• Home »
  • Entertainment »
  • ’గ్రాండ్ మస్తి’ ప్రసారం మీద స్టే తొలగించిన ఢిల్లీ హైకోర్టు

’గ్రాండ్ మస్తి’ ప్రసారం మీద స్టే తొలగించిన ఢిల్లీ హైకోర్టు

పెద్దల కామెడీ చిత్రం గ్రాండ్ మస్తి టీవీ లో ప్రసారం చేయటానికి అడ్డంకులు తొలగిపోయాయి. టీవీ ప్రేక్షకులు చూడటానికి వీలుగా మొత్తం 218 చోట్ల కత్తిరింపులు వేసినట్టు జీ గ్రూప్ హిందీ చానల్ &పిక్చర్స్ తెలియజేయటంతో గతంలో ఇచ్చిన స్టే ని ఢిల్లీ హైకోర్టు తొలగించింది. పైగా ఈ చిత్రం ఇప్పటికే టీవీలో మూడు సార్లు ప్రసారం చేసిన విషయాన్ని కూడా చెప్పింది.

ఆగస్టులోనే ఈ చిత్రం ప్రసారం కావలసి ఉండగా ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఈదర గోపీచంద్ దీన్ని ప్రసారం మీద స్టే విధించాలని ఢిల్లీ హైకోర్టునాశ్రయించారు. ద్వంద్వార్థాలు, అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయంటూ ఫిర్యాదుచేశారు. యు/ఎ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని యథాతథంగా టీవీలో ప్రసారం చేయకూడదంటూ వేసిన పిటిషన్ ను చీఫ్ జస్టిస్ జి. రోహిణి, జస్టిస్ జయంత్ నాథ్ తో కూడిన డివిజన్ బెంచ్ విచారణకు స్వీకరించి ఆగస్టు 21 న స్టే విధించింది.

సెన్సార్ బోర్డ్ ఇచ్చిన యు/ఎ సర్టిఫికెట్ ను సైతం రద్దు చేయాలని పిటిషనర్ కోరారు. అయితే, మొత్తం 218 కత్తిరింపులు వేయటం ద్వారా టీవీ ప్రసారానికి అనువుగా మార్చామంటూ చానల్ యాజమాన్యం కోర్టుకు తెలియజేసింది. ఈ కత్తిరింపుల వలన మొత్తం 135 నిమిషాల నిడివిగల చిత్రం 98 నిమిషాలకు తగ్గిపోయినట్టు తెలుస్తోంది. ఇందులో రితేశ్ దేశ్ ముఖ్, వివేక ఒబెరాయ్, అఫ్తాబ్ శివదాసాని నటించారు. ఇప్పుడు చానల్ యాజమాన్యం వివరణ, కత్తిరింపులు సంతృప్తికరంగా ఉన్నట్టు హై కోర్టు పేర్కొంది. టీవీ చానల్స్ నిర్వాహకులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, సినిమటోగ్రఫీ చట్టాన్ని గౌరవించాలని ఈ సందర్భంగా కోర్టు సూచించింది.