• Home »
  • National Channels »
  • డిడి కిసాన్ ప్రచారకర్తగా అమితాబ్ పారితోషికం రూ. 6.31కోట్లు

డిడి కిసాన్ ప్రచారకర్తగా అమితాబ్ పారితోషికం రూ. 6.31కోట్లు

దూరదర్శన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన కిసాన్ టీవీ ప్రచార కర్తగా అమితాబ్ బచ్చన్ తీసుకున్న పారితోషికం అక్షరాలా 6 కోట్ల 31 లక్షలు. నరేంద్ర మోడీ ప్రధాని కాగానే మొదటి బడ్జెట్ లో ప్రతిపాదించిన ఈ చానల్ ను ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. దేసవ్యాప్తంగా ఉన్న రైతులకోసం ప్రత్యేకంగా వందకోట్ల బడ్జెట్ తో దీన్ని తీర్చిదిద్దారు.

ఆమితాబ్ స్థాయికి ఈ బడ్జెట్ ఎక్కువా, తక్కువా అనే విషయం పక్కనబెడితే, ఇలాంటి మంచి పనికి కూడా భారీగా వసూలు చేస్తారా అనేది కొంతమంది ఆశ్చర్యం. కానీ అంతకంటే ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, మొత్తం సెలెబ్రిటీ ఎండార్స్ మెంట్ కింద మొదట్లో ఒప్పుకున్నది రూ. 4 కోట్ల 2 లక్షలకే అయినప్పటికీ  దూరదర్శన్ తో ఎంపానెల్ అయిన ఒక ఏజెన్సీ డిడి అధికారులతో గట్టిగా బేరమాడి మరో 2 కోట్ల 29 లక్షలు పెంచి ఈ మొత్తాన్ని 6 కోట్ల 31 లక్షలకు తెచ్చింది. ఇందుకు సంబంధించిన ఈ మెయిల్స్ ను ది హిందూ పత్రిక సంపాదించింది.