైన కిసాన్ చానల్ కు ప్రేక్షకాదరణ గణనీయంగా పెరుతూ ఉంది. టామ్ అందించిన సమాచారం ఈ విషయాన్ని ధ్రువపరుస్తోంది. గత మే 26 న మొదలైన చానల్ కేవలం నెలరోజుల్లోనే ఇంత ఆదరణ పొందటం దూరదర్శన్ అధికారులనే ఆశ్చర్యపరుస్తోంది. దీనికోసం పెట్టిన పెటుబడికి అనేక రెట్లు సంపాదించి వాణిజ్యపరంగా కూదా ఘన విజయం సాధించగలదని ఇప్పుడు అంచనా వేస్తున్నారు.

అయితే, ఈ విజయాన్ని ఆసరాగా చేసుకొని ప్రైవేట్ చానల్స్ సైతం ఈ రంగంలో అడుగుపెట్టే అవకాశాలు కనబడుతున్నాయని ఈ చానల్ లో పనిచేస్తున్న ఒక ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. లక్షిత ప్రేక్షకులు కేవలం రైతులే కాకపోవటం, గ్రామీణ చేతివృత్తికళాకారులను, చిన్న వ్యాపారులను కూడా పరిగణనలోకి తీసుకోవటం వల్లనే ఆదరణ విశేషంగ పెరిగినట్టు భావిస్తున్నారు. దూరదర్శన్ ఆధ్వర్యంలో నడిచే మొత్తం 24 చానల్స్ లో డిడి నేషనల్ తరువాత స్థానం దీనికే దక్కటం విశేషం.

టామ్ అందించిన సమాచారం ప్రకారం మొదటి వారంలో ఆ చానల్ చూసినవాళ్ల సంఖ్య 6,85,000 ఉండగా, నాలుగో వారానికల్లా అది 50 లక్షలకు మించిపోయింది. 14 కోట్ల మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నదేశంలో ఈ సంఖ్య చిన్నదే అయినా ఇది శుభారంభమని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పైగా, హలో కిసాన్ లాంటి ప్రత్యక్ష ప్రసార సమయంలో దేశం నలుమూలలనుంచీ వస్తున్న ఫోన్ కాల్స్ కూడా చానల్ పట్ల పెరుగుతున్న ఆదరణకు నిదర్శనంగా చెబుతున్నారు.

మండీ ఖబర్ పేరుతో చేఒపట్టిన కార్యక్రమంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు తెలియజేయటం ద్వారా రైతులు మార్కెట్ కు నేరుగా వెళ్ళకుండానే ధరలు తెలుసుకొని వెళ్ళాలా వద్దా అనేది నిర్ణయించుకోగలుగుతున్నారని డిడి కిసాన్ చెబుతోంది. ఏ రేటుకు ఏ మార్కెట్ కు తీసుకువెళ్ళటం లాభదాయకమో నిర్ణయించుకోవటం రైతులకు బాగా లాభిస్తున్నట్టు అంచనా వేశారు.

వాతావరణ సమాచారం చెప్పే మౌసమ్ ఖబర్, విచార్ విమర్శ్ వాద్ సంవాద్ లాంటి చర్చా కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాలను గ్రామీణ పేదలకు తెలియజెప్పే చౌపల్ చర్చా ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నట్టు డిడి కిసాన్ అధ్యయనం తేల్చింది. మొత్తంగా చూస్తే ఇది రైతులకోసం ఒక సైన్స్ చానల్ లా ఉందని, ఆదాయం కూదా సమకూర్చి పెట్టగలిగే స్థాయికి ఎదుగుతోందని అంటున్నారు. ఏటా రూ.200 కోట్ల నుంచి 250 కోట్ల వరకూ సంపాదించే అవకాశముందని కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు, ఈ చానల్ కి ప్రభుత్వ సలహాదారు అయిన నరేశ్ సిరోహి విశ్లేషిస్తున్నారు.