18న డిస్కవరీలో ’షేర్పా’ కథ

భారీ మంచు తుపాను బారినపడిన షేర్పాల గాథను వివరించే 2 గంటల చిత్రాన్ని ఈ నెల 18న డిస్కవరీ ప్రసారం చేస్తోంది. ఎవరెస్ట్ శిఖరం చరిత్రలోనే దుర్దినంగా భావించే ఆ రోజున రాత్రి 9 గంటలకు ఈ చిత్రాన్ని అందించాలని డిస్కవరీ నిర్ణయించింది. అదే సమయంలో డిస్కవరీ హెచ్ డి వరల్డ్ లో,  డిస్కవరీ తమిళం లోను ఇది ప్రసారమవుతుంది.

కోటీ 40 లక్షల టన్నుల మంచు పడిన ఆ దారుణమైన సమయంలో 16 మంది షేర్పాల ప్రాణాలు బలితీసుకున్న ఆ దుర్ఘటనను ఇందులో చిత్రీకరించారు. నిజానికి వచ్చే పర్వతారోహణ సీజన్ లో దీన్ని ప్రసారం చేయాలని ముందు అనుకున్నారు. కానీ ఆ తరువాత నిర్ణయంమార్చుకొని మంచుతుపాను వచ్చిన దుర్దినం నాడే ప్రసారం చేయాలని నిర్ణయించారు.

ఆనాడు పర్వతారోహణ సమయంలో బయల్దేరిన అక్కడి గైడ్స్ మాటలు రికార్డు చేస్తూ,  అభిప్రాయాలు సేకరిస్తూ దుర్ఘటన దృశ్యాలను జోడిస్తూ ఈ చిత్రం సాగుతుంది. ఈ అద్భుతమైన చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 220 దేశాల్లో ప్రసారం చేస్తున్నారు. ఆస్ట్రేలియాకు చెందిన ఫెలిక్స్ మీడియా సహ వ్యవస్థాపకుడు బ్రిడ్జెట్,  బ్రిటన్ కు చెందిన యారో మీడియా జాయింట్ క్రియేటివ్ డైరెక్టర్ జాన్ స్మిత్ సన్ నిర్మించగా జెన్నిఫర్ పీడమ్ దర్శకత్వం వహించారు.