• Home »
  • Cable »
  • ఎమ్మెస్వోలమీద ఋణ భారం మోపిన డిజిటైజేషన్

ఎమ్మెస్వోలమీద ఋణ భారం మోపిన డిజిటైజేషన్

గడిచిన మూడేళ్ళలో ఎమ్మెస్వోల పరిధిలో డిజిటల్ కేబుల్ చందాదారుల సంఖ్య గణనీయంగా, చురుగ్గా పెరిగినమాట నిజం.వాళ్ళ వాటా మూలధనం పెరగటం, వాళ్ళ నెట్ వర్క్ ల విలువ పెరగటం కూడా నిజం. కానీ డిజిటైజేషన్ లో భాగంగా డిజిటల్ హెడ్ ఎండ్ ఏర్పాటు చేయటం మొదలుకొని సెట్ టాప్ బాక్సులమీద పెట్టుబడి దాకా పెద్ద ఎత్తున డబ్బు అవసరం కావటంతో అప్పుల భారం పెరగటం కూడా అంతే నిజం.

డెన్ నెట్ వర్క్ ఒక్కటే గత మూడేళ్ల కాలంలో సెట్ టాప్ బాక్సులకోసం రూ.1181.7 కోట్లు ఖర్చు చేసింది. అదే సమయంలో సిటీ కేబుల్ రూ. 607.5 కోట్లు పెట్టుబడి పెట్టింది. సగటున ఒక్కో సెట్ టాప్ బాక్స్ ఖరీదు రూ. 1,000 నుంచి రూ. 1800 ఉండగా అందులో రూ. 600 నుంచి రూ. 800 మాత్రమే చందాదారుడినుంచి తిరిగి వచ్చింది. దీంతో ఒక్కో కనెక్షన్ కు నికరంగా రూ. 800నుంచి రూ. 1000 మేరకు ఎమ్మెస్వో భరించి సబ్సిడీ రూపంలో చందాదారులకు పంచాల్సి వచ్చింది.
జాతీయ స్థాయి ఎమ్మెస్వోలు సెట్ టాప్ బాక్సులకోసం పెట్టిన పెట్టుబడి వివరాలు

వివరాలు డెన్ నెట్ వర్క్స్ సిటీ కేబుల్
2012-13 2013-14 2014-15 2012-13 2013-14 2014-15
సెట్ టాప్ బాక్సుల వ్యయం(కోట్లు) 487.4 532.7 161.5 262.3 168.9 176.3
అమర్చిన సెట్ టాప్ బాక్సులు 31లక్షలు 29 లక్షలు 10 లక్షలు 24 లక్షలు 16 లక్షలు 14 లక్షలు
ఒక్కో బాక్స్ కు సగటు పెట్టుబడి 1,572 1,837 1,615 1,093 1,056 1,259

జాతీయ స్థాయి ఎమ్మెస్వోలు మొదటి రెండు దశల డిజిటైజేషన్ కోసం వాటాల రూపంలో చెప్పుకోదగిన మొత్తాన్ని పెట్టుబడులుగా సేకరించారు. కీలకమైన ఎమ్మెస్వోలు గడిచున మూడేళ్ళ కాలంలో దాదాపు రెండేసి వేలకోట్లకు పైగా ఆ విధంగా సమీకరించుకున్నారు. ఉదాహరణకు హాత్ వే పెట్టుబడుల సమీకరణను పరిశీలిస్తే, ఈ కింది అంశాలు వెల్లడవుతాయి.

హాత్ వే మూలధన వ్యయం, సేకరించిన పెట్టుబడులు
మొత్తం ( రూ. కోట్లలో ) 2012-13 2013-14 2014-15
పెట్టుబడి మూలధనం 468.0 837.2 440.8
తాజా వాటా మూలధనం 3.7 247.7 446.8
తాజా దీర్ఘకాల అప్పులు 387.0 669.8 230.6
అప్పుల ద్వారా నికరంగా వచ్చిన మొత్తం 326.8 420.3 (28.9)

ఏమైనప్పటికీ మూడు, నాలుగు దశల డిజిటైజేషన్ కోసం పెట్టుబడులు సమీకరించుకోవటమంటే అప్పులు తెచ్చుకోవటమే అవుతోంది. బ్రాడ్ బాండ్, వాల్యూ యాడెడ్ సర్వీసుల పేర్లు చెప్పి నిధులు తెచ్చుకోవాల్సి వస్తోంది. వచ్చే రెండేళ్ళలో కూడా ఈ అప్పుల స్థాయి చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో డిజిటైజ్ అయిన ప్రాంతాల్లో లాభదాయకత కూడా పుంజుకొని క్రమంగా స్థిరపడవచ్చు. క్రెడిట్ రేటింగ్ సంస్థ ఇక్రా ఇదే విషయాన్ని ఇటీవలి నివేదికలో వెల్లడించింది.
మూడు, నాలుగు దశల డిజిటైజేషన్ కోసం అప్పులద్వారా నిధులు సమకూర్చుకోవటం ఒక్కటే మార్గంగా కనిపిస్తూ ఉండటంతో ఎమ్మెస్వోల పరపతి హోదా పెద్దగా మెరుగుపడే అవకాశాలు కనబడ్డం లేదని ఇక్రా వ్యాఖ్యానించింది. మూడో దశ ఈ ఏడాది చివరికే పూర్తి కావస్తూ ఉండటం, నాలుగో దశకు మళ్ళీ ఏడాది మాత్రమే గడువు ఉండటంతో ఎమ్మెస్వోలకు ఏ మాత్రం విరామం దొరికే వీల్లేదు.
సిటీ కేబుల్ మూలధన వ్యయం, సేకరించిన పెట్టుబడులు
మొత్తం ( రూ. కోట్లలో ) 2012-13 2013-14 2014-15
పెట్టుబడి మూలధనం 379.7 485.3 294.7
తాజా వాటా మూలధనం 81.0 243.0 218.9
తాజా దీర్ఘకాల అప్పులు 572.0 460.9 289.4
అప్పుల ద్వారా నికరంగా వచ్చిన మొత్తం 567.9 324.4 133.4
అయితే, పెట్టిన పెట్టుబడి మీద ప్రతిఫలం అందటానికి పట్టే సమయం ఊహించినదానికంటే ఎక్కువగా ఉండటం, డిజిటైజేషన్ జరిగిన మొదటి రెండు దశల ప్రాంతాల్లో బ్రాడ్ కాస్టర్ల కంటెంట్ ధర విపరీతంగా పెరిగిపోవటం, మూడు, నాలుగు దశలకు భారీ పెట్టుబడులు పెట్టాల్సి రావటం కారణంగా ఎమ్మెస్వోలకు ఆశించిన ప్రతిఫలాలు ఇప్పట్లో వచ్చే అవకాశాలు కనబడటం లేదని ఇక్రా అంచనా వేస్తోంది. మూడు, నాలుగు దశల్లో ధరలు బాగా ప్రభావితం చేస్తాయి కాబట్టి ఒక్కో కనెక్షన్ కు వచ్చే సగటు ఆదాయం రాబోయే కొద్ది సంవత్సరాలలో కాస్త ఇబ్బందికరంగానే ఉంటుందని ఇక్రా భావిస్తోంది.
డెన్ నెట్ వర్క్స్ మూలధన వ్యయం, సేకరించిన పెట్టుబడులు
మొత్తం ( రూ. కోట్లలో ) 2012-13 2013-14 2014-15
పెట్టుబడి మూలధనం 531.2 584.0 316.8
తాజా వాటా మూలధనం 6.8 934.3 0.3
తాజా దీర్ఘకాల అప్పులు 279.6 417.5 166.7
అప్పుల ద్వారా నికరంగా వచ్చిన మొత్తం 277.9 260.7 (30.6)

టీవీ పంపిణీ రంగం చాలావరకు టెక్నాలజీతో అనుసంధానమై ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్నవాళ్ళు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని పాటించవలసి వస్తుంది. ఈ క్రమంలో పాత పరికరాలకు పాతరేయక తప్పదు. ఎప్పటికప్పుడు ఇదొక అదనపు భారంగా మారే ప్రమాదముంది. అదే సమయంలో విదేశీ మారకద్రవ్యపురేట్లు కూడా మారిపోతూ ఉండటం దిగుమతులమీద తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అదే కాకుండా అనలాగ్ నుంచి డిజిటల్ కు మారే ఈ సమయంలో సెట్ టాప్ బాక్సులకోసం పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. సెట్ టాప్ బాక్సుల కొనుగోలు కోసం, అమర్చటం కోసం ఎక్కువ పెట్టుబడి, సమయం వెచ్చించాల్సి వస్తుంది.

ఎమ్మెస్వోల అవసరాలకు తగిన స్థాయిలో స్వదేశీ సెట్ టాప్ బాక్సుల తయారీ లేకపోవటం కూడా ఒక ప్రధాన అవరోధంగా తయారైంది. అకస్మాత్తుగా పెరిగిన డిమాండ్ ను స్వదేశీ తయారీదారులు తట్టుకోలేకపోతున్నారు. ఫలితంగా 2012-14 మధ్య కాలంలో విదేశీ సెట్ టాప్ బాక్సులమీద ఆధారపడటం బాగా ఎక్కువైంది. దీంతో విదేశీ మారకద్రవ్యపు రేట్లలో ఒడిదుడుకులు చాలా ప్రభావం చూపుతూ వచ్చాయి. అయితే, డిజిటైజేషన్ గడువు పెంచటం స్వదేశీ సెట్ టాప్ బాక్సుల తయారీకి, పంపిణీకి కొంతమేరకు వెసులుబాటు కలిగింది.

గడిచిన మూడు సంవత్సరాలలో మొదటి రెండు దశల్లో ఇన్ ఫ్రా స్ట్రక్చర్ లోను, సెట్ టాప్ బాక్సులలోను పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టిన ఎమ్మెస్వోలు దాని మీద ఆదాయం అంతంత మాత్రంగా ఉండటంతో ఇబ్బంది పడుతున్నారు. డిజిటైజేషన్ అమలులో క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సవాళ్లే అందుకు ప్రధాన కారణం. వీటన్నిటి ఫలితంగా రెండేళ్ల కాలంలో వడ్డీ, పన్నులు, తరుగుదలపోను ఉండే నిర్వహణ లాభాలు తగ్గిపోయాయి. నగదు కదలిక తగ్గిపోయింది. అప్పులు తెచ్చిన మొత్తాలు చిక్కుబడిపోయాయి. మరోవైపు కేబుల్ ఆపరేటర్ల నుంచి వసూలు కావాల్సిన చందాలు నాలుగైదు నెలలుగా ఆలస్యం కావటం, చానల్స్ నుంచి అందాల్సిన కారేజ్ ఫీజు అలస్యం కావటం అదనపు సమస్యలు తెచ్చిపెట్టాయి.

పెరిగిన నిర్వహణ మూలధనం అవసరాలను బ్యాంక్ అప్పులే ఆదుకుంటూ ఉండగా కొన్ని రానిబాకీల కింద కొట్టేయాల్సి రావటంతో ఎమ్మెస్వోల పరపతి హోదాను దెబ్బతీశాయి. దీంతో ఎమ్మెస్వోలకు అప్పులివ్వటంలో చాలా బ్యాంకులు కఠినంగా వ్యవహరిస్తున్నాయని కూడా ఇక్రా నిర్థారించింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కొంతమంది ఎమ్మెస్వోలు బకాయిపడ్డ ఆపరేటర్లకు సిగ్నల్స్ నిలిపివేయటం, నోటీసులు పంపటం లాంటి చర్యల ద్వారా కొంత ఘర్షణ పూరితమైన వాతావరణానికి తావిచ్చారు. అయితే, ఆపరేటర్లకూ, ఎమ్మెస్వోలకూ మధ్య సయోధ్య ఏర్పడి ఆమోదయోగ్యమైన ఒప్పందాలు చేసుకొని సజావుగా అమలు చేయగలిగితే పరిస్థితిలో కొంత మార్పు రావచ్చునని ఇక్రా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అప్పుడే ఎమ్మెస్వోల నగదు నిల్వలు పెరుగుతాయని చెబుతోంది.