డిస్కవరీలో ఇక మరిన్ని భారత్ కార్యక్రమాలు

భారతదేశంలో రూపొందించిన కార్యక్రమాలకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతోందని డిస్కవరీ చానల్ అంచనావేసింది. అందుకే ఇకమీదట ఈ కార్యక్రమాల తయారీని పెంచాలని నిర్ణయించింది. ఇందుకోసం స్థానిక నిపుణులనే ఉపయోగించుకోవాలని కూడా భావిస్తోంది. 1995 లో ఒకే చానల్ గా భారత్ లో ప్రవేశించిన డిస్కవరీ ఇప్పుడు ఐదు భాషల్లో 11 చానల్స్ ప్రసారం చేస్తోంది. దాదాపు 550 మంది అడ్వర్టయిజర్స్ తమ జాబితాలో ఉన్నారని డిస్కవరీ చెప్పుకుంటోంది.

ప్రపంచంలో మరెక్కడా లేనంతగా భారత్ లో మార్కెట్ విస్తరించటం వల్లనే డిస్కవరీ తో బాటు యానిమల్ ప్లానెట్, టిఎల్ సి, డిస్కవరీ సైన్స్, డిస్కవరీ టర్బో, డిస్కవరీ తమిళ్, డిస్కవరీ కిడ్స్, ఇన్వెస్టిగేషన్ డిస్కవరీ ప్రారంభించగలిగింది. ఇంకా డిస్కవరీ హెచ్ డి వరల్డ్, యానిమల్ ప్లానెట్ హెచ్ డి వరల్డ్, టిఎల్ సి హెచ్ డి వరల్డ్ కూడా అందిస్తోంది.

భారీగా ఖర్చు చేసి నాణ్యమైన కార్యక్రమాలు రూపొందిస్తుందని పేరుపొందిన డిస్కవరీ ఇప్పుడు భారతదేశంలోనూ అదే విధంగా ఖర్చు చేసి నాణ్యమైన కార్యక్రమాలు చేస్తుందని డిస్కవరీ దక్షిణాసియా ప్రతినిధి పెరెట్ చెప్పారు. ఈ సంవత్సరం భారత్, కొరియా దేశాల్లో 1000 గంటల కార్యక్రమాలు చేయాలని నిర్ణయించామన్నారు. ప్రాంతీయంగా అనేక కార్యక్రమాలకు పథక రచన జరుగుతోందని కూడా చెప్పారు.