• Home »
  • Cable »
  • వినోదపు పన్ను తగ్గింపుమీద ఢిల్లీ సిఎం సానుకూల స్పందన

వినోదపు పన్ను తగ్గింపుమీద ఢిల్లీ సిఎం సానుకూల స్పందన

ఢిల్లీ కేబుల్ వినియోగదారులమీద వినోదపుపన్ను భారాన్ని నూటికి నూరుశాతం పెంచుతూ బడ్జెట్ లో ప్రతిపాదించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మెత్తబడ్డారు. కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సమాఖ్య సభ్యులు ఆయనను కలిసి ఈ సమస్యను వివరించినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు.

ఒక్కో కనెక్షన్ కు ఇప్పటిదాకా రూ. 20 వంతున వసూలు చేస్తుండగా ఇకమీదట రూ. 40 వసూలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో పెంపుతో తమకేమీ సంబంధం లేదని ఎమ్మెస్వోలు తప్పుకోగా, వినియోగదారులమీద భారం మోపటం పరోక్షంగా వ్యాపారానికి ఇబ్బందికరం అవుతుంది కాబట్టి వినియోగదారుల తరఫున కేబుల్ ఆపరేటర్లే రంగంలో దిగారు. సూర్జిత్ సింగ్ నాయకత్వంలో దాదాపు 30 మంది ఆపరేటర్లు కేజ్రీవాల్ ను కలిశారు.

దాదాపు గంట సేపు జరిగిన సమావేశం తరువాత సమాఖ్య కన్వీనర్ రమేశ్ జాదూ ఆ వివరాలు వెల్లడిస్తూ సమావేశం సానుకూలంగా, ఫలవంతంగా సాగిందని ఆపరేటర్లకు అనుకూల నిర్ణయం తీసుకుంటామని హమీ ఇచ్చారని చెప్పారు. కేబుల్ ఆపరేటర్ల ప్రయోజనాలు కాపాడతామని చెప్పారన్నారు. వినోదపు పన్ను వ్యవహారం మీద అధ్యయనం చేసి వారంలోగా మళ్ళీ రూ. 20 కే తగ్గించటానికి సుముఖంగా ఉన్నారని చెప్పారు.

తగ్గింపు వలన కలిగే నష్టాన్ని భర్తీ చేసుకోవటానికి డిటిహెచ్ మీద వినోదపు పన్ను  50 రూపాయలకు పెంచవచ్చునని, అధిక ఆదాయ వర్గాలవారు మాత్రమే డిటిహెచ్ వాడుతున్నారని కేబుల్ ఆపరేటర్ల సంక్షేమ సమాఖ్య ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చింది. మరో వైపు ఎమెస్వోలు నాసిరకం సెట్ టాప్ బాక్సులు సరఫరా చేస్తున్నారని, ఎమ్మెస్వోలు, బ్రాడ్ కాస్టర్లు వాట్ ఎగవేతకు పాల్పడుతున్నారని కూడా ఫిర్యాదు చేశారు. ప్రేక్షకులకు ఇబ్బంది కలిగిస్తూ ఎమ్మెస్వోలు సెట్ టాప్ బాక్సులకు సిగ్నల్స్ నిలిపివేస్తున్నారని కూడా చెప్పారు.