• Home »
  • Cable »
  • డిజిటైజేషన్ ముంగిట్లో కేబుల్ టీవీ – భారమా? వ్యాపార అవకాశమా?

డిజిటైజేషన్ ముంగిట్లో కేబుల్ టీవీ – భారమా? వ్యాపార అవకాశమా?

డిజిటైజేషన్ ముంగిట్లో కేబుల్ టీవీ
భారమా? వ్యాపార అవకాశమా?

సమగ్ర విశ్లేషణాత్మక కథనం

డిజిటైజేషన్ . . . ఇప్పుడు కేబుల్ రంగంలో తీవ్రంగా చర్చ జరుగుతున్న అంశమిది. అదనపు భారం పడుతుందని అటు ఎమ్మెస్వోలు, ఇటు వినియోగదారులు భయపడుతుంటే ఆదాయం తగ్గుతుందేమోనన్నది కేబుల్ ఆపరేటర్ల భయం. కానీ ప్రభుత్వం మాత్రం ప్రసారాల నాణ్యత పెరుగుతుందని వినియోగదారులకు, లాభాల్లో వాటా పెరుగుతుందని ఆపరేటర్లకు, పే చానల్స్ చందా రాబడి పెరుగుతుందని చానల్ యాజమాన్యాలకూ నచ్చజెబుతోంది. అయితే, ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని ఎమ్మెస్వోలు ఆందోళన చెందుతుంటే కార్పొరేట్ ఎమ్మెస్వోలు దీన్ని అవకాశంగా మలుచుకునేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులతో రంగంలో దిగారు. అదే సమయంలో ప్రత్యామ్నాయంగా నేనున్నానంటూ హిట్స్ వ్యవస్థ ముందుకొచ్చింది. మొదటి రెండు దశల డిజిటైజేషన్ అమలులో ఎదురైన అనుభవాలను పాఠాలుగా మార్చుకొని మిగిలిన రెండు దశలూ సమర్థంగా పూర్తిచేస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఏదేమైనా, ఎమ్మెస్వోలకూ, ఆపరేటర్లకూ మధ్య ఆగాథం పెంచేలా అనుమానాలు తలెత్తుతున్నాయి. వీటిని నివృత్తిచేయటంలో ఇప్పటికీ ప్రభుత్వం విజయం సాధించలేకపోయింది. మరోవైపు పే చానల్ యజమానులు ధరలు పెంచటంతో వినియోగదారులను కొత్త ధరలకు ఒప్పించటం సమస్యగా మారుతుందేమోనని ఎమ్మెస్వోలూ, ఆపరేటర్లూ భయపెడుతున్నారు. మొత్తంగా చూస్తే డిజిటైజేషన్ మీద ఎన్నో అనుమానాలూ, మరెన్నో అపోహలూ కొనసాగుతున్న తరుణంలో మా పాఠకులకోసం ఈ సమగ్ర విశ్లేషణాత్మక కథనాన్ని అందిస్తున్నాం.

కేబుల్ టీవీ నేపథ్యం
మెట్రోపాలిటన్ నగరాల్లో పెద్ద పెద్ద అపార్ట్ మెంట్స్ లో సినిమాలు ప్రసారం చేయటానికి వీలుగా వీసీపీ లో వీడియో కాసెట్లు ప్లే చేయటంతో కేబుల్ టీవీ మొదలైంది. ఇది 1985 నాటి మాట. ఆవిధంగా దరదర్శన్ ప్రసారాలతో విసిగిపోయినవాళ్ళకు ఈ సినిమాల ప్రసారం కారుచౌకగా అందుబాటులోకి వచ్చిన వినోదంగా మారాయి. అదే సమయంలో టెరెస్ట్రియల్ దూరదర్శన్ ప్రసారాలు సైతం పెద్ద పెద్ద కొండలున్నచోట సరిగా అందకపోవటంతో ఇలాంటి కేబుల్ వ్యవస్థ ద్వారా ఇంటింటికీ అందజేసిన సందర్భాలు కూడా అక్కడక్కడా ఉన్నాయి. కానీ ఇది అప్పట్లో అతి కొద్ది ప్రాంతాలలో మాత్రమే కనిపించేది.

కానీ ఆ తరువాత స్టార్ టీవీ ప్రసారాలు, ఆ వెనువెంటనీ జీ టీవీ ప్రసారాలు మొదలవటంతో ఆ శాటిలైట్ చానల్స్ ప్రసారాలు ఇంటింటికీ అందాలంటే కేబుల్ టీవీ అనివార్యంగా మారింది. అలా చానల్స్ సంఖ్య 12 కు చేరింది అప్పుడు. కానీ ఇలాకేబుల్ ద్వారా ప్రసారాలు అందించటమనేది అప్పటికీ చట్ట బద్ధం కాలేదు. ముందుగా 1994 లో కేబుల్ టీవీ నెట్ వర్క్స్ రెగ్యులేషన్ ఆర్డినెన్స్ వచ్చింది. ఆ తరువాత 1995 లో అది చట్టంగా మారింది. భారతదేశంలో ఇప్పుడు 18 కోట్ల కేబుల్ కనెక్షన్లున్నాయి. 1992 లో కేవలం 4 లక్షలుండేవి. బహుశా అన్ని రకాల ఆదాయ వర్గాలవారి ఇళ్ళలోనూ ప్రవేశించిన సాంకేతిక పరికరాలలో మొదటి స్థానం కేబుల్ టీవీదే.

అందుకే దీనికున్న ప్రజాదరణ అంతా ఇంతా కాదు. అలా చొచ్చుకుపోవటానికి అసలు కారణం ఆలోచిస్తే మొదట్లో ఎలాంటి చట్టమూ లేకపోవటమేనని స్పష్టమవుతుంది. అలా బాగా వేళ్లూనుకుంటున్న సమయంలో 1994 లో కేబుల్ టీవీ చట్టానికి శ్రీకారం చుట్టి 1995 నాటికి పూర్తిచేశారు. అయితే, దీని పరిధి పరిమితంగా ఉండటానికి కారణం అప్పట్లో చానల్స్ ను ఇందులో చేర్చకపోవటం. ఆ తరువాత చిన్నా చితకా నిబంధనలు వచ్చినా పెనుమార్పులు లేవు. కానీ ఈ చట్టం వచ్చిన తరువాత ఒక కొత్త పాత్ర ప్రవేశించింది. అదే మల్టీ సిస్టమ్ ఆపరేటర్ – MSO. ఎక్కువ చానల్స్ ఇవ్వగలిగే సూపర్ హెడ్ ఎండ్ అది.

అప్పట్లో 12 చానల్స్ తో మొదలై క్రమంగా 60 చానల్స్ కు చేరింది. ఇంటింటికీ ప్రసారాలు అందించటానికి వీలుగా సొంత కంట్రోల్ రూమ్ లో చానల్స్ సిగ్నల్స్ అందుకోవటానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఎక్కువ చానల్స్ ఇవ్వలేక సతమతమవుతున్న చిన్న ఆపరేటర్లు ఈ ఎమ్మెస్వోల రాకతో కాస్త ఊపిరి పీల్చుకున్నారు. లాస్ట్ మైల్ ఆపరేటర్ ( LMO ) గా పిలవబడే ఈ ఆపరేటర్లు నెలవారీ కొంత నిర్దిష్టమైన మొత్తాలు చెల్లిస్తూ ఎమ్మెస్వో కంట్రోల్ రూమ్ నుంచి కొయాక్సియల్ కేబుల్ ద్వారా ఫీడ్ అందుకోవటం ప్రారంభించారు. అలా వీళ్ళు అందించే చానల్స్ సంఖ్య 12 నుంచి 60 కి. ఆ తరువాత 92 కి పెరిగి 2002 నాటికి 106 కు చేరాయి.

అప్పట్లో అంతా అనలాగ్ యూని డైరెక్షనల్ ట్రాన్స్ మిషన్ మాత్రమే. కొయాక్సియల్ కేబుల్ వాడుకుంటూ కంట్రోల్ రూమ్ నుంచి చుట్టూ ఐదు కిలోమీటర్ల వ్యాసార్థంలో సేవలందించగేవాళ్ళు. ఆ రోజుల్లో ఒక చానల్ కు 7 లేదా 8 మెగాహెర్ట్జ్ పట్టేది. ( అదే డిజిటల్ ట్రాన్స్ మిషన్ అయితే10 నుంచి 20 వరకూ చానెల్స్ కంప్రెస్ చేసి ప్రసారం చేయవచ్చు. ) 1995 వరకూ అన్నీ ఉచిత చానల్సే ఉండేవి.
కానీ ఆ తరువాత కాలంలో పే చానల్స్ రావటంతో ఆ సిగ్నల్స్ అందుకోవటానికి ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ లో ఇంటిగ్రేటెడ్ రిసీవర్ అండ్ డీకోడర్స్ ( IRDs ) పెట్టాల్సి వచ్చింది. పే చానల్స్ చందాల విషయంలో చాలా గందరగోళం ఉండేది. బేరసారాలతో చెల్లింపు మొత్తం నిర్ణయమయ్యేదే తప్ప నిర్దిష్టమైన ధర అంటూ ఉండేది కాదు. కనెక్షన్ల సంఖ్య విషయంలోనూ పరస్పరం అంగీకరించుకున్న మొత్తాలే తప్ప కొలమానం అంటూ ఉండేది కాదు. ప్రజలకు ఈ వివరాలెప్పుడూ బహిర్గతం చెయ్యలేదు. ఇంకా విచిత్రమైన విషయమేంటంటే, అటు సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖగానీ, ఇటు ట్రాయ్ గానీ ఏనాడూ ఈ ఒప్పందాల విషయంలో పే చానల్స్ నుంచి సమాచారం తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదు.

పే చానల్స్ తరచూ ఎక్కువ మొత్తాలు వసూలు చేస్తుండటంతో కేబుల్ ఆపరేటర్లలో పెద్ద ఎత్తున అసంతృప్తి వ్యక్తం చేస్తూ వచ్చారు. వినియోగదారులు ఎక్కువమొత్తాలు చెల్లించేందుకు ఆసక్తి చూపకపోవటం, అయినప్పటికీ కేబుల్ ఆపరేటర్లు మాత్రం పూర్తి మొత్తాలు చెల్లించాల్సి రావటం అందుకు ప్రధాన కారణం. ఇలా ఉండగా 2002 లో కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ (CAS ) అమలయ్యేలా కేబుల్ చట్టాన్ని సవరించారు. పే చానల్స్ కావాల్సినవాళ్ళు మాత్రమే తీసుకునే వెసులుబాటుకు అప్పుడే శ్రీకారం చుట్టారు. అయితే, ఇందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవటానికి ఎమ్మెస్వోలకు పెద్ద ఎత్తున పెట్టుబడులు అవసరమయ్యాయి. ఆ కంట్రోల్ రూమ్ చాలా ఖర్చుతో కూడుకున్నది. పైగా సెట్ టాప్ బాక్సులు, చందాదారు నిర్వహణా వ్యవస్థ ( SMS ), ఎయిర్ కండిషనింగ్ కోసం అదనపు విద్యుత్ సౌకర్యం, ప్రత్యామ్నాయ విద్యుత్ ఏర్పాట్లు భారంగా మారాయి.

ఈ పరిస్థితుల్లో ఇలాంటి ఖర్చుల భారం తగ్గించటానికి ఆప్టికల్ ఫైబర్ ప్రవేశపెట్టారు. దీనివలన ప్రసారాలు అందించగలిగే వ్యాసార్థం బాగా పెరిగింది. అంటే ఇడిఎఫ్ఎ (Erbium Doped Fiber Amplifier ) వాడకుండా 34 కిలోమీటర్ల వ్యాసార్థంలో, ఒక ఇడిఎఫ్ఎ వాడితే 67 కిలోమీటర్లమేర ప్రసారాలు పంపటానికి వీలయ్యింది. దీనివలన కంట్రోల్ రూమ్స్ సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఏర్పడింది. ఆ విధంగా హైబ్రిడ్ కొయాక్సియల్ ఫైబర్ ( HFC) నెట్ వర్క్స్ అనే భావనకు బీజం పడింది. మొత్తానికి పట్టణప్రాంతాల్లో 10 – 12 హెడ్ ఎండ్స్ కలిసిపోవటానికి వీలు కలిగింది. ప్రభుత్వం సెట్ టాప్ బాక్సుల ప్రమాణాలను సైతం నిర్దేశించింది. IS 15244, 15245 ప్రమాణాలు ఉండాలని స్పష్టంగా పేర్కొంది.

అంత సదుద్దేశంతో ప్రవేశపెట్టిన విధానం సైతం నీరుగారిపోయింది. కారణాలు చాలా ఉన్నాయి :
(a) చానల్ యజమానులు వాళ్ళ చానల్ కు ధర ఎలానిర్ణయించారో వెల్లడించలేదు.
(b) .అమలును పర్యవేక్షించటానికి తగిన సిబ్బంది సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖకు లేరు
(c) .ప్రసార రంగమనేది కేంద్రప్రభుత్వ పరిధిలో ఉన్న అంశమే అయినప్పటికీ, స్థానికంగా పాలనావ్యవహారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వానికే అప్పగించారు.
(d) వినియోగదారునికి తగిన అవగాహన కల్పించలేకపోవటం
(e) కనెక్షన్ల సంఖ్య బయటపడితే, పాత తేదీలతో ఎంటర్టైన్మెంట్ టాక్స్ పడుతుందనే భయంతో కేబుల్ ఆపరేటర్లు సహకరించలేదు.
(f) ఢిల్లీ హైకోర్టు 2007 జులై లో జోక్యం చేసుకునేదాకా దీని అమలు మీద రాజకీయంగా పట్టుదల లేదు. మొత్తానికి చెన్నై లోనూ ఢిల్లీ, ముంబై నగరాల్లోని కొన్ని ప్రదేశాలలోనూ కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ ప్రవేశపెట్టబడింది.
(g) అయితే చానల్ యాజమాన్యాలుగాని, ఆపరేటర్ గాని, వినియోగదారుడు గాని CAS అమలుమీద ఏ విధమైన ఆసక్తీ కనబరచకపోవటం వల్ల పెద్దగా సాధించినదేమీ లేదు.

ఈలోగా డైరెక్ట్ టు హోమ్ ( DTH ) మొదలైంది. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు రంగ ప్రవేశం చేశాయి. కేబుల్ తో సంబంధం లేకుండా ప్రత్యేకమైన పరికరాల సాయంతో వినియోగదారులకు ప్రసారాలు అందించటం మొదలుపెట్టింది. దీనివలన కేబుల్ టీవీ కనెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. అందుకూ కొన్ని కారణాలున్నాయి:

• కేబుల్ ఆపరేటర్ లాంటి మధ్యవర్తి మరొకరు లేకుండా నేరుగా ప్రసారాలు అందుకునే వెసులుబాటు
• మెరుగైన నాణ్యతతో దృశ్యం, శబ్దం అందుకోగలగటం
• ముందుగా చెల్లించే విధానంతో ( ప్రీ పెయిడ్ ) బాటు ప్యాకేజ్ ఎంచుకునే స్వేచ్ఛ ఉండటం
• బిల్లు చెల్లింపులు, సర్వీసింగ్ లాంటివిచాలా ప్రొఫెషనల్ గా నడుస్తూ రావటం
• వ్యవస్థీకృతం కాని కేబుల్ నెట్ వర్క్ ఆపరేటర్ కు ప్రత్యామ్నాయంగా నిలవటం
• గ్రామాల్లో కొన్ని చోట్ల కేబుల్ ఆపరేటర్ వ్యతిరేకవర్గీయులు పంతంకోసం ఎంచుకోవటం
ఏమైనప్పటికీ కేబుల్ ఆపరేటర్ కి ఇది పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయం కాలేకపోయింది. నిజానికి ప్రపంచవ్యాప్తంగా చూసినా డిటిహెచ్ 15 శాతం మించలేదు. ఇక్కడా దాదాపు అదే స్థాయిలో ఆగిపోయింది. ఈలోగా చానల్స్ సంఖ్య మరింత పెరుగుతూ వచ్చింది, డిటిహెచ్ ఆపరేటర్లు ఆ చానల్స్ అన్నీ డౌన్ లింక్ చేసుకోవటానికి తగినన్ని శాటిలైట్ ట్రాన్స్ పాండర్లు లేక కొరత ఏర్పడింది. కేబుల్ నెట్ వర్క్ ద్వారా వెయ్యి చానల్స్ వరకూ అందించగలిగే డిజిటల్ ప్రసారాలమీద పరిశ్రమ, ప్రభుత్వం దృష్టి సారించాయి. .

డిజిటైజేషన్ దిశగా….

మొత్తానికి కేబుల్ టీవీ పరిశ్రమ మొదలై రెండు దశాబ్దాలు దాటిన తరువాత 2011 డిసెంబర్ లో లోక్ సభ ఒక బిల్లును ఆమోదించింది. భారతదేశంలో కేబుల్ టీవీని డిజిటైజ్ చేయటం దీని ప్రధానోద్దేశం. కేబుల్ టీవీ నెట్ వర్క్స్ సవరణ చట్టం 2011, సవరణ నిబంధనలు ( 2012 ) తో బాటుగా దశలవారీ డిజిటైజేషన్ అమలుకోసం ట్రాయ్ నిబంధనలు నెం. 9, 12, 13 జారీచేసింది.

దాదాపు రెండున్నర దశాబ్దాల కాలంలో దేశవ్యాప్తంగా 15 కోట్ల ఇళ్ళతో అనుసంధానమైన పరిశ్రమ కేబుల్ టీవీ నెట్ వర్క్. 106 అనలాగ్ చానల్స్ అందించగలిగేలా కంట్రోల్ రూమ్స్, కేబుల్స్ తదితర వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. 2011 నాటికి ఈ వ్యవస్థలో పాతికవేల కోట్లకు పైబడి ప్రైవేట్ పెట్టుబడి చేరింది. దీనినుంచి ఏటా 12 నుంచి 13 వేల కోట్ల ఆదాయం వస్తోంది. అందుకే ఈ రంగం ప్రభుత్వానికి ఒక ఆదాయ వనరుగా కనిపించింది.. ఆ క్రమంలోనే కేబుల్ ఆపరేటర్ మీద ఎంటర్టైన్మెంట్ టాక్స్, సర్వీస్ టాక్స్ పడ్డాయి. అయితే, ఆ పన్ను విధింపుదారులకు మనమేం చేస్తున్నామనే ధ్యాస లేకుండా పోవటం మాత్రం దారుణం.

పార్లమెంట్ ఈ చట్టం చేసిన తరువాత దీని అమలు సాఫీగా సాగిపోవటం ఎలాగన్నది ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలుగా తయారైంది. అందుకే దీనికి సంబంధించిన విధి విధానాలు, నిబంధనలు రూపొందించే బాధ్యతను టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కి అప్పగించింది. మొత్తం డిజిటైజేషన్ ప్రక్రియను విశ్లేషించిన ట్రాయ్ తన సిఫార్సులను సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖకు అందజేసింది. నిర్మాణపరంగా, సాంకేతికంగా కేబుల్ టీవీ రంగంలో వచ్చిన అతి పెద్ద సంస్కరణగా దీన్ని అభివర్ణించవచ్చు. మొత్తానికి అనేకదేశాల్లో సాగిన తీరులోనే భారత్ లోనూ దశలవారీగా డిజిటైజేషన్ అమలు చేయాలనే ఆలోచన వచ్చింది. ఆచరణలో ఎదురవుతూ వచ్చిన ఇబ్బందులు, కోర్టు కేసులకారణంగా గడువుతేదీలు పొడిగిస్తూ వచ్చారు. ఇప్పటివరకు ఉన్న పరిస్థితి ప్రకారం ఇవీ గడువుతేదీలు :

దశ ప్రాంతాలు గడువు తేదీ

మొదటి దశ నాలుగు మెట్రో నగరాలు ( ఢిల్లీ, ముంబై, కోల్ కతా, చెన్నై ) 2012 అక్టోబర్ 31
రెండో దశ హైదరాబాద్, విశాఖపట్టణం సహా దేశ వ్యాప్తంగా 38 నగరాలు 2013 మార్చి 31
మూడో దశ దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపల్ పట్టణాలు 2015 డిసెంబర్ 31
నాలుగో దశ మిగిలిన గ్రామీణప్రాంతాలన్నీ 2016 డిసెంబర్ 31

డిజిటైజేషన్ కోసం సవరించిన కేబుల్ చట్టం, ట్రాయ్ నిర్దేశించిన నిబంధనల ముఖ్యాంశాలివి :

1. ఉచిత చానల్స్ అయినా, పే చానల్స్ అయినా అన్ని ప్రసారాలూ డిజిటల్ మాత్రమే అయి ఉండాలి. ఎమ్ క్రిప్ట్ చేసి ఉండాలి. చందాదారు యాజమాన్య వ్యవస్థ ( SMS ) చేత నియంత్రించబడాలి. అంటే, అంతా పద్ధతిప్రకారం, లెక్కప్రకారం జరగాలి.
2. కేబుల్ టీవీ ద్వారా అందించే ప్రసారాలు రెండు స్థాయిలలో ఉండాలి. మొదటిది బేసిక్ ప్యాకేజ్. ఇందులో ఉచిత చానల్స్ ఉంటాయి. రెండోది పే చానల్స్ ప్యాకేజ్. ఈ రెండూ కూడా కచ్చితంగా డిజిటల్ విధానంలో మాత్రమే అందించాలి.
3. ఎన్ కోడింగ్, ఎన్ క్రిప్షన్, మల్టిప్లెక్సింగ్, మాడ్యులేషన్, డిజిటల్ ప్రసారం కోసం చానల్స్ ను కలపటం లాంటి పనులన్నీ జరిపే డిజిటల్ హెడ్ ఎండ్ ( కంట్రోల్ రూమ్ ) కోసం సమాచార, ప్రసారాల మంత్రిత్వశాఖ దగ్గర రిజిస్టర్ చేసుకోవాలి.
4. చందాదారునికి ధరల పట్టిక అందజేసి, అందులోనుంచి ఎంచుకునే అవకాశం ఇవ్వాలి. అదే విధంగా సెట్ టాప్ బాక్స్ సమకూర్చుకోవటానికి వీలున్న మార్గాలన్నీ అందుబాటులో ఉంచి స్వేచ్ఛనివ్వాలి. నేరుగా కొనుక్కోవటమా, అద్దెకు తీసుకోవటమా, వాయిదాల పద్ధతిలో కొనుక్కోవటమా అనేది చందాదారుడి ఇష్టం.
5. చందాదారుడు తనకు కావాల్సిన చానల్స్ ఎంచుకుంటూ సంబంధిత నియమనిబంధనలకు ఆమోదించి ఒప్పందం కుదుర్చుకునేలా చందాదారు దరఖాస్తు ( Subscriber Application Form – SAF ) అందజేసి నింపేట్టు చూడాలి. అది ఒక విధంగా హెడ్ ఎండ్ సర్వీస్ ప్రొవైడర్ కూ చందాదారుకూ మధ్య ఒప్పందం లాంటిది.
6. చందాదారునికి ఇచ్చే బిల్లు అంశాలవారీగా ఉండాలి. అంటే, ఉచిత చానల్స్ కు ప్రభుత్వం నిర్దేశించిన మొత్తం, పే చానల్స్ కు ఆ చందాదారు ఎంచుకున్న చానల్స్ కు ఒక్కోదానికి వసూలు చేస్తున్న మొత్తం, ఇంటర్నెట్ లాంటి వాల్యూ యాడెడ్ సేవలుంటే వాటి విలువ, విధించిన పన్నులు చూపిస్తూ బిల్లు ఇవ్వాలి. ఆ బిల్లులో స్పష్టంగా హెడ్ ఎండ్ చిరునామా, మంత్రిత్వశాఖ రిజిస్ట్రేషన్ నెంబర్, ఎంటర్టైన్మెంట్ టాక్స్ , సర్వీస్ టాక్స్, రిజిస్ట్రేషన్ నెంబర్లు, కేబుల్ ఆపరేటర్ ఐడి నెంబర్, చందాదారు ఐడి నెంబర్, సెట్ టాప్ బాక్స్ సీరియల్ నెంబర్ ఉండాలి.
7. కేబుల్ టీవీ నెట్ వర్క్ లు కేబుల్ వేసుకోవటానికి దారి హక్కు కల్పించాలి. ఈ బాధ్యత రాష్ట్రప్రభుత్వాలమీద, అక్కడి స్థానిక సంస్థలమీద ఉంటుంది.
8. కేబుల్ టీవీ కార్యకలాపాలకు పోస్టల్ డిపార్ట్ మెంట్ నుంచి రిజిస్ట్రేషన్ అవసరం. అదేవిధంగా హెడ్ ఎండ్ (కంట్రోల్ రూమ్) నడపటానికి సర్వీస్ ప్రొవైడర్ గా మరో పోస్టల్ రిజిస్ట్రేషన్ కావాలి. ఎమ్మెస్వో అయితే పంపిణీకోసం ఒకటి, తన సొంత పాయింట్ల నిర్వహణకోసం మరొకటి తీసుకోవాల్సి ఉంటుంది. డిజిటల్ హెడ్ ఎండ్ కోసం సమాచార ప్రసారాల మంత్రిత్వశాఖ లైసెన్స్ కావాలి.
9. కనీసం అందించాల్సిన ఉచిత చానల్స్ సంఖ్య 100 గా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వాటిలో వినోదం, సమాచారం అందించే చానల్స్ కలసి ఉండాలి. ఏ చానల్స్ ఎన్ని అనేది ఒక్కో రాష్ట్రంలో, ఒక్కో నగరంలో, ఒక్కో పట్టణంలో భిన్నంగా ఉండవచ్చు.
10. కనీస చానల్స్ అందించినందుకు ఆపరేటర్లు వసూలు చేసుకోవాల్సిన చందా మీద గరిష్ఠ పరిమితి విధించే అధికారం కేంద్ర ప్రభుత్వానికుంటుంది. ప్రస్తుతం ట్రాయ్ నిబంధనల ప్రకారం నెలకు వంద రూపాయలుంది.
11. డిజిటల్ హెడ్ ఎండ్ ఉన్న ఎమ్మెస్వోలు చందారేట్లు విడివిడిగానూ, ప్యాకేజీల రూపంలోనూ ఒక నిర్దిష్టమైన నమూనాలో ప్రచారం చేయాలి. నిజానికి ప్రతి చందాదారునికీ చందాదారు దరఖాస్తు ( SAF ) నింపే సమయంలో ఒక రేట్ కార్డ్ అందించి అదే కార్డును తన వెబ్ సైట్ లో కూడా ప్రదర్శించాలి.
12. ప్రతి డిజిటల్ హెడ్ ఎండ్ సర్వీస్ ప్రొవైడర్ తన పరిధిలో ఉన్న చందాదారుల జాబితా, చందా రేట్లు, ప్రాథమిక ప్యాకేజ్ కింద ఉచిత చానల్స్ తీసుకుంటున్నవాళ్ళు, పే చానల్స్ తీసుకుంటున్నవాళ్ళు తదితర వివరాలను నిర్దిష్టమైన ప్రొఫార్మాలో సమర్పించాల్సి ఉంటుంది. ఆ నివేదికలో చానల్స్ కు జరిపే చెల్లింపుల వివరాలు కూడా ఉండాలి.

డిజిటైజేషన్ : ఎవరికెంత లాభం ?

ఈ విధంగా అనలాగ్ నుంచి డిజిటల్ కు సాగే ప్రయాణం వల్ల ఈ గొలుసుకట్టులోని వివిధ వర్గాలు ఎలా లాభపడతాయో కూడా విశ్లేషించింది. మొత్తంగా చూస్తే వినియోగదారులు, చానల్ యజమానులు, ఎమ్ ఎస్ వోలు లాభపడతారని, అందరికంటే ఎక్కువగా ప్రభుత్వమూ లాభపడుతుందని తేల్చింది. ట్రాయ్ ఈ నిబంధనలు సిఫార్సు చేసే సమయంలో విశ్లేషించిన లాభదాయల వర్గాలివి.

వినియోగదారులకు ప్రయోజనాలు :

• ప్రసారాల వీడియో నాణ్యత మెరుగ్గా ఉంటుంది.
• ఎక్కువ చానల్స్ నుంచి కావాల్సినవి ఎంచుకోవచ్చు
• కోరుకున్న చానల్స్ కి మాత్రమే చెల్లించే అవకాశం ఉండటం వల్ల చందా బడ్జెట్ ని నియంత్రించుకోవచ్చు
• బ్రాడ్ బాండ్ సహా అనేక వాల్యూ యాడెడ్ సర్వీసులు అందుకునే అవకాశం ఉంటుంది.
• ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్ గైడ్ (EPG) వలన కార్యక్రమాల వివరాలు తెలుస్తాయి, చానల్స్ వేగంగా ఎంచుకోవచ్చు

కేబుల్ ఆపరేటర్ కి ప్రయోజనాలు :

• కచ్చితమైన లెక్కలతో పారదర్శకమైన సమాచారం ఉంటే సులభంగా వ్యాపార నిర్ణయాలు తీసుకోవచ్చు
• కనెక్షన్ల లెక్క తక్కువ చెబుతున్నారనే నిందనుంచి బయటపడవచ్చు.
• చందావసూళ్ళ విషయంలో ఎమ్ ఎస్ వో నిర్మొహమాటంగా వ్యవహరించి కనెక్షన్లు కట్ చేసే పరిస్థితులుండటం వలన మొండిబాకీలుండవు.
• పే చానల్స్ ను అడిగినవాళ్ళకు అడిగినట్టుగా ఇవ్వటం వలన అందరిమీదా భారం మోపనక్కర్లేదు
• బ్రాడ్ బాండ్, వాయిస్ ఆన్ డిమాండ్, వీడియో గేమింగ్, వీడియో రికార్డింగ్ లాంటి అదనపు సౌకర్యాలు కల్పిచి వాటికి డబ్బు వసూలు చేసుకోవచ్చు..
• ఎమ్ ఎస్ వో లు, ఆపరేటర్లు ఆదాయాన్ని పంచుకోవటంలో నిర్దిష్టమైన నిష్పత్తి ఉండటం వలన వివాదాలకు తావుండదు.

ఎమ్ ఎస్ వో లకు ప్రయోజనాలు

• డిజిటైజేషన్ లో అత్యధికంగా లబ్ధి పొందేది ఎమ్ ఎస్ వో లు మాత్రమే
• డిజిటైజేషన్ తరువాత వినియోగదారులనుంచి వసూలు చేసే చందా మొత్తాలు అనివార్యంగా పెరుగుతాయి. ముందుగా వాళ్ళు పే చానల్స్ తో టోకున ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కాబట్టి నేరుగా ఆపరేటర్లు తీసుకునేదానికంటే తక్కువ ధరకు వస్తాయి. బేరమాడే శక్తి పెరుగుతుంది.
• పెద్ద మొత్తంలో క్యారేజ్ ఫీజులు వస్తాయి. ముఖ్యంగా ఉచిత చానల్స్ పోటీపడి మరీ ఇస్తాయి. క్యారేజ్ ఫీజు తగ్గినట్టు చూపినా అది కేవలం పే చానల్స్ వారి గ్రూపుకు చెందినవే అయి ఉంటాయి. అందుకు బదులుగా తక్కువరేట్లకు వాళ్ళ పే చానల్స్ తీసుకుంటారు.
• ఆపరేటర్లకు చెందాల్సిన ఆదాయపు వాటాని నిర్దిష్టంగా పేర్కొనటం వలన వివాదాలు తలెత్తే అవకాశం లేదు.
డిటిహెచ్ ఆపరేటర్లకు ప్రయోజనాలు :
• డిజిటైజేషన్ లో చందాలు పెరుగుతున్నట్టు తేలగానే వినియోగదారులు డిటిహెచ్ వైపు మొగ్గుచూపుతారు కాబట్టి డిటిహెచ్ కి డిజిటైజేషన్ పరోక్షంగా లాభం చేకూర్చుతుంది.
• డిజిటైజేషన్ లోనూ సెట్ టాప్ బాక్స్ అవసరం ఉండటం వలన మరికొందరు డిటిహెచ్ పట్ల ఆసక్తి చూపే అవకాశముంది.
• ప్రాంతీయంగా ప్యాకేజీలు తయారుచేసి పోటీపడటం ద్వారా ఎమ్ ఎస్ వో లతో పోటీపడి వ్యాపారం పెంచుకోవటానికి డిటిహెచ్ ఆపరేటర్లు పోటీపడతారు.
• డిటిహెచ్ వినియోగదారులు తమ సర్వీస్ ప్రొవైడర్ ను మార్చుకునే అవకాశం కల్పించటం ద్వారా పోటీ తట్టుకునే ప్రయత్నం చేయవచ్చు.

చానల్స్ కి ప్రయోజనాలు :

• పే చానల్స్ కి కచ్చితమైన చందాదారుల సంఖ్య తెలియటం వలన ఆదాయం నష్టపోయే అవకాశం లేదు. ఆపరేటర్లు/ఎమ్ ఎస్ వోలు తగ్గించి చెబుతున్నారనే అనుమానాలకు తావుండదు
• ఇప్పటికంటే ఆదాయం కనీసం యాభై శాతం పెరుగుతుందని నమ్మకం
• ఆదాయం పెరగటం వలన కార్యక్రమాల నాణ్యత పెరిగే అవకాశముంది. ప్రకటనలమీద ఆధారపడటం తగ్గుతుంది.
• మరిన్ని చానల్స్ పే చానల్స్ గా మారే అవకాశం
• డిజిటైజేషన్ తరువాత ఎక్కువ చానల్స్ ప్రసారం చేయటానికి అవకాశం ఉండటం వలన క్యారేజ్ ఫీజు తగ్గటానికి అవకాశముంటుంది, ముఖ్యంగా ఉచిత చానల్స్ బాగా లాభపడతాయి.
ప్రభుత్వానికి ప్రయోజనాలు
• ఇప్పటిదాకా కేబుల్ రంగానికి సంబంధించిన సమాచారం కేవలం అంచనాలే తప్ప సరైన అంకెలు లేవు. ఇప్పుడు అన్నీ కచ్చితంగా తెలుస్తాయి. తగిన నిర్ణయాలు తీసుకోవటం సాధ్యమవుతుంది.
• ఇప్పటిదాకా కనెక్షన్ల సంఖ్య తక్కువగా లెక్కించటం వలన తక్కువగా వస్తున్న ఆదాయం ఇకమీదట గణనీయంగా పెరుగుతుందని అంచనా

డిజిటైజేషన్ నాణ్యత విషయంలో వినియోగదారుని హక్కులు :

1. రకరకాల స్కీముల వివరాలు, నిబంధనలు, షరతులు, చందా వివరాలు, సెట్ టాప్ బాక్స్ వివరాలు తెలుసుకోవచ్చు
2. చానల్స్ కు విడివిడిగా చందా కట్టే వెసులుబాటు వాడుకోవచ్చు
3. కేబుల్ ఆపరేటర్ కు చెల్లించే మొత్తానికి రశీదు పొందవచ్చు
4. ముందుగా చందా చెల్లించే విధానం ( ప్రీ పెయిడ్ చందా చెల్లింపు ) లోనూ బిల్లు వివరాలు తెలుసుకోవచ్చు
5. నెల నుంచి మూడు నెలలవరకు విరామం కావాలంటే సేవలు ఆపమని అడగవచ్చు. అంటే, పిల్లల పరీక్షల సమయంలో టీవీ వద్దనుకుంటే వద్దని చెప్పవచ్చు. 15 రోజుల ముందుగా తెలియజేస్తే, వద్దనుకున్న కాలానికి చందా కట్టనక్కర్లేదు. అయితే, సెట్ టాప్ బాక్స్ ను అద్దె పద్ధతిలో తీసుకుంటే దాని అద్దె మాత్రం కట్టాలి.
6. చందాదారుడు ఎప్పుడైనా చెల్లింపు విధానాన్ని ప్రీ పెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ కు మార్చుకోవచ్చు. అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదు..

పరిశ్రమకు ప్రయోజనాలు

• సరైన గణాంకాలు లేకపోవటం వలన ఇప్పటివరకూ కేబుల్ రంగాన్ని పరిశ్రమగా గుర్తించటానికి అనేక అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా చాలాచోట్ల బ్యాంకులు అప్పివ్వటానికి వెనుకాడుతున్నాయి. ఇకమీదట అలాంటి సమస్యలుండవు. పరిశ్రమ పరిమాణాన్ని, విలువను అంచనావేయటానికి సిఐఐ, ఫిక్కీ లాంటి సంస్థలకు వెసులుబాటు కలుగుతుంది. పరిశ్రమ ఎదుగుదలకూ అది దోహదం చేస్తుంది.
• పే చానల్స్ కు ఆదరణ ఉండటం వలన నాణ్యత పెంచుకొని పే చానల్స్ గా మారటానికి ప్రయత్నాలు మరింతగా పెరుగుతాయి. దీంతో పెట్టుబడులు విపరీతంగా వస్తాయి. విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది.
• సినిమాల శాటిలైట్ హక్కుల ధరలూ బాగా పెరుగుతాయి. పే చానల్స్ మధ్య పోటీ వలన ఇది తప్పనిసరి అవుతుంది, ఎంటర్టైన్మెంట్ చానల్స్ లో విదేశీ ప్రత్యక్షపెట్టుబడుల మీద ఆంక్షలు లేకపోవటం ఈ పరిస్థితులకు దోహదం చేస్తుంది.
• పారదర్శకత వలన రేటింగ్స్ లెక్కించటానికి ఆధారపడదగిన శాంపిల్ తీయవచ్చు. కచ్చితమైన రేటింగ్స్ వస్తే ప్రకటనదారులు ఆ రేటింగ్స్ మీద ఆధారపడవచ్చు
• ఎమ్మెస్వో కీలకం కావటం వలన ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్గదర్శకాలు జారీచేసి వాళ్ళ ద్వారా అమలు చేయటం సులభమవుతుంది

మొదటి రెండు దశల అమలు తీరు

నిజానికి డిజిటైజేషన్ అమలులో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతూ వస్తున్నాయి. చాలా వరకూ ముందుగా ఊహించని సమస్యలే. మరికొన్ని కోర్టు కేసులూ రావటంతో జాప్యం అనివార్యమైంది. డిజిటల్ లైసెన్స్ లు త్వరగా ఇవ్వాల్సి రావటంతో ముందు తాత్కాలిక పద్ధతిమీద ఇచ్చి ఆ తరువాత శాశ్వత లైసెన్సులు మంజూరు చేసిన సందర్భాలున్నాయి. కొంతమంది పెద్ద ఎమ్మెస్వోలకు లైసెన్స్ రద్దు చేసిన ఘటనలు కూడా తీవ్ర కలకలం రేపాయి. మొత్తమ్మీద డిజిటైజేషన్ అమలు చాలా వేగంగా, హడావిడిగా జరగాలనుకోవటం వలన అనేక సమస్యలు తలెత్తాయి. అదే సమయంలో సెట్ టాప్ బాక్సుల అందుబాటు గురించి పట్టించుకోకపోవటం, విదేశీ సెట్ టాప్ బాక్సులమీదనే ఆధారపడాల్సి రావటం మరికొన్ని కారణాలు.

డిజిటైజేషన్ అమలు తీరు పర్యవేక్షించటానికి ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటైంది. అయితే, ఎమ్మెస్వో గొడౌన్ నుంచి ఎన్ని సెట్ టాప్ బాక్సులు బయటికెళ్ళాయన్నదే విజయానికి సంకేతంగా మారింది తప్ప వాటి నాణ్యత గురించి పట్టించుకోలేదు. హెడ్ ఎండ్ ( కంట్రోల్ రూమ్ ) పరికరాల నాణ్యత విషయంలోనూ అదే హడావిడి వలన నాణ్యత మీద దృష్టిపెట్టకపోవటం స్పష్టంగా కనిపించింది. మొదటి రెండు దశల్లోని చందాదారులకు అసలు డిజిటైజేషన్ పట్ల ఎంతమాత్రమూ అవగాహన ఏర్పడలేదు.

అందువల్లనే చందాదారుల దరఖాస్తులు నింపటం, కావాల్సిన చానల్స్ ఎంచుకోవటం లాంటి పనుల్లో తీవ్రమైన జాప్యం జరిగింది. దీనివలన ఎమ్మెస్వోలు కూడా SMS అమలు చేయలేకపోయారు. ఫలితంగా చందాదారులకు కోరుకున్న చానల్స్ కు అనుగుణంగా బిల్లు అందుకునే అవకాశం లేకుండా పోయింది. చాలామంది అసలు రేట్ కార్డ్ చూడలేదని కూడా ఫిర్యాదులు చేయటం మొదలుపెట్టే పరిస్థితి వచ్చింది. అందమైన యాంకర్లు టీవీ తెరమీద ప్రత్యక్షమై చందాదారుల దరఖాస్తులు నింపాల్సిన అవసరాన్ని పదే పదే గుర్తు చేస్తూ ఉన్నా , ఇంకా ఆశించిన ప్రయోజనం కనబడ్డం లేదు.

ఇప్పటివరకూ చూస్తే మొదటిరెండు దశల గడువు తేదీలు పూర్తయినా డిజిటైజేషన్ చట్టం ఆశించిన విధంగా అమలుకాలేదనే చెప్పాలి. ఇప్పుడు మనం మూడో దశలో ఉన్నాం. కండిషనల్ యాక్సెస్ సిస్టమ్ తరహాలోనే ఇందులోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎప్పటికప్పుడు గడువుతేదీలు పొడిగించుకుంటూ పోతున్నా పూర్తిగా కొలిక్కి వచ్చిన దాఖలాలు లేవు.మూడు, నాలుగు దశలకోసం బాగా ఎక్కువ సమయం ఇవ్వటం ద్వారా సమస్యలు పరిష్కరించవచ్చునని ప్రభుత్వం భావిస్తోంది. నిజానికి అధికారులకు క్షేత్రస్థాయి సమస్యలమీద అవగాహన లేకపోవటం వల్లనే ఆచరణ యోగ్యం కాని గడువు తేదీలు పెట్టి మాటిమాటికీ పొడిగించాల్సి వస్తున్నదన్న విషయం స్పష్టమైంది.

గడువు తేదీ లోగా పూర్తి చేయాలనే లక్ష్యం మీద మాత్రమే దృష్టిపెట్టటం వలన చౌక రకం హార్డ్ వేర్ రంగప్రవేశం చేసింది. ఇది ప్రైవేట్ పట్టుబడులకు సంబంధించినది కావటంతో ప్రభుత్వం పట్టించుకోలేదు. హెడ్ ఎండ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కూడా నత్త నడక నడిచింది. మొత్తం దాదాపు 6 వేల హడ్ ఎండ్స్ ఉంటాయని అంచనావేయగా నాలుగు వందలు కూడా రిజిస్టర్ కాలేదు. ఇటీవలే వేగంగా లైసెన్సులు మంజూరు చేసేందుకు ప్రతి నెలా రెండేసి సార్లు సమావేశాలు జరుపుతూ దరఖాస్తు దారుల సమస్యలు పరిష్కరిస్తూ జాప్యానికి కారణాలు తెలుసుకొని తగిన చర్యలు తీసుకుంటున్నారు.

ఇలా ఉండగా, మరొక ప్రత్యామ్నాయమార్గంగా హిట్స్ ( హెడ్ ఎండ్ ఇన్ ద స్కై ) రంగంలో దిగింది. దీనివలన లైసెన్సులకోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదు. జైన్ హిట్స్ ఇప్పటికే తగిన ఏర్పాట్లు పూర్తిచేసి మార్కెట్లో దిగగా, కాస్త ఆలస్యంగా వచ్చిన హిందుజా వెంచర్స్ వారి ఇన్ కేబుల్ నెట్ ఎమ్మెస్వో కూడా లైసెన్స్ తీసుకొని చిన ఎమెస్వోలను ఆకట్టుకునే పనిలో పడింది. ఇంత భారీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటం సంగతెలా ఉన్నా, కనీసం ఆపరేటర్లకు వివరించటానికి కూడా ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లూ చేయకపోవటం దురదృష్టకరం. ఒక శిక్షణా సంస్థను గాని, సలహా కేంద్రాన్ని గాని ఏర్పాటుచేయకపోవటం మాత్రం కచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది.
డిజిటైజేషన్ లక్ష్యానికి ఒక సలహా వ్యవస్థ లేని లోపం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. దీనివలన అమలులో మరింత ఆలస్యం జరగటం ఖాయమన్న అభిప్రాయం కలుగుతోంది. ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నప్పటికీ చాలా విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వాల అవసరం ఉండటం మరో కారణం.

ఎంటర్టైన్మెంట్ టాక్స్ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉండటం వలన చాలా వ్యత్యాసాలు కనబడుతున్నాయి. దానికి బదులుగా కేంద్ర ప్రభుత్వమే కేబుల్ టీవీ టాక్స్ పేరుతో ఒకే విధమైన టాక్స్ వసూలు చేసి ఆ మొత్తం నుంచి రాష్ట్రాలకు అక్కడి కేబుల్ కనెక్షన్ల సంఖ్య ఆధారంగా కొంత శాతాన్ని తిరిగి ఇవ్వటం సమంజసంగా ఉంటుంది. అప్పుడు పన్ను విధింపులో ఏకరూపత వస్తుంది. ఆ విధంగా రెండు సార్లు పన్ను విధింపుకు గురయ్యే సమస్య నుంచి కేబుల్ పరిశ్రమ బయటపడగలుగుతుంది. మొత్తంగా చూస్తే, డిజిటైజేషన్ చట్టం భారత దేశ కేబుల్ పరిశ్రమలో ఒక చరిత్రాత్మకమైన ఘట్టం. ఇది కన్వర్జెన్స్ ఫలితాలు అందరికీ అందటానికి దోహదం చేస్తుంది. కేబుల్ ద్వారా బ్రాడ్ బాండ్ వంటి సేవలందిస్తూ డిజిటల్ డివైడ్ ను తొలగించగలుగుతుంది.

కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత డిజిటైజేషన్ అమలును సమీక్షించి అనేక నిర్ణయాలు తీసుకుంది. వాస్తవంగా అమలవ్వటానికి పట్టే సమయాన్ని గుర్తించి గడువు బాగా పెంచింది. సెట్ టాప్ బాక్సుల భారాన్ని తగ్గించే దిశలో స్వదేశీ సెట్ టాప్ బాక్సుల తయారీని ప్రోత్సహిస్తూ రాయితీలు ప్రకటించింది. రెండో హిట్స్ ఆపరేటర్ కు కూడా లైసెన్స్ మంజూరు చేయటం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్వతంత్ర ఆపరేటర్లకు పెట్టుబడి భారం తగ్గించేందుకు దోహదం చేస్తోంది. పరిస్థితిని పూర్తిగా అవగాహన చేసుకొని ఎమ్మెస్వోలు సొంత డిజిటల్ హెడ్ ఎండ్ పెట్టుకోవటమా, హిట్స్ మీద ఆధారపడటమా అనేది నిర్ణయించుకోవాలి. నిజానికి కేబుల్ వ్యాపారంలో ఇది అత్యంత కీలకమైన ఘట్టం. అందరూ అప్రమత్తంగా ఉండి సరైన నిర్ణయం తీసుకోవాల్సిన సమయం.


డిజిటైజేషన్ తో క్యారేజ్ ఫీజు తగ్గుతుందా?

డిజిటైజేషన్ పూర్తయ్యాక క్యారేజ్ ఫీజు తగ్గుతుందనేది కొన్ని చానల్స్ వాదన. ఎక్కువ చానల్స్ ఇవ్వటానికి అవకాశముంటుంది కాబట్టి ఎమ్మెస్వోలు అనివార్యంగా అన్ని చానల్స్ ఇస్తారనేది వాళ్ళ అభిప్రాయం. కానీ అది పూర్తిగా నిజం కాదు. ఇది చాలా సంక్లిష్టమైన వ్యవహారం. ఆదాయం తగ్గిపోతుందని ఎమ్మెస్వోలు ఎంతమాత్రమూ భయపడాల్సిన అవసరం లేదు. డిజిటైజేషన్ లక్ష్యాలలో ఒకటిగా కారేజ్ ఫీజు తగ్గటం గురించి ప్రస్తావించినప్పటికీ ఆచరణలో పూర్తిగా అలా జరిగే అవకాశం లేదు.

గతంలో అనలాగ్ వ్యవస్థలో Must Carry Rules పేరుతో తప్పకుండా ప్రసారం చేయాల్సిన చానల్స్ లో దూరదర్శన్ చానల్స్ ను పేర్కొన్న సంగతి తెలిసిందే. డిజిటైజేషన్ తరువాత ప్రాంతీయ చానల్స్ ప్రసారం చేయాలని చెబుతునప్పటికీ కారేజ్ ఫీజు విషయంలో వ్యవహారం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఎంత ఫీజు వసూలు చేసుకోవచ్చుననేది కనెక్షన్ల సంఖ్యను బట్టి నిర్థారించాలని ట్రాయ్ భావిస్తున్నప్పటికీ ఇంకా ఇది చర్చల దశలోనే ఉంది. ఒక కనెక్షన్ కు ఏడాదికి ఒక రూపాయి చొప్పున తీసుకోవటం సమంజసంగా భావిస్తున్నట్టు ట్రాయ్ తన అభిప్రాయం చెప్పింది. నిజానికి ఇది ట్రాయ్ అభిప్రాయం అనటం కంటే ఉచిత చానల్స్ యాజమాన్యాలు ట్రాయ్ కి చేసిన విజ్ఞప్తి అనే చెప్పాలి. ఎమ్మెస్వోల సంఘాలు మాత్రం కనీసం కనెక్షన్ కు ఆరు రూపాయలుండాలని కోరాయి. డిజిటైజేషన్ పూర్తయ్యేలోగీ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశముంది.

ఒకవేళ ఎమ్మెస్వోలకు కారేజ్ ఫీజు ఆదాయం తగ్గినా, ప్లేస్ మెంట్ ఫీజు వసూలు చేసుకోవచ్చు. ఈ విషయంలో ట్రాయ్ ఎలాంటి అభ్యంతరాలూ చెప్పలేదు. ఇది పూర్తిగా సప్లై – డిమాండ్ సూత్రం మీద ఆధారపడి ఉంటుంది. ఒక చానల్ ను ఫలానా క్రమంలో పెట్టాలని ఆ చానల్ యజమాని కోరుకున్న పక్షంలో దానికి గాను కొంత మొత్తం చెల్లించాలని ఎమ్మెస్వో కోరవచ్చు. అదే ప్లేస్ మెంట్ ఫీజు. రెండు బాగా పేరుమోసిన చానల్స్ మధ్య పెట్టటం ద్వారా ప్రేక్షకులు ఆ చానల్స్ మార్చుతున్నప్పుడు ఇది వాళ్ళ దృష్టిలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లేస్ మెంట్ కోసం పోటీపడి చెల్లించే చానల్స్ ఉంటాయి. దీన్ని ఎమ్మెస్వోలు అదనపు ఆదాయ వనరుగా మార్చుకుంటారు.

మొత్తం మీద డిజిటైజేషన్ లో Must Carry Rules కింద స్థానిక చానల్స్ అన్నీ ప్రసారం చేయాల్సి వచ్చినా ఉచిత చానల్స్ ప్రసారానికి సైతం ఖర్చవుతుందికాబట్టి కారేజ్ ఫీజును నియంత్రించటం సాధ్యం కాదు. ఇంకా చెప్పాలంటే ఈ కారేజ్ ఫీజు ఒప్పందాలను కూడా ట్రాయ్ కి సమర్పించాలనే నిబంధన ఉంది. ఇతర చానల్స్ తో పోటీ పడే క్రమంలో ఏ చానల్ కూడా క్యారేజ్ ఫీజు చెల్లింపును వ్యాపార వ్యూహంలో భాగంగా పరిగణిస్తుందే తప్ప భారంగా భావించదు. అందువలన క్యారేజ్ ఫీజు తగ్గుతుందన్న వాదనలో పసలేదు. పైగా, రేటింగ్స్ విధానంలో మార్పు వలన రేటింగ్స్ మీటర్ల సంఖ్య పెరగటంతోబాటే విస్తృతి కూడా పెరుగుతుంది. అందువలన మీటర్లున్న పట్టణాలకే క్యారేజ్ ఫీజు చెల్లించటం ద్వారా రేటింగ్స్ పెంచుకోవాలనే ఆలోచించేవాళ్ళ ధోరణికీ అడ్డుకట్ట పడుతుంది. ఇది కూడా ఎమ్మెస్వోలకు అనుకూలించే అంశమే.