• Home »
  • Cable »
  • “డిడి లో క్రికెట్ మ్యాచ్ ల పునఃప్రసార వివాదం ఢిల్లీ హైకోర్టు పరిధిలోకి రాదు”

“డిడి లో క్రికెట్ మ్యాచ్ ల పునఃప్రసార వివాదం ఢిల్లీ హైకోర్టు పరిధిలోకి రాదు”

టీవీ ప్రసారాలపంపిణీ సంస్థలైన కేబుల్, డిటిహెచ్ ,హిట్స్ , ఐపిటీవీ ఆపరేటర్లు భారత క్రికెట్ మ్యాచ్ లను దూరదర్శన్ నేషనల్ చానల్ లో పునఃప్రసారం చేయకూడదంటూ స్టార్ ఇండియా వేసిన పిటిషన్ మీద ఇండస్ ఇండ్  మీడియా అండ్ కమ్యూనికేషన్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారం ఢిల్లీ హైకోర్టు విచారణ పరిధిలోకి రాదంటూ ఒక పిటిషన్ వేసింది.  ట్రాయ్ చట్టంలోని 15 వ సెక్షన్ కింద దీన్ని విచారించే అవకాశం టెలికామ్ డిస్ప్యూట్స్ సెటిల్మెంట్ అండ్ అప్పెల్లేట్ ట్రైబ్యునల్ ( టిడిశాట్) కు మాత్రమే ఉంటుందని కూడా అందులో స్పష్టం చేసింది.

పైగా, ఈ వ్యవహారంలో ప్రసార భారతి ఇంప్లీడ్ కావల్సిన అవసరం ఉన్నప్పటికీ ఆ ప్రస్తావన లేకపోవటం వలన ఈ పిటిషన్ చెల్లుబాటు కాదని కూదా ఐఎం సిఎల్ అభ్యంతరం చెప్పింది. ఒక చానల్ ప్రసారం చేయటానికి అ బ్రాడ్ కాస్టర్ తో ఒప్పందం చేసుకున్నమీదట ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించటం కుదరదని, ప్రసారాంశాల విషయంలో అభ్యంతరాలను ఆ చానల్ తో మాత్రమే తేల్చుకోవాలని సూచించింది.

దీంతో హైకోర్టు స్టార్ ఇండియాకు నోటీసులు జారీచేయగా ఆ సంస్థ తరఫున హాజరైన న్యాయవాది నితిన్ శర్మ ఆ పత్రాలు అందుకున్నారు.  నాలుగు వారాల్లోగా ఈ విషయమైన్ అఫిడవిట్ దాఖలు చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. డిష్ టీవీ, ఐఎం సి ఎల్ సహా కొన్ని పంపిణీ సంస్థలు  దూరదర్శన్ ద్వారా క్రికెట్ ప్రసారాలు అందిస్తున్నాయని నిరుడు సెప్టెంబర్ లో స్టార్ ఇమ్డియా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

దూరదర్శన్ ద్వారా ప్రసారమయ్యే భారత క్రికెట్ మాచ్ లు ప్రసారం చేయవద్దంటూ కేబుల్ ఆపరేటర్లను, డిటిహెచ్ ఆపరేటర్లను అప్పట్లో స్టార్ ఇండియా హెచ్చరించింది. అలా ప్రసారం చేయటం సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించటమేనని గుర్తు చేసింది. ఈ మేరకు ఒక బహిరంగ నోటీసు ద్వారా కేబుల్ ప్రపంచానికి తెలియజెప్పినట్టయింది.

భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన వన్ డే ఇంటర్నేషనల్ మాచెస్ ను ప్రసార భారతి ప్రసారం చేస్తుండగా కేబుల్ నెట్ వర్క్స్, డిటిహెచ్ ఆపరేటర్లు, ఐపిటివీ, హిట్స్ వేదికలు ఆ ప్రసారాలను ప్రేక్షకులకు అందిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని స్టార్ ఇండియా ఆ నోటీసులో హెచ్చరించింది. ఈ మాచ్ లను ప్రైవేట్ పంపిణీ వేదికలు పునఃప్రసారం చేయకూడదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందని స్టార్ గుర్తు చేసింది.

కేబుల్ ద్వారా పంపిణీ చేసుకోవటానికి ప్రసార హక్కులు తమకు మాత్రమే ఉన్నాయని స్టార్ గుర్తు చేస్తూ, ఆ ఫీడ్ కేవలం దూరదర్శన్ టెరెస్ట్రియల్ ప్రసారాలకు మాత్రమే పరిమితం కాబట్టి పంపిణీ సంస్థలు ప్రసారం చేయటం నేరమవుతుందని స్పష్టం చేసింది. ఆ మేరకు సుప్రీంకోర్టు తీర్పు ప్రస్తావిస్తూ  స్క్రోల్ కూడా నడుపుతున్నామని గుర్తు చేసింది.

భారత క్రీడాకారులు పాల్గొంటున్న క్రీడాంశాల హక్కులు ఏ సంస్థకు దక్కినప్పటికీ దూరదర్శన్ కు ఆ సిగ్నల్స్ ఇచ్చి తీరాలనే నిబంధన ఉంది. అయితే, ప్రేక్షకులకు అందుబాటులో ఉంచటమనే లక్ష్యంలో టెరెస్ట్రియల్ ప్రసారాలకే అది పరిమితం కావాలి తప్ప శాటిలైట్ ప్రసారాలకు వర్తించకూడదని స్టార్ ఇండియా చాలా కాలంగా న్యాయపోరాటం జరుపుతూ వస్తోంది. ఎట్టకేలకు ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ దూరదర్శన్ టెరెస్ట్రియల్ ప్రసారాలకు, ఫ్రీడిష్ కు మాత్రమే క్రికెట్ ప్రసారాలు ఉచితంగా ఇవ్వాలని, శాటిలైట్ ప్రసారానికి ఉచిత సిగ్నల్స్ నిబంధన వర్తించదని స్పష్టం చేసింది.

అంతే తప్ప ప్రైవేట్ కేబుల్ ఆపరేటర్లు ఆ ప్రసారాలు అందించటానికి వీల్లేదని కోర్టు తేల్చి చెప్పింది. కేబుల్ టీవీ చట్టం ప్రకారం దూరదర్శన్ చానల్స్ ను తప్పనిసరిగా ప్రసారం చేసి తీరాల్సిందేనన్న నిబంధన ఉన్నప్పటికీ క్రికెట్ ప్రసారాలు మాత్రం ఆ పరిధిలోకి రావని చెప్పటంతో స్టార్ ఈ నోటీసు జారీచేసింది. నిజానికి ప్రసార భారతి కూడా అలాంటి మాచ్ ల ప్రసార సమయంలో ఈ ఫీడ్ ను కేబుల్ ఆపరేటర్లు ప్రసారం చేయరాదంటూ స్క్రోల్ నడుపుతోంది. భారత్-ఆస్ట్రేలియా మాచ్ సమయంలో అలాంటి స్క్రోల్ ప్రసారమైంది. ప్రసార హక్కులు స్టార్ ఇండియాకు మాత్రమే పరిమితమని కూడా అందులో పేర్కొంది.

స్పోర్ట్స్ లో తనదైన ప్రత్యేకమైన ముద్ర కొనసాగించటానికి స్టార్ ఇండియా సంస్థ ఐసిసి, బిసిసిఐ. ఇసిబి, ఎసిసి నుంచి ప్రతిష్ఠాత్మకమైన ప్రసార హక్కులు కొనుక్కుంది. ఈ మధ్యనే 16 వేలకోట్లకు పైగా వెచ్చింది ఐపిఎల్ హక్కులను వేలంలో గెలుచుకుంది. అందుకే దూరదర్శన్ ద్వారా ప్రేక్షకులకు అందుబాటులోకి వస్తే తమ ప్రేక్షకాదరణలొ కొంతభాగం కోల్పోతామని కోర్టుకు వెళ్ళి మరీ విజయం సాధించుకుంది.