• Home »
  • National Channels »
  • ఎ ఆర్ రహమాన్ మీద డిస్కవరీ డాక్యుమెంటరీ : ’జయ హో ’ పేరిట 26 న ప్రసారం

ఎ ఆర్ రహమాన్ మీద డిస్కవరీ డాక్యుమెంటరీ : ’జయ హో ’ పేరిట 26 న ప్రసారం

ప్రముఖ సంగీత దర్శకుడు ఎ ఆర్ రహమాన్ మీద డిస్కవరీ చానల్ ఒక డాక్యుమెంటరీ రూపొందించింది. ఇప్పటికే కొన్ని అంతర్జాతీయ స్థాయి చలన చిత్రోత్సవాలలో ప్రదర్శించగా భారతదేశంలో ఈ నెల 26న రాత్రి 9 గంటలకు ప్రసారం చేయాలని డిస్కవరీ చానల్ నిర్ణయించింది. రహమాన్ గురించి ముందెన్నడూ ప్రపంచానికి తెలియని అనేక ఆసక్తికరమైన అంశాలతోబాటు సంగీతం మీద దృష్టి సారించి ఈ డాక్యుమెంటరీ రూపొందించినట్టు దర్శకుడు ఉమేశ్ అగర్వాల్ చెబుతున్నారు.

ఈ డాక్యుమెంటరీ కేవలం తన చుట్టూ తిరగకుండా సంగీతం గురించి చెబుతూ తనను ప్రస్తావించటం తనకు బాగా నచ్చిందని రహమాన్ వ్యాఖ్యానించారు. ఎంతోమంది ప్రముఖులు వెలిబుచ్చిన అభిప్రాయాలు వినటం ఎంతో గర్వంగా ఉందన్నారు. స్లమ్ డాగ్ మిలియనేర్ కోసం జయ్ హో పాట చేయటం తన అదృష్టంగా భావిస్తున్నానని రహమాన్ చెప్పుకున్నారు.

ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసేలా, చాలా మంచి ఆలోచన వచ్చిందంటూ అభినందించేలా కార్యక్రమాలు రూపొందించటం డిస్కవరీ లక్ష్యమని, రహమాన్ మీద డాక్యుమెంటరీ విషయంలోనూ ప్రేక్షకులనుంచి అదే స్పందన వస్తుందని డిస్కవరీ నెట్ వర్క్స్ ఏషియా పసిఫిక్ జనరల్ మేనేజర్ రాహుల్ చెప్పారు. మిగిలిన కార్యక్రమాలన్నిటికీ ఇది భిన్నంగా ఉంటుందన్నారు.

రహమాన్ వ్యక్తిగత జీవితం, చదువు వదిలేసి చిన్న వయసులోనే ఉపాధి వెతుక్కుంటూ వెళ్ళటం మొదలుకొని ఆస్కార్, గ్రామీ గెలుచుకునేదాకా ఆయన జీవన యాత్ర ఇందులో కనబడుతుంది. మణిరత్నం రోజా కోసం పనిచేయటం, రంగీలా తో బాలీవుడ్ దృష్టిలో పడటం లాంటి అన్నిటినీ గుదిగుచ్చటానికి ఆరునెలల సమయం పట్టిందని డిస్కవరీ చెబుతోంది. “ ఆయనను కలుసుకోవటానికి ఆరునెలలుగా ప్రయత్నిస్తూనే వచ్చా. కాన్సెప్ట్, కంటెంట్ వివరించటానికి ఐదు నిమిషాలుపట్టింద” ని గుర్తుచేసుకుంటారు అగర్వాల్.