• Home »
  • Cable »
  • ఢిల్లీలో వినోదపు పన్ను పెంపుమీద డిజిటల్ కేబుల్ సమాఖ్య ఆగ్రహం

ఢిల్లీలో వినోదపు పన్ను పెంపుమీద డిజిటల్ కేబుల్ సమాఖ్య ఆగ్రహం

ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కేబుల్ కనెక్షన్ మీద నూటికి నూరుశాతం వినోదపు పన్ను పెంచుతూ నిర్ణయం తీసుకోవటం మీద కేబుల్ రంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయం మిగిలిన రాష్ట్రాలకు సైతం మార్గదర్శకంగా మారే ప్రమాదముందని డిజిటల్ కేబుల్ సమాఖ్య ఆందోళన వ్యక్తం చేస్తూ ఆప్ ప్రభుత్వ నిర్ణయాన్ని ఖండించింది. ఈ సమాఖ్య లో డిజిటల్ కేబుల్ టీవీ ఎమ్మెస్వోలు, ఆపరేటర్లతోబాటు డిటిహెచ్ ఆపరేటర్లు కూడా ఉన్నారు.
నిజానికి వినోదపు పన్ను ప్రభుత్వానికి చెల్లించేది ఎమ్మెస్వోలే అయినా, ఈ మొత్తాన్ని కేబుల్ ఆపరేటర్లే స్వయంగా కేబుల్ చందాదారులనుంచి వసూలు చేసి ఎమ్మెస్వోలకు చెల్లిస్తారు. అందువలన భారం మొసేది సామాన్య ప్రజలే. ఇప్పటికే డిజిటైజేషన్ కారణంగా పే చానల్స్ ధరల పెంపును భరిస్తూ చందాదారులు సగటున మూడు వందల రూపాయలు చెల్లిస్తుండగా ఇప్పుడు 40 రూపాయలమేరకు వినోదపు పన్ను భారాన్నీ మోయాల్సి వస్తున్నది.
దేశంలో మహారాష్ట్ర తప్ప మరెక్కడా లేని విధంగా ఢిల్లీలో పెనుభారం మోపటం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు విద్యుత్ చార్జీలు, నీటి చార్జీలు తగ్గిస్తానని వాగ్దానం చేసిన ఆప్ ప్రభుత్వం ఇలా కేబుల్ టీవీ మీద భారం మోపటం విమర్శలకు తావిచ్చింది.సామాన్యప్రజలకు ఇప్పటివరకు అందుబాటులో ఉన్న ఏకైక వినోద సాధనంగా పేరుబడిన టీవీ ని ఇలా భారంగా తయారు చేయటం ఆమ్ ఆద్మీ ప్రభుత్వానికి తగదని ఎఐడిసిఎఫ్ విమర్శించింది.
ఇలా ఉండగా డిటిహెచ్ ఆపరేటర్లు కూడా మరో ప్రకటనలో ఢిల్లీ ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఉదాహరణగా చూపుతూ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ, కేంద్రపాలిత ప్రాంతాలూ ఇదే విధంగా పెంచుకుంటూ పోతే సామాన్య ప్రజలమీద ఉద్దేశపూర్వకంగా భారం పెంచినట్టే అవుతుందని డిటిహెచ్ ఆపరేటర్లు అభిప్రాయపడ్దారు. ప్రసారభారతి ఆధ్వర్యంలోని డిటిహెచ్ మినహా మిగిలిన ఆరు ప్రైవేట్ సంస్థల ప్రతినిధులూ ఈ ప్రకటనమీద సంతకాలు చేశారు.