• Home »
  • Uncategorized »
  • డిడి నేషనల్ లో నాన్-ప్రైమ్ టైమ్ స్లాట్స్ అమ్మకం!

డిడి నేషనల్ లో నాన్-ప్రైమ్ టైమ్ స్లాట్స్ అమ్మకం!

రెండు సార్లు వాయిదా వేసి ఎట్టకేలకు రెండు ప్రైవేట్ నిర్మాణ సంస్థలకు ప్రైమ్ టైమ్ స్లాట్స్ వేలంలో కేటాయించిన డిడి నేషనల్ ఇప్పుడు నాన్ ప్రైమ్ టైమ్ స్లాట్స్ కూడా వేలం వేయాలని నిర్ణయించుకుంది. వివిధ తరహా కార్యక్రమాల రూపకర్తలు స్పాన్సర్డ్ కార్యక్రమాల విభాగంలో ప్రతిపాదనలు పంపుకోవచ్చునంటూ నాన్- ప్రైమ్ టైమ్ స్లాట్స్ ఇవ్వజూపుతూ ప్రకటన జారీచేసింది.

ఈమధ్యనే ప్రైమ్ టైమ్ స్లాట్స్ ను బాలాజీ టెలిఫిల్మ్స్, సాయి బాబా టెలిఫిల్మ్స్ సంస్థలు దక్కించుకున్న సంగతి తెలిసిందే. మొత్తం 34  వారాల సాధారణ దినాల స్లాట్స్, మూడు వారాంతపు స్లాట్స్ వేలానికి పెట్టగా ఈ రెండు సంస్థలూ కలిపి 19 వారాల సాధారణ దినాల స్లాట్స్, రెండు వారాంతపు స్లాట్స్ పొందగలిగాయి. ఆ విధంగా 15 వారాల సాధారణ దినాల స్లాట్స్, ఒక వారాంతపు స్లాట్ అలాగే మిగిలిపోయాయి.

ఇప్పుడు ప్రతిపాదించిన నాన్ ప్రైమ్ టైమ్  స్పాన్సర్డ్ విభాగం కింద అభ్యర్థనలు పంపుకునేవారు ప్రాసెసింగ్ ఫీజుతోబాటు ఒక పైలెట్ ఎపిసోడ్ ను హెచ్ డి ఫార్మాట్ లో 20217 జనవరి 20 లోగా పంపాల్సి ఉంటుంది. ఆ ఖర్చు తానే భరించాలి. తమ ప్రతిపాదనలో  స్థూలంగా కథాంశం, ఎపిసోడ్స్ గా విభజించిన తీరు, దాన్ని రూపొందించే క్రమం, ఒక్కో ఎపిసోడ్ కథాంశం స్థూలంగా చెబుతూ  కనీసం నాలుగు ఎపిసోడ్స్ కు వివరణాత్మకమైన స్క్రిప్ట్ అందజేయాల్సి ఉంటుంది.

అభ్యర్థి /నిర్మాత తమ పూర్తి బయోడేటా తోబాటు ప్రొడక్షన్ బృందం వివరాలు సమర్పించాలి. ఒకసారి అందజేసిన వివరాలలో మార్పు చేయాలంటే కచ్చితంగా దూరదర్శన్ నుంచి ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. గేమ్ షోస్, మ్యూజికల్ ప్రోగ్రామ్స్ కోసం భారీ సెట్లు అవసరమయ్యే పక్షంలో కేవలం డిజైన్ చూపితే సరిపోతుంది. అయితే, ఆ డిజైన్ ఆమోదం పొందవలసి ఉంటుంది.

ఆ కార్యక్రమాన్నొ దూరదర్శన్ తన డిటిహెచ్ ఫ్రీడిష్ లో ప్రసారం చేసుకోవటానికి ఎలాంటి అభ్యంతరమూ ఉండబోదని నిర్మాత హామీ పత్రం జతచేయాల్సి ఉంది. ఒక కమిటీ ముందుగా అభ్యర్థనను పరీక్షించి అంచనా వేస్తుంది. ఆ తరువాత ఎంపిక కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఏ సమయంలో ఎన్ని ఎపిసోడ్స్ చొప్పున ప్రసారం చేయాల్సిందీ ఈ కమిటీ నిర్థారిస్తుంది. వారానికి ఒక రోజు ప్రసారమయ్యే సీరియల్ అయితే మొత్తం 52 ఎపిసోడ్స్, వారానికి ఐదు రోజులు ప్రసారమయ్యే సీరియల్ అయితే మొత్తం 260 ఎపిసోడ్స్ మించకుండా అనుమతిస్తారు.

దూరదర్శన్ వారి కమర్షియల్ రేట్ కార్డ్ ప్రకారం నిర్మాత టెలికాస్ట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో తనకు కేటాయించిన ఉచిత వాణిజ్య సమయం (ప్రకటనల సమయం) కూడా వినియోగించుకునే అవకాశం కల్పిస్తారు. కార్యక్రమానికి ముందు, వెనుక 10 సెకెన్లపాటు  క్రెడిట్ లైన్ కూడా ఇస్తారు. దాన్ని లోగో రూపంలో, లేదా అక్షరాల్లో, మ్యూజిక్ లేదా సౌండ్ ఎఫెక్ట్స్ లో వాడుకోవచ్చు.