• Home »
  • Legal Issues »
  • ఎఫ్ఎం వేలం వాయిదా వేస్తారా, సన్ గ్రూప్ కి అవకాశమిస్తారా?: కేంద్రాన్ని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్ట్

ఎఫ్ఎం వేలం వాయిదా వేస్తారా, సన్ గ్రూప్ కి అవకాశమిస్తారా?: కేంద్రాన్ని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్ట్

ఎఫ్ ఎం రేడియోల నమూనా వేలం ఒక వైపు జరుగుతుండగా ప్రధాన వేలాన్ని వాయిదా వేస్తారా, సన్ గ్రూప్ కి కూడా వేలంలో పాల్గొనే అవకాశం కల్పిస్తారా చెప్పండంటూ ఢిల్లీ హైకోర్ట్ ప్రభుత్వం తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. హోం మంత్రిత్వ శాఖ సెక్యూరిటె క్లియరెన్స్ ఇవ్వలేదంటూ మూడో దశ ఎఫ్ ఎం రేడియో వేలంలో పాల్గొనక్లుండా సన్ గ్రూప్ కంపెనీలను అడ్డుకోవటాన్ని కళానిధి మారన్ ఢిల్లీ హైకోర్టులో సవాలు చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ న్యాయవాది ఎ ప్రశ్నకు సమాధానంతో రావాలంటూ కేసు విచారణను కోర్టు బుధ వారానికి  వాయిదా వేసింది. సన్ గ్రూప్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ తన వాదనలు వినిపించారు.

సన్ గ్రూపుకు చెందిన ఐదు కంపెనీలను మినహాయిస్తూ మొత్తం 21 కంపెనీలను ఎఫ్ వేలంలో పాల్గొనటానికి సమాచార, ప్రసార శాఖ గతవారం ఆదేశాలిచ్చింది. అనుమతి నిరాకరిస్తున్నట్టు సన్ గ్రూప్ కు లాంఛనంగా లేఖ కూడా రాసింది. దీంతో ఈ ఆదేశాలమీద స్టే కోరుతూ సన్ గ్రూప్ ఢిల్లీ హైకోర్టులోనూ, మద్రాస్ హైకోర్టులోనూ పిటిషన్లు దాఖలు చేసింది. మద్రాస్ హైకోర్టు ఉత్తర్వుల జారీని రేపటికి వాయిదా వేయగా, ఢిల్లీ హైకోర్టు రేపు ప్రభుత్వం ఇచ్చే సమాధానాన్ని బట్టి ఉత్తర్వులు జారీచేస్తుందని భావిస్తున్నారు