• Home »
  • International Channels »
  • 1965 నాటి భారత్-పాక్ యుద్ధానికి యాభై ఏళ్లు: 14 న డిస్కవరీలో ప్రత్యేక కార్యక్రమం

1965 నాటి భారత్-పాక్ యుద్ధానికి యాభై ఏళ్లు: 14 న డిస్కవరీలో ప్రత్యేక కార్యక్రమం

1965 నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధానికి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా డిస్కవరీ చానల్ “ 1965: India’s Battles and Heroes “ పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేస్తోంది. మాతృభూమి రక్షణకోసం భారత సైనికులు ప్రదర్శించిన అసమాన ధైర్యసాహసాలు, తెగువ, త్యాగాలు గుర్తు చేస్తూ సాగే ఈ కార్యక్రమం ఈ నెల 14 న రాత్రి 9 గంటలకు ప్రసారమవుతుంది. యుద్ధ ఘట్టాల దృశ్యాలను వాడుకుంటూ, ఆనాటి యుద్ధంలో పాల్గొన్నవారి ప్రత్యక్ష అనుభవాలను జోడిస్తూ రూపొందించిన ఈ ఎపిసోడ్ అదే సమయంలో డిస్కవరీ హెచ్ డి వరల్డ్ లోనూ ప్రసారమవుతుంది.

ఆపరేషన్ డిజర్ట్ హాక్ పేరుతో కచ్ ప్రాంతంలో ఆగస్టులో పాకిస్తాన్ ఈ యుద్ధాన్ని ప్రేరేపించిన ఘట్టంతో కార్యక్రమం మొదలవుతుంది. ఆ తరువాత బ్రిటిష్ ప్రధాని ఐసెన్ హోవర్ మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ, తిరిగి పాకిస్తాన్ ఆపరేషన్ జిబ్రాల్టర్ పేరుతో సైనికులను సామాన్య పౌరుల్లా జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖ దాటించటం, దీన్ని ఎదుర్కొంటూ భారత సైన్యం ఆపరేషన్ బక్షి చేపట్టటం ఇందులో వివరంగా ఉంటాయి. ఈ సమయంలోనే చొరబాట్లకు అత్యంత కీలకమైన హజీ పీర్ పాస్ ని భారత్ స్వాధీనం చేసుకుంది. పాకిస్తాన్ చేపట్టిన ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ లో సరిహద్దు పట్టణం అఖ్నూర్ ఆక్రమణతో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి సుదీర్ఘ యుద్ధానికి దేశాన్ని సమాయత్తం చేయటం, విజయం సాధించటం వరకు ఈ ఎపిసోడ్ వర్ణించింది.