• Home »
  • MIB/Licencing »
  • డిడి కిసాన్ తరహాలో త్వరలో స్టార్టప్ టీవీ

డిడి కిసాన్ తరహాలో త్వరలో స్టార్టప్ టీవీ

కొత్త వ్యాపారాలూ, పరిశ్రమలూ స్థాపించాలనుకునే యువతను ప్రోత్సహించటానికి స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అంటూ ప్రధాని రక రకాల పథకాలు ప్రకటిస్తూ ఉండగా  ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ విభాగం వారు ఇంకో అడుగు ముందుకేసి యువ వ్యాపార, పారిశ్రామికులకోసం ఏకంగా ఒక టీవీ చానల్ ప్రారంభిస్తామంటూ ముందుకొచ్చారు. కిసాన్ చానల్ తరహాలోనే ఉండే ఈ చానల్ లో నైపుణ్యాలు పెంచటానికి, కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టటానికి ప్రోత్సాహమిస్తామంటున్నారు.

వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ పరిధిలోకి వచ్చే ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ విభాగం ఈ విషయంలో నేరుగా సమాచార, ప్రసార మంత్రిత్వశాఖను సంప్రదించింది. అనుమతించటమే తరువాయి టీవీ చానల్ ప్రారంభిస్తానంటోంది. రైతులకోసం కిసాన్ చానల్ ఉన్నట్టే యువత ధైర్యంగా కొత్త వ్యాపారాలు, పరిశ్రమలు స్థాపించేలా ప్రోత్సహించటానికి చానల్ ఎంత అవసరమో ఆ ప్రతిపాదనలో వివరించింది.

ఇప్పటికే అమెరికాలో షార్క్ టాంక్ పేరుతో ఇలాంటి టెలివిజన్ నడుస్తున్న విషయాన్ని కూడా గుర్తు చేసింది. స్టార్ట్ అప్ లకు నిధులు సమకూర్చటానికి ఆ చానల్ కృషి చేస్తున్నట్టే భారతదేశంలోనూ అలాంటి నమూనాకు ప్రాధాన్యం ఉందని ప్రతిపాదనలో పేర్కొంది. ప్రస్తుతానికి షార్క్ టాంక్ తరహాలోనే ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామని, దాన్ని దూరదర్శన్ లో ప్రసారం చేస్తామని, అందులో కొత్త ఆలోచనలు చెప్పే ధైర్యవంతులైన వారిని వెంచర్ కాపిటలిస్ట్ ల సమక్షంలో ఉంచి వాళ్ళచేత ప్రశ్నల వర్షం కురిపిస్తారు.

 అలా ఎంపికైన ఫైనలిస్టులకు ఆ ప్రర్యక్షప్రసారంలోనే  నిధులు సమకూర్చటం కూడా ఉంటుందని ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ విభాగం చెబుతోంది. ఈ ఫైనలిస్టులను సెప్టెంబర్ లో హైదరాబాద్ లో జరిగే స్టార్టప్ ఫెస్ట్ లో కూడా హాజరయ్యేట్టు చూస్తారు.