• Home »
  • Cable »
  • డిజిటల్ సెట్ టాప్ బాక్స్ ఎలా పనిచేస్తుంది ?

డిజిటల్ సెట్ టాప్ బాక్స్ ఎలా పనిచేస్తుంది ?

డిజిటైజేషన్ లో ప్రసారాలనాణ్యత, అదనపు సౌకర్యాలు ఆధారపడేది సెట్ టాప్ బాక్స్ మీదనే కాబట్టి దాని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవటం చాలాముఖ్యం. తాత్కాలికంగా సెట్ టాప్ బాక్సులమీద పెట్టుబడి పెట్టేది ఎమ్మెస్వో అయినప్పటికీ కొనుగోలు చేసేది వినియోగదారుడే. మధ్యలొ కొంతమేరకు ఆపరేటర్ కూడా బాధ్యత వహిస్తాడు. ఈ క్రమంలో డిజిటైజేషన్ మీద, అందులో సెట్ టాప్ బాక్సుల పాత్ర మీద, సెట్ టాప్ బాక్సుల పనితీరుమీద, సరైన సెట్ టాప్ బాక్సును ఎంచుకోవటం మీద సాధారణంగా వచ్చే అనేక అనుమానాలకు సమాధానాలిస్తూ ఈ వ్యాసం సాగుతుంది.

  1. కేబుల్ టీవీ డిజిటైజేషన్ అంటే ఏమిటి

సూటిగా చెప్పాలంటే కేబుల్ టీవీ ఇంటింటికీ డిజిటల్ సిగ్నల్ అందిస్తుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో చందాదారుడికి అత్యంత నాణ్యమైన దృశ్యం, శబ్దం అందుతాయి. ఎక్కువ చానల్స్ అందుతాయి. ఆ చానల్స్ నుంచి కావాల్సినవి ఎంచుకోవచ్చు. అందులో గేమ్స్, మూవీస్ ఆన్ డిమాండ్ లాంటి సౌకర్యాలు కూడా అందుబాటులోకి వస్తాయి.

  1. డిజిటల్ కేబుల్ టీవీ వలన ప్రయోజనాలేంటి ?

అత్యాధునిక డిజిటల్ టెక్నాలజీ వలన నాణ్యమైన ప్రసారాలు అందుతాయి. ఎక్కువ చానల్స్ అందుబాటులోకి రావటంతోబాటు వాల్యూ యాడెడ్ సర్వీసులు కూడా అందుతాయి. అందులో బ్రాడ్ బాండ్, మూవీస్ ఆన్ డిమాండ్, గేమ్స్, పే పర్ వ్యూ, , హెచ్ డి లాంటి అదనపు సౌకర్యాలు సెట్ టాప్ బాక్స్ ద్వారా కలుగుతాయి.

  1. డిజిటల్ కేబుల్ టీవీ మీద వాతావరణ ప్రభావం ఉంటుందా ?

లేదు. వర్షం లాంటి వాతావరణ పరిస్థితులు సైతం డిజిటల్ కేబుల్ టీవీ మీద ప్రభావం చూపవు, డిటిహెచ్ కి మాత్రమే అలాంటి సమస్యలుంటాయి.

  1. డిజిటల్ అడ్రెసిబుల్ సిస్టమ్ ( DAS) అంటే ఏమిటి ?

డిజిటల్ అడ్రెసిబుల్ సిస్టమ్ ( DAS) అనేది టీవీ చానల్స్ సిగ్నల్స్ పంపిణీలో వివిధ దశలలో వాడే హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లను అనుసంధానం చేసే వ్యవస్థ. దీని ద్వారా ఎన్ క్రిప్ట్ అయిన చానల్స్ ప్రసారమవుతాయి. అందులో ఈ అంశాలుంటాయి :

  • చందాదారుడు తాను కోరుకున్న ఎన్ క్రిప్ట్ అయిన చానల్స్ చూడటానికి అవకాశం ఇస్తారు.
  • ఈ వ్యవస్థలో చందాదారుడు తాను ఎంచుకున్న చానల్స్ కు మాత్రమే చెల్లించవచ్చు
  • ఈ అధికారం ఇచ్చి నియంత్రించేది మల్టీ సిస్టమ్ ఆపరేటర్. అతడే డిజిటల్ హెడ్ ఎండ్ తో ఈ వ్యవస్థను నిర్వహిస్తాడు. ఈ విషయంలో అతడికి సాయపడేది స్థానిక కేబుల్ ఆపరేటర్
  • అడ్రెసిబుల్ సిస్టమ్ అంటే చందాదారుణ్ణి గుర్తించే వెసులుబాటు ఉండటం
  • అటు మల్టీ సిస్టమ్ ఆపరేటర్ కు, , ఇటు చానల్ నిర్వాహకులకు చందాదారుల సంఖ్య కచ్చితంగా తెలుస్తుంది. ఆవిధంగా చందాదారులనుంచి రావల్సిన మొత్తం కూడా తెలుస్తుంది.
  1. సెట్ టాప్ బాక్స్ అంటే ఏమిటి ?

సెట్ టాప్ బాక్స్ అంటే చందాదారు ఇంట్లో టీవీ సెట్ కు అనుసంధానమై ఉండే పరికరం. అది చందాదారునికి చెల్లింపు పద్ధతిమీద అతడు కోరుకున్న ఎన్ క్రిప్టెడ్ చానల్స్ చూసే అవకాశమిస్తుంది. ఈ సెట్ టాప్ బాక్స్ ప్రాథమిక విధి ఏంటంటే చందాదారు ఎంచుకుని చెల్లింపు జరిపిన చానళ్ళ సిగ్నల్స్ ను డీకోడ్ చేసి డిజిటల్ సిగ్నల్స్ ను అనలాగ్ సిగ్నల్స్ గా మార్చి టీవీ సెట్ మీద చూసేలా చేస్తుంది.

  1. స్మార్ట్ కార్డ్ లేదా వ్యూయింగ్ కార్డ్ అంటే ఏమిటి ?

స్మార్ట్ కార్డ్ లేదా వ్యూయింగ్ కార్డ్ అనేది ఒక విధంగా చెప్పాలంటే ఎటిఎం కార్డ్ లాగా పనిచేస్తుంది. ఇది సెట్ టాప్ బాక్స్ తో కలిసి వస్తుంది. నిర్దిష్ట కాలానికి చందాదారుడు ఏ చానల్స్ కు చందా కడతాడో ఆ చానల్స్ సిగ్నల్స్ మాత్రమే అందిస్తుంది.

  1. మల్టీ సిస్టమ్ ఆపరేటర్ అంటే ఎవరు ?

మల్టీ సిస్టమ్ ఆపరేటర్ ( ఎమ్మెస్వో )  అంటే  చానల్ నిర్వాహకులనుంచి లేదా వారి ఏజెన్సీలనుంచి సిగ్నల్స్ అందుకోవటానికి అనుమతిపొంది ఆ సిగ్నల్స్ ను, తన సొంత కార్యక్రమాలను కూడా ఒకరు లేదా అంతకంటే ఎక్కువమంది స్థానిక ఆపరేటర్ల సాయంతో  ప్రసారంచేసే కేబుల్ ఆపరేటర్. ఆ ప్రసారాలను ఏకకాలంలో అనేకమంది చందాదారులు అందుకునే వీలుంటుంది.

  1. డిజిటైజేషన్ ప్రక్రియలో ఎమ్మెస్వో పాత్ర ఏంటి ?

అడ్రెసిబుల్ సిస్టమ్స్ ఏర్పాటు చేసుకోవటానికి చాలా భారీ పెట్టుబడులు అవసరమవుతాయి. డిజిటల్ హెడ్ ఎండ్, సెట్ టాప్ బాక్సులు తదితర హార్డ్ వేర్, సబ్ స్క్రైబర్ మేనేజ్ మెంట్ సిస్టమ్, ఎన్ క్రిప్షన్ లాంటి సాఫ్ట్ వేర్ చాలా ఖర్చుతో కూడుకున్నవి. ఈ స్థాయి పెట్టుబడులు పెట్టటం స్థానికంగా ఉండే చిన్న  చిన్న ఆపరేటర్లకు సాధ్యమయ్యే పనికాదు. అందువల్ల ఒక ఎమ్మెస్వో స్వయంగా చానల్స్ నుంచి సిగ్నల్స్ \ అందుకునేందుకు ఒక వేదిక రూపొందిస్తాడు. దాని ద్వారా అడ్రెసబిలిటీ ఉండేలా చూస్తాడు.

వినియోగదారుల వివరాలన్నీ పొందుపరుస్తాడు. నాణ్యమైన సేవలందేలా చర్యలు తీసుకుంటాడు. ట్రాయ్ నిర్దేశించిన నియమనిబంధనలన్నీ తూచా తప్పకుండా పాటిస్తాడు. కేబుల్ ఆపరేటర్ల ద్వారా, ఒక్కోసారి స్వయంగా చందాదారులకు సేవలందిస్తాడు. అందువలన స్థానిక కేబుల్ ఆపరేటర్లు ట్రాయ్ నిబంధనల మేరకు ఎవరో ఒక ఎమ్మెస్వోతో ఒప్పదాలు చేసుకొని డిజిటైజేషన్ అమలులో భాగస్వాములవుతారు.

  1. చందా కట్టిన చానల్స్ ను మార్చుకోవాల్సి వచ్చినప్పుడల్లా చందాదారులు స్మార్ట్ కార్డ్ మార్చుకోవాల్సి వస్తుందా ?

 లేదు. ఆ అవసరం లేదు. డిజిటల్ అడ్రెసిబిలిటీ లో చందాదారుడి వివరాలను నియంత్రించే అవకాశం ఉండటం వలన అతడి పాకేజ్ వివరాలు ఎప్పుడు కావాలన్నా ఎమ్మెస్వో  తన డేటా బేస్ లో మార్చవచ్చు. అది నేరుగా గాని, ఆపరేటర్ సూచనమేరకు గాని జరుగుతుంది. సెట్ టాప్ బాక్స్ తో అనుసంధానమై ఉన్న  ఏ స్మార్ట్ కార్డ్ ఫీచర్స్ మార్చాలన్నా సాధ్యమే కాబట్టి ఎప్పటికప్పుడు వినియీగదారును కోరిక మేరకు పాకేజీలలో మార్పులు సాధ్యమవుతాయి. ఏ చానల్స్ వద్దనుకున్నా, ఏవి కావాలనుకున్నా మార్పు చాలా సులభం. స్మార్ట్ కార్డ్ మార్చుకోనవసరం లేదు.

  1. సెట్ టాప్ బాక్స్ ద్వారా పే చానల్స్ తో బాటు ఫ్రీ టూ ఎయిర్ ( ఉచిత ) చానల్స్ కూదా అందుతాయా?

 అవును. డిజిటైజేషన్ లో భాగంగా పే చానల్స్ తో బాటు ఉచిత చానల్స్ కూడా ఎన్ క్రిప్ట్ చేసిన రూపంలో వినియోగదారులకు అందించాల్సి ఉన్నందున అదే సెట్ తాప్ బాక్స్ ద్వారా పే చానల్స్ తో బాటు ఉచిత చానల్స్ కూడా అందుతాయి.

  1. కేవలం ఉచిత చానల్స్ మాత్రమే చూడాలనుకున్నా సెట్ టాప్ బాక్స్ కావాలా?

 అవును. కావాల్సిందే. ఒక చందాదారుడు తనకు ఎలాంటి పే చానల్స్ అవసరమూ లేదని చెప్పినా కేవలం వంద ఉచిత చానల్స్ కే పరిమితమైనప్పటికీ సెట్ టాప్ బాక్స్ కావాల్సిందే. డిజిటక్ హెడ్ ఎండ్ నుంచి ఉచిత చానల్స్ అందటానికి కూడా సెట్ తాప్ బాక్స్ తప్పనిసరి. దాని ద్వారా మాత్రమే ఎన్ క్రిప్షన్ ద్వారా పంపే డిజిటల్ సిగ్నల్స్  వెళతాయి. డిజిటైజేషన్ లో ఇది తప్పనిసరి.

  1. ఎక్కడ, ఎవరిదగ్గరనుంచి సెట్ టాప్ బాక్స్ తీసుకోవాలి ?

ఒక చందాదారుడు ఈ కింది మార్గాలలో ఎలాగైనా సెట్ టాప్ బాక్స్ ను సమకూర్చుకోవచ్చు.

  • మల్టీ సిస్టమ్ ఆపరేటర్ కు డబ్బు చెల్లించటం ద్వారా నేరుగా సెట్ టాప్ బాక్స్ కొనుగోలు చేయవచ్చు
  • కొంత మొత్తాన్ని ధరావతుగా చెల్లించి  కూడా ఎమ్మెస్వో లేదా కేబుల్ ఆపరేటర్ నుంచి సెట్ టాప్ బాక్స్ తీసుకోవచ్చు.
  1. సెట్ టాప్ బాక్స్ తీసుకోవాలంటే ఏం చేయాలి ?

 ఎమ్మెస్వో లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించి వారు నిర్దేశించిన విధంగా చందాదారుడు ఒక దరఖాస్తు నింపి ఇవ్వాలి. ఆవిధంగా సెట్ టాప్ బాక్స్ పొందటానికి అవసరమైన లాంఛనాలన్నీ పూర్తిచేయాలి.

  1. బొకే అంటే ఏమిటి ? అ లా కార్టే అంటే ఏమిటి ?

బొకే విధానాన్ని, అ లా కార్టే విధానాన్ని ఇలా వివరించవచ్చు :

  • బొకే లేదా చానల్స్ సమూహం అంటే వేరు వేరు చానల్స్ కలిసిన సముచ్ఛయం. వాటిని ఒక సమూహంగా లేదా కట్టగట్టి ఒక ధర నిర్ణయించి ఇచ్చే విధానం. అంటే టీవీ చానల్స్ యజమానులనుంచి తీసుకున్న పే చానల్స్ ను చందాదారునికి ఒక సమూహంలా కలిపి ఇచ్చే విధానం ఇది
  • అ లా కార్టే విధానం అంటే టీవీ చానల్స్ ను విడివిడిగా చందాదారులకు అందించటం. విడి విడిగా చానల్స్ కు రేట్లు నిర్ణయించిన విధంగానే చందాదారులకు అందించటాన్ని ఇలా పిలుస్తారు.
  1. బేసిక్ సర్వీస్ టైర్ అంటే ఏమిటి ?

డిజిటైజేషన్ లో భాగంగా వినియీగదారులకు సెట్ టాప్ బాక్స్ ద్వారా కనీస ధరకు అందే కనీస ఉచిత చానల్స్ సమూహాన్ని ఇలా పిలుస్తారు.

  1. ఉచిత చానల్స్ కు గాను ఈ బేసిక్ సర్వీస్ టైర్ కింద కేబుల్ ఆపరేటర్ కు ఎంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది?

కనీసం వంద ఉచిత చానల్స్ తో బేసిక్ సర్వీస్ టైర్ ఉంటుంది. అందులొ ఒక్కో విభాగానికి చెందిన కనీసం ఐదు చానల్స్ అయినా ఉండాలి, అంటే కనీసం ఐదు న్యూస్ చానల్స్, ఐదు మ్యూజిక్ చానల్స్, ఐదు మూవీ చానల్స్, ఐదు ఆధ్యాత్మిక చానల్స్ , ఐదు జనరల్ ఎంటర్టైన్మెంట్ చానల్స్, ఐదు బాలల చానల్స్, ఇంగ్లిష్ లోనూ హిందీలోనూ, ఆయా ప్రాంతాల ప్రాంతీయభాషల్లోనూ ఉండాలి. వీటితోబాటు దూరదర్శన్ ఆధ్వర్యంలోని 18 చానల్స్ తోబాటు లోక్ సభ చానల్ కూడా ఇవ్వాలి. ఎమ్మెస్వో కచ్చితంగా బేసిక్ సర్వీస్ టైర్ ఇచ్చి తీరాలనే నిబంధన ఉండగా చందాదారుడు మాత్రం దాన్ని కచ్చితంగా తీసుకొని తీరాలనే నిబంధన ఏదీ లేదు. దీనికి బదులు చందాదారుడు తనకు కావాల్సిన 100 ఉచిత చానల్స్ ను గరిష్ఠంగా తాను ఎంచుకోవచ్చు. ఎమ్మెస్వో ఎంపిక చేసి ఇచ్చినా, చందాదారుడే ఎంచుకున్నా… ఎంపిక ఎలా జరిగినా చందా మాత్రం నెలకు వంద రూపాయలు మించటానికి వీల్లేదు. పన్నులు మాత్రం అదనంగా ఉంటాయి.

  1. డిజిటైజేషన్ అంటే ప్రత్యేకమైన టీవీ సెట్ అవసరమా ?

లేదు. అలాంటి అవసరం లేనే లేదు.ఇప్పటివరకూ అనలాగ్ సిగ్నల్స్ అందుకోవటానికి వాడుతున్న టీవీ నే కొనసాగించవచ్చు. అయితే, ముందే చెప్పినట్టుగా టీవీకి అనివార్యంగా సెట్ టాప్ బాక్సును అనుసంధానం చేసినప్పుడు మాత్రమే డిజిటల్ సిగ్నల్స్ అందుకోవటం సాధ్యమవుతుంది కాబట్టి సెట్ టాప్ బాక్స్ మాత్రం తప్పనిసరి.

  1. ఒకవేళ చందాదారుడి ఇంట్లో ఒకటి కంటే ఎక్కువ టీవీ సెట్లు ఉంటే వేరువేరుగా ఒక్కో టీవీ సెట్ కి ఒక్కో సెట్ టాప్ బాక్స్ కావాలా?

అవును. ఎన్ని టీవీ సెట్లు ఉంటే అన్ని సెట్ టాప్ బాక్సులు కావాల్సిందే. ఒక్కొక్క టీవీకీ ఒక్కొ సెట్ టాప్ బాక్స్ చొప్పున కొనుక్కున్నప్పుడే ఆ టీవీలో డిజిటల్ ప్రసారాలు అందుతాయి.

  1. ఈ సెట్ టాప్ బాక్స్ తో డిటిహెచ్ అపరేటర్ నుంచి సిగ్నల్స్ అందుకోవచ్చునా ?

కుదరదు. ఎమ్మెస్వో పంపే డిజిటల్ సిగ్నల్స్ అందుకోవటానికి వాడే సెట్ టాప్ బాక్స్ వేరు, డిటిహెచ్ ఆపరేటర్ పంపే సిగ్నల్స్ అందుకునే సెట్ టాప్ బాక్స్ వేరు. రెండిటి సాంకేతిక పరిజ్ఞానాలు వేరు వేరు కాబట్టి దేనికవే ప్రత్యేకమైన సెట్ టాప్ బాక్సులు. అందువలన ఒకే బాక్స్ రెండు పనులూ చేయదు.

  1. ఒక కేబుల్ ఆపరేటర్ దగ్గర తీసుకున్న సెట్ టాప్ బాక్స్ ఇంకో ఆపరేటర్ దగ్గర వాడుకోవచ్చా ?

కుదరదు. ఒక కేబుల్ ఆపరేటర్ అందించే సెట్ టాప్ బాక్స్ మరొకరి వ్యవస్థతో అనుసంధానం కాకపోవచ్చు.  అందువలన ప్రతిసారీ ఒక ఆపరేటర్ దగ్గర తీసుకున్న సెట్ టాప్ బాక్స్ మరొకరి దగ్గర పనిచేస్తుందన్న నమ్మకం లేదు.

  1. సెట్ టాప్ బాక్స్ తిరిగి ఇవ్వటానికి నియమనిబంధనలేమిటి ?

చందాదారుడు సేవలందుకోవటానికి ఒప్పుకుని చందా కట్టినప్పుడే సెట్ టాప్ బాక్స్ తిరిగి ఇచ్చే విషయంలో నియమనిబంధనలు తెలియజేయాలి. చందాదారునిగా మారినప్పుడు పూర్తిగా చెల్లించి కొనుగోలు చేశాడా, అద్దెకొనుగోలు పద్ధతిమీద తీసుకున్నాడా, అద్దెకు తీసుకున్నాడా అనేదాన్ని బట్టి రిఫండ్ విధానం కూడా ఆధారపడి ఉంటుంది. సెట్ టాప్ బాక్స్ తిరిగి ఇవ్వటానికి సంబంధించి ఈ దిగువ చెప్పిన విధానాలు ఉన్నాయి:

  • ఏదైనా సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేసి ఉంటే కేబుల్ ఆపరేటర్ తన బకాయిలేవైనా ఉంటే వాటిని మినహాయించుకొని డిపాజిట్ ని తిరిగి ఇవ్వాలి

* ఒకవేళ కేబుల్ ఆపరేటర్  కార్యకలాపాలు నిర్వహించే ప్రాంతంలోనే వినియోగదారుడు ఒకచోటు నుంచి మరో చోటుకు మారుతున్న పక్షంలో బదలీ వోచర్ మీద కొత్త అడ్రస్ లో అమలులో ఉన్న నియమ నిబంధనల ప్రకారం కొత్త సెట్ టాప్ బాక్స్ ఇవ్వాలి.

* కేబుల్ ఆపరేటర్ అందిస్తున్న సేవలపట్ల వినియోగదారుడు సంతృప్తి చెందని పక్షంలో వినియోగదారుడు స్వేచ్ఛగా తన ఆపరేటర్ పరిధినుంచి  వైదొలగవచ్చు. సెట్ టాప్ బాక్స్ ను సరెండర్ చేసి, దాన్ని కొన్నప్పటి నియమనిబంధనల ప్రకారం బకాయిలుంటే మినహాయించుకోమని చెప్పి మిగిలిన మొత్తం తీసుకోవచ్చు. అయితే, ఆ మినహాయింపు ప్రతి అర్థ సంవత్సరానికీ 25 % మించకూడదు. ఉదాహరణకు ఒక సెట్ టాప్ బాక్సులు కొన్నప్పుడు దని ధర రూ. 2,000 ఉన్నదనుకుందాం. వినియోగదారుడు ఏడాది దాటి, ఏడాదిన్నరలోపు దాన్ని తిరిగి ఇచ్చాడనుకుందాం. అలాంటప్పుడు మినహాయించుకునే మొత్తం రూ. 1500 మించకూడదు.

  1.  సెట్ టాప్ బాక్స్  తీసుకోవటానికి   అందుబాటులో ఉన్న పథకాలేమిటి?

కేబుల్ ఆపరేటర్  నేరుగా అమ్మటం గాని, అద్దెకివ్వటంగాని, అద్దె కొనుగోలు పద్ధతిమీద వాయిదాల్లో ఇవ్వటం గాని చెయ్యవచ్చు. ఆపరేటర్ ఈ మూడు రకాల పథకాలనూ తెలియజేయాలి. వినియోగదారుడు తనకు నచ్చిన ఏ విధానాన్నైనా ఎంచుకునే స్వేచ్ఛ అతనికి ఉంటుంది.

  1. సెట్ టాప్ బాక్స్ ఎలా పొందాలి ?

       సాధారణంగా కేబుల్ ఆపరేటర్ స్వయంగా సెట్ టాప్ బాక్స్ సమకూర్చుతాడు

  1. ఒకవేళ సెట్ టాప్ బాక్సులో లోపం ఏర్పడితే ?

వినియోగదారుడు నేరుగా సెట్ టాప్ బాక్సును ఆపరేటర్ నుంచి కొనుగోలు చేసే పక్షంలో కనీసం ఏడాది పాటు వారంటీ ఇవ్వాలి. వారంటీ ఉన్న సమయంలో దాని నిర్వహణకు గాని, మరమ్మతులకు గాని వినియోగదారుడు ఎంతమాత్రమూ చెల్లించాల్సిన అవసరంలేదు. కనీసం ఆపరేటర్ పంపిన టెక్నీషియన్ ఇంటికి వచ్చి వెళ్ళినందుకు కూడా ఎలాంటి చార్జీలూ చెల్లించకూడదు. ఒకవేళ అద్దెకొనుగోలు పద్దతి మీదగాని, అద్దెకుగాని సెట్ టాప్ బాక్స్ తీసుకొని ఉన్నా  ఆ సమయంలో మరమ్మతులకు , నిర్వహణకు ఎలాంటి చెల్లింపులూ చేయనవసరం లేదు.

  1. సెట్ టాప్ బాక్స్ లేకుండా డిజిటైజేషన్ లో కేబుల్ టీవీ సర్వీస్ తీసుకోవచ్చా?

కుదరదు. సెట్ టాప్ బాక్స్ ఉండి తీరాల్సిందే. కాకపోతే ఈ మధ్యనే కొన్ని టీవీ సెట్లలో సెట్ టాప్ బాక్స్ కూడా కలిసే వస్తున్నది.

ప్రత్యేకంగా ఎంచుకోవాల్సిన ఫీచర్లు :

సెట్ టాప్ బాక్స్ కొనుగోలు సమయంలోనే అందులో ఏయే ఫీచర్లు ఉన్నాయో జాగ్రత్తగా చూసుకోవాలి. ఒకసారి కొనుగోలు చేశాక దాన్ని కొన్ని ఏళ్లపాటు ఉపయోగించుకుంటారు కాబట్టి వీలైనంత వరకు భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా ఈ దిగువ పేర్కొన్న ఫీచర్లు ఉంటే అది చాలా ఉత్తమమైన సెట్ టాప్ బాక్స్ గా పరిగణించవచ్చు:

  1. టీవీ ట్యూనర్
  2. ఎంపెగ్-2
  3. ఎంపెగ్-4
  4. ఇంటర్నెట్ బ్రౌజింగ్
  5. హెచ్ డి ఎమ్ ఐ మాడ్యూల్
  6. డాల్బీ 1 సామర్థ్యం
  7. హై డెఫినిషన్
  8. ఎఫ్ ఎం రేడియో స్పీకర్ ఔట్
  9. యు ట్యూబ్
  10. వీడియో ప్లేయర్
  11. ఫొటో వ్యూయర్
  12. ఈ- గవర్నెన్స్
  13. ఎంపి 3 ప్లేయర్
  14. వీడియో ఆన్ డిమాండ్
  15. వీడియో కాన్ఫరెన్సింగ్
  16. 3 డి
  17. మల్టీ మీడియా రిమోట్
  18. 3డి మాజిక్ ( 2డి కంటెంట్ ను 3డి గా మార్చేది )

మొత్తంగా చూస్తే సెట్ టాప్ బాక్స్ లో ఉండాల్సిన లక్షణాలివి

(1)  ఇంటరాక్టివిటీకి అవకాశం కల్పించే నెట్ వర్క్
(2) నెట్ వర్క్ ఇంటర్ ఫేస్ – దీనివలన సెట్ టాప్ బాక్స్ కు నెట్ వర్క్ తో అనుసంధానం ఏర్పడి సర్వర్ తో కమ్యూనికేట్ చేయగలుగుతుంది

(3) ఇన్ కమింగ్ సిగ్నల్ ను పట్టుకునే ట్యూనర్
(4) డీకోడర్ –  స్టోరేజ్ స్థలాన్ని, డిస్క్ బాండ్ విడ్త్ ని, నెట్ వర్క్ బాండ్ విడ్త్ ని ఆదా చేయటానికి ఇది అవసరం నెట్ వర్క్ ద్వారా కార్యక్రమాన్ని సెట్ టాప్ బాక్స్ కి పంపటానికి ముందు ఎన్ కోడ్ అవుతుంది. అంటే కంప్రెషన్ కి గురవుతుంది. అందువలన చందాదారుడు తన దగ్గర ఒక డీకోడర్ పెట్టుకొని డీకోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.అప్పుడే టీవీలో చూడటం వీలవుతుంది మోడెమ్ చేసే పని ఇదే. ఈ డీకోడింగ్ నే డీమాడ్యులేషన్ అని కూడా అంటారీంపెగ్ 2 కంటే ఎంపెగ్ 4 కంప్రెషన్ టెక్నాలజీ వలన నెట్ వర్క్ బాండ్ విడ్త్  లో 40 శాతం తక్కువ వాడబడుతుంది.

(5) బఫర్ – నెట్ వర్క్ లో జాప్యం కారణంగా ఏర్పడే సమస్య. వీడియో స్ట్రీమ్ కచ్చితంగా వచ్చే సమయం ఒక్కోసారి లెక్కించటం, అంచనావేయటం సాధ్యం కాదు. అందువలన ప్రేక్షకునికి అవిచ్ఛిన్నంగా ఎడతెగని ప్రసారం అందటానికి వీలుగా వీడియో, డేటా స్ట్రీమ్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సెకెన్ల ముందే అందుకోవటం ఉంటుంది. అంటే, ప్రేక్షకుడు చూడటానికి కొద్ది క్షణాలముందే అందుతుంది. అందువలన ప్రేక్షకుడికి అందాల్సిన స్ట్రీమింగ్ లో ఒడిదుడుకులున్నప్పటికీ సెట్ టాప్ బాక్స్ లేదా డీకోడర్ ఆ ఒడిదుడుకులు కనబడకుండా చేస్తుంది. బఫర్ లో కొంత అదనపు సమయం ఉంటుంది
(6) సింక్రనైజేషన్ సాఫ్ట్ వేర్ / హార్డ్ వేర్ : వీడియో, ఆడియో స్ట్రీమ్స్ ప్రేక్షకుడు చూడటానికి ముందే ఒకదానితో ఒకటి అనుసంధానం ( సింక్రనైజ్) కావాలి. మెటాడేటా లాంటివి కూడా సింక్రనైజ్ కావాలి
(7) మిడిల్ వేర్
(8) ప్లాట్ ఫామ్
(9) అప్లికేషన్స్
(10) రిటర్న్ పాత్ లేదా బాక్ చానల్ .

సెట్ టాప్ బాక్స్ లో ఉండే సాధారణ ఫీచర్లు

ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్ గైడ్

ఇది చానల్స్ లో ప్రసారమవుతున్న ప్రస్తుత కార్యక్రమం, ఆ తరువాత రాబోయే కార్యక్రమం తదితర వివరాలను తెలియజేస్తుంది. ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందుబాటులో ఉంచుతుంది. తెర దిగువన ఈ సమాచారం తెలుస్తూ ఉండటం అటు ప్రేక్షకులకు, ఇటు చానల్స్ కు ఎంతో ఉపయోగకరం. పరోక్షంగా చానల్స్ తమ కార్యక్రమాలను ప్రచారం చేసుకోవటం ద్వారా ప్రేక్షకులు ఆ కార్యక్రమం కోసం అదే చానల్ కొనసాగించేందుకు కూడా దోహదపడుతుంద

ఫేవరేట్స్

ఈ ఫీచర్ ద్వారా వినియీగదారుడు తనకు ఇష్టమైన చానల్స్ ను ఎంచుకోవచ్చు. వందలాది చానల్స్ మధ్య వాటిని సులభంగా ఎంచుకొని చూసేందుకు వీలవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మనం వెబ్ బ్రౌజర్స్ లో వాడే బుక్ మార్క్స్ లాంటిదే ఇది కూడా.

టైమర్

ఈ టైమర్ వలన వినియోగదారుడు నిర్దిష్ట సమయాల్లో సెట్ టాప్ బాక్స్ ఒక చానల్ నుంచి ఒక చానల్ కు మారటం ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ముఖ్యంగా వినియోగదారుడు ఇంట్లో లేనప్పుడు ఒకటికంటే ఎక్కువ చానల్స్ రికార్డ్ చేసుకోవటానికి సాయపడుతుంది. అయితే, విసిఆర్ లేడా డివిడి రికార్డర్ ను సైతం వినియోగదారుడు ప్రోగ్రామ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ సెట్ టాప్ బాక్స్ స్కార్ట్ లింక్ ద్వారా  విసిఆర్ లేడా డివిఆర్ కి రికార్డింగ్ మొదలెట్టాల్సిందిగా ఒక కంట్రోల్ సిగ్నల్ ని పంపుతుంది. కాబట్టి వినియోగదారుడు సెట్ టాప్ బాక్స్ ను ప్రోగ్రామ్ చేస్తే అది సరైన సమయంలో సరైన చానల్ కి మారి విసిఆర్ లేదా డివిఆర్ ని మేల్కొలుపుతుంది.

పేరెంటల్ లాక్స్

పిల్లలు చూడకూడదనుకున్న చానల్స్ వాళ్ళు చూడకుండా చేయటానికి వీలుగా తల్లిదండ్రులు వాటిని లాక్ చేయవచ్చు. ఇందుకోసం ఒక పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ( పిన్ ) వాడతారు. కొన్ని బాక్సులు అన్ని చానల్స్ నూ ఆపేస్తాయి. మరికొన్ని బాక్సులు ఎంపిక చేసిన చానల్స్ మాత్రమే నిలిపివేస్తాయి.